
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్‌లో ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. వారం క్రితం జానారెడ్డిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి రాకుండా మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.
అయితే, జానారెడ్డి ఎపిసోడ్‌పై రాజగోపాల్‌రెడ్డి.. బుధవారం స్పందించారు. ‘‘జానారెడ్డి అంటే నాకు గౌరవం. ఆయన మా పార్టీ సీనియర్ నేత. జానారెడ్డి రాసిన లెటర్‌పై ఒక సభలో మాట్లాడాను. మంత్రి పదవి పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి గట్టి హెచ్చరికలే చేశారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది.
..మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.