
రైతుల పేరిట దళారుల పత్తి విక్రయాలు.. సహకరించిన సీసీఐ, మార్కెటింగ్ అధికారులు.. విజిలెన్స్ విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలు
రైతు తెచ్చిన పత్తికి తేమ పేరిట కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరణ
ఆ పత్తి కొనుగోలు చేసి... అదే కేంద్రంలో అమ్మిన దళారులు
క్వింటాల్‌కు రూ.1,000–1,500 వరకు లాభం.. ఇప్పటికే ఏడుగురు మార్కెటింగ్ అధికారులపై వేటు
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని స్వయంగా రైతే విక్రయించాలి. ఒకవేళ కౌలు రైతులు పంట పండిస్తే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) చేయించి ఏఈవోల వద్ద మిస్సింగ్ డేటా కింద ధ్రువపత్రం తీసుకోవాలి. తర్వాత జిన్నింగ్ మిల్ వద్ద ఫొటో దిగి.. పండించిన పత్తిని మార్కెటింగ్ శాఖ ద్వారా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి విక్రయించాలి. వరంగల్ రీజియన్‌లోని ఓ జిన్నింగ్ మిల్లు వద్ద రైతుల పేరుతో దిగిన ఫొటోల్లో వార పత్రికల మీద కవర్ పేజీల్లో ఉన్న సినిమా తారల ఫొటోలు, పత్రికల్లో వివిధ సందర్భాల్లో వచ్చిన ఫొటోలు కనిపించడంతో విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు.
సాక్షి, హైదరాబాద్: పత్తి రైతుల ముసుగులో దళారులు, అధికారులు కుమ్మక్కయ్యారు. వానాకాలం సీజన్‌కు సంబంధించిన పత్తి రైతు ల పేరిట సాగించిన దందా.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సాగిస్తున్న విచారణలో వెలుగు చూస్తున్నట్టు సమాచారం. వానాకాలం సీజన్‌లో రూ.15,557 కోట్ల విలువైన 21లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తే అందులో 40 శాతం కొనుగోళ్లలో అవకతకవలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించింది. తద్వారా రైతులకు దక్కాల్సిన రూ.వేల కోట్లు పక్కదారి పట్టినట్లు వెల్లడైంది. ఈ విచారణ నివేదికను ప్రభుత్వానికి చేరితే..మార్కెటింగ్ శాఖతోపాటు సీసీఐ ఉద్యోగులు, సిబ్బందే కాకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) ధ్రువపత్రాలు ఇచ్చిన వ్యవసాయ శాఖ ఎక్స్‌టెన్షన్ అధికారులపై కూడా చర్యలు తప్పవని తెలుస్తోంది.
28.46 లక్షల మంది రైతులు పంట పండిస్తే... విక్రయించింది 8.58 లక్షల మందే..
రాష్ట్రంలో వానకాలం సీజన్‌లో 28,46,668 మంది రైతులు 44.73 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. 28.11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తే , కేవలం 25.45 ఎల్‌ఎంటీ వచ్చింది. ఇందులో 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని మార్కెటింగ్ శాఖ తెరిచిన 302 కొనుగోలు కేంద్రాల ద్వారా సీసీఐ సేకరించింది. ఇక్కడే దళారులు, అధికారులు కుమ్మక్కైన విషయం వెలుగు చూసింది. పత్తి విక్రయాల కోసం కనీసం 20 లక్షల మంది రైతులైనా రావాలి. కానీ కేవలం 8,85,894 మంది రైతులు మాత్రమే 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని విక్రయించినట్టు మార్కెటింగ్ శాఖ లెక్కల్లో చూపిస్తోంది. ఈ దందా ఉత్తర తెలంగాణలో అధికంగా సాగగా, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొంత తక్కువగా ఉంది.
రైతు తెచ్చిన పత్తిని తిరస్కరించి... దళారుల ద్వారా తిరిగి కొనుగోలు
రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తి తేగానే, తేమ 8 నుంచి 12 శాతం లోపు లేదని కొనుగోలుకు తిరస్కరిస్తారు. పత్తిని ఆరబెట్టి తీసుకొస్తేనే మద్ధతు ధర క్వింటాల్‌కు రూ. 7,521చొప్పున కొనుగోలు చేస్తారని మార్కెటింగ్ కార్యదర్శులు చెబుతారు. దీంతో అక్కడే ఉన్న దళారులు రంగ ప్రవేశం చేసి, రైతుల నుంచి క్వింటాల్‌కు రూ. 6,000 నుంచి రూ. 6,500 చొప్పున కొనుగోలు చేస్తారు. అదే పత్తిని అదే కొనుగోలు కేంద్రంలో దళారులు సాయంత్రం విక్రయిస్తారు. అందుకు అవసరమైన తాత్కాలిక రిజిస్ట్రేషన్ల ధ్రువపత్రాలను రైతుల పేరిట ఏఈవోల నుంచి తీసుకోవడం నుంచి జిన్నింగ్ మిల్లులో ఫొటోలు దిగడం వరకు అన్ని ప్రక్రియలు పూర్తవుతాయి. క్వింటాల్‌కు కనీసంగా రూ. 1,000–1,500 వరకు దోచుకొనే దళారులు, అధికారులతో కలిసి ఆదాయాన్ని పంచుకుంటారు.
క్రాప్ మిస్సింగ్ డేటాతో విక్రయాలు పోల్చడంతో దొరికిన దొంగలు
నాలుగేళ్లుగా ఏఈవోలు ప్రతి సీజన్‌లో క్రాప్ బుకింగ్ డేటా తయారు చేసి ప్రభుత్వానికి పంపుతున్నారు. ఇందులో భాగంగా గత డిసెంబర్ నుంచి జనవరి వరకు సాగిన సీసీఐ పత్తి అమ్మకాలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో దళారుల ప్రమేయం స్పష్టంగా కనిపించింది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏడుగురు మార్కెటింగ్ మేనేజర్లను సస్పెండ్ చేశారు. పూర్తి విచారణపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు.