Yadadri thermal power plant
-
‘భద్రాద్రి.. యాదాద్రి’పై సర్కారుకు నివేదిక
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు చోటు చేసుకున్నట్టు వచ్చి న ఆరోపణలపై విచారణ నిర్వహించిన జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్.. గడువు చివరి తేదీ అయిన గత నెల 28న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ప్రస్తుతం రాష్ట్ర ఇంధన శాఖ వద్ద ఈ నివేదిక ఉంది. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీనిపై సమీక్ష నిర్వహించడంతో పాటు కేబినెట్ భేటీలో చర్చించి తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర శాసనసభలో కూడా నివేదికను ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తదుపరి చర్యలకు సిఫార్సు టెండర్లు లేకుండా నామినేషన్ ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్కు అప్పగించడం, టెండర్లకు వెళ్లకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడంలో చోటు చేసుకున్న విధానపరమైన అవకతవకతలు, వీటితో రాష్ట్ర ఖజానాకు జరిగిన నస్టాన్ని కమిషన్ లెక్కగట్టినట్లు తెలిసింది. వీటికి సంబంధించిన నిర్ణయాలన్నీ నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని కమిషన్ నిర్ధారణకు వచ్చి నట్టు సమాచారం.ఆయనతో పాటు గత ప్రభుత్వంలోని ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులూ బాధ్యులని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో తదుపరి దర్యాప్తు కోసం తీసుకోవాల్సిన చర్యలను కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కాగా దీని ఆధారంగా ప్రభుత్వం కేసీఆర్‌తోపాటు ఇతరులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణకు ఆదేశించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కేసీఆర్‌ను విచారించకుండానే నివేదిక! తొలుత జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఏర్పాటు కాగా, ఆయన గత ప్రభుత్వంలోని మాజీ ప్రజాప్రతినిధులు, విద్యుత్ సంస్థల సీఎండీలు, ఇతర అధికారులు, ప్రస్తుత రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇతర సాక్షుల అభిప్రాయ సేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. పలువురికి క్రాస్ ఎగ్జామినేషన్ సైతం నిర్వహించారు. రాతపూర్వకంగా లేదా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయగా, ఆయన్నుంచి రాత పూర్వక సమాధానం అందింది.నిర్ణయాలను తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూనే..విచారణ కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగాల్సిందిగా జస్టిస్ నరసింహారెడ్డిని అప్పట్లో కేసీఆర్ కోరారు. కాగా విలేకరుల సమావేశంలో కేసీఆర్‌పై జస్టిస్ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు..విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందిగా జస్టిస్ నరసింహారెడ్డిని ఆదేశించింది. ఆయన స్థానంలో నియమితులైన జస్టిస్ లోకూర్..సాక్ష్యాలు, నివేదికల పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. కేసీఆర్ ఇచ్చి న జవాబును ఆయన పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ సమీక్ష గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ నిర్ణయాలకు సంబంధించి అందిన నివేదికపై సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. నివేదికలోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. -
‘యాదాద్రి’లో డిసెంబర్‌లోగా విద్యుదుత్పత్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని అన్ని యూనిట్ల (ఐదు)లో విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రా రంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నా రు. మిగతా రెండు యూనిట్లలో మార్చి 31 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. బుధవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనుల పురోగతిపై అ«ధికారులతో సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు.. మార్చి 31కి విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు సివిల్ పనులతోపాటు రైల్వే లైన్, రోడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు భట్టి చెప్పారు. బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇదే వేగంతో ప్రాజెక్టు పనులు పూర్తిచేసి యూనిట్ విద్యుత్తును రూ.6.35కు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు భూనిర్వాసితులకు భూసేకరణ నిధులతోపాటు, ప్రాజెక్టులో ఉద్యోగాలు కలి్పస్తామని, ఇచి్చన మాట ప్రకారం వారి కుటుంబాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. 2015 జూన్ 8న థర్మల్ పవర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన జరగ్గా, 2017 అక్టోబర్‌లో పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 నాటికి మూడు యూనిట్లు పూర్తి చేయాలని చేయాల్సి ఉన్నా.. చేయలేదన్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడిందని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమేనని మండిపడ్డారు. గత ప్రభుత్వం 50 శాతం దేశీయ బొగ్గును, 50 శాతం విదేశీ బొగ్గును వినియోగించాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా నూటికి నూరు శాతం దేశీయ బొగ్గును వినియోగించిందని, దీంతో పర్యావరణ వేత్తలు కేసు వేశారన్నారు. అందువల్లే ఎన్జీటీ క్లియరెన్స్‌ను సస్పెండ్ చేసిందని వివరించారు. అప్పటి ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే ఆలస్యమయ్యేది కాదని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్జీటీ క్లియరెన్స్‌ను తీసుకోవడంతోపాటు, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తద్వారానే ఆయిల్ సింక్రనైజేషన్ చేసే స్జేజీకి తెచి్చనట్లు పేర్కొన్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ పనులను గత ప్రభుత్వం ఆలస్యం చేసిందని, తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పనులను పూర్తి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జెన్కో ఎండీ రోనాల్డ్ రోస్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు. -
నేడు యాదాద్రిలో యూనిట్–2 సింక్రనైజేషన్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల రెండో యూనిట్‌కు బుధవారం కీలకమైన సింక్రనైజేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా యూనిట్‌కి సంబంధించిన జనరేటర్‌ను విద్యుత్ సరఫరా వ్యవస్థ(గ్రిడ్)కు అనుసంధానం చేసి పరీక్షిస్తారు. జనరేటర్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ గ్రిడ్ ఫ్రిక్వెన్సీ, వోల్టేజీ, ఫేజ్ యాంగిల్స్‌తో మ్యాచ్ అయితే సింక్రనైజేషన్ విజయవంతమైనట్టుగా ప్రకటిస్తారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి విద్యుత్ కేంద్రానికి చేరుకొని సింక్రనైజేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. సింక్రనైజేషన్ తర్వాత కమిషనింగ్, కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ) ప్రక్రియలను పూర్తి చేస్తేనే యూనిట్ నిర్మాణం విజయవంతంగా పూర్తయినట్టు భావిస్తారు. కమిషనింగ్లో భాగంగా ఎలక్రి్టకల్, మెకానికల్, కంట్రోల్ యూనిట్స్, ఇతర అన్ని విభాగాలు విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉన్నాయా.. లేదా..అని పరీక్షిస్తారు. ఇందుకుగాను ఆయా విభాగాల పనులు సంపూర్ణంగా పూర్తి కావాల్సి ఉంటుంది. కమిషనింగ్ తర్వాత విద్యుదుత్పత్తి కొనసాగినా, విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయినట్టు భావించరు. పూర్తి స్థాపిత సామర్థ్యంతో నిరంతరంగా 72 గంటలపాటు యూనిట్లో విద్యుదుత్పత్తి జరిగితేనే సీఓడీ ప్రక్రియ విజయవంతమైనట్టు భావిస్తారు. ఈ క్రమంలో కొత్త విద్యుత్ కేంద్రంలో బయటపడే ఒక్కో లోపాన్ని సరిదిద్దుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఓడీ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశముంది. అక్టోబర్‌లో 2 యూనిట్లు పూర్తి కావాలి యూనిట్–1, యూనిట్–2లు అక్టోబర్ 24, యూనిట్–3 వచ్చే ఏడాది ఫిబ్రవరి, యూనిట్–4 మార్చి, యూనిట్ –5 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని యూనిట్లకు సింక్రనైజేషన్, కమిషనింగ్, సీఓడీ నిర్వహించాల్సి ఉంది. నల్లగొండ జిల్లా దామరచర్లలో జెన్కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 4000(5 ్ఠ800) మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి రూ.29,965 కోట్ల అంచనాలతో నిర్మాణ పనులు ప్రారంభించగా, తాజాగా వ్యయం రూ.34,543 కోట్లకు చేరింది. ఇప్పటివరకు రూ.27,486 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. వాస్తవానికి 2021 అక్టోబర్–2022 అక్టోబర్ మధ్యకాలంలో అన్ని యూనిట్లు పూర్తికావాల్సి ఉండగా, తీవ్ర జాప్యం జరిగింది. -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు... రుణాల నిలుపుదలపై కోర్టుకు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రుణం ఇస్తామని అంగీకరించి మధ్యలో నిధులివ్వకుండా ఆపేయడంపై గ్రామీణ విద్యుదీకరణ సంస్థపై (ఆర్ఈసీ) రాష్ట్ర విద్యుదుత్పాదన సంస్థ (టీఎస్ జెన్కో) ఆగ్రహంగా ఉంది. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా నిధులు ఆపేయడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత నాలుగు నెలలుగా దాదాపు రూ. 500 కోట్ల రుణంవిడుదల చేయకుండా ఆపేయడంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరగడమే కాకుండా సకాలంలో ప్రాజెక్టు అందుబాటులోకి రాని పరిస్థితి తలెత్తిందని జెన్కో పేర్కొంటోంది. కేంద్రం, రాష్ట్రం మధ్య అగాధం నేపథ్యంలో దాదాపు రూ. 30 వేల కోట్ల వ్యయంతో 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందని, విద్యుత్ సమస్య లేకుండా సాఫీగా సరఫరాకు వీలవుతుందని జెన్కో వర్గాలు చెబుతున్నాయి. ఆర్ఈసీ నుంచి రూ. 17,200 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రూ. 3,800 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి జెన్కో ఒప్పందం చేసుకుంది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం, సంస్థ పనితీరు, రుణాలు ఎగేసిన ఉదంతాలున్నాయా వంటి అంశాలన్నీ పరిశీలించాకే రుణం ఇవ్వడానికి ఆ సంస్థలు అంగీకరించాయి. ఇందులో పీఎఫ్సీ నుంచి ఒప్పందం మేరకు జెన్కో దాదాపు మొత్తం రుణాన్ని తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన రుణదాత అయిన ఆర్ఈసీ మాత్రం తాను అంగీకరించిన దాంట్లో కేవలం 50 శాతం నిధులనే విడుదల చేసింది. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన అగాధం నేపథ్యంలో ఇవ్వాల్సిన రుణ విడుదలను ఆపేసింది. దీనిపై జెన్కో అధికారులు పలుమార్లు ఆర్ఈసీని సంప్రదించినా స్పందించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు జెన్కో సిద్ధమైనట్లు సమాచారం. ఈ డిసెంబర్‌కు విద్యుత్ ప్రాజెక్టును సిద్ధం చేయాలని భావించినా నిధుల సమస్యతో వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జెన్కో వర్గాలు తెలిపాయి. రుణాల కోసం ప్రయత్నిస్తుంటే వాణిజ్య బ్యాంకుల నుంచి కూడా నిధులు రాకుండా కేంద్రంలోని పెద్దలు అడ్డుపడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రంగంలోకి బీహెచ్ఈఎల్... యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను జెన్కో కేంద్ర నవరత్న కంపెనీల్లో ఒకటైన భారత భారీ విద్యుత్ పరికరాల సంస్థ (బీహెచ్ఈఎల్)కు అప్ప గించింది. ఇప్పుడు జెన్కోకు రుణ ఇబ్బందుల నేపథ్యంలో బీహెచ్ఈఎల్కు కూడా నిధుల సమస్య తలెత్తుతోందని ఓ అధికారి వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్ఈసీ నుంచి రుణాల విడుదలకు కేంద్ర భారీ పరిశ్ర మల మంత్రిత్వ శాఖ కూడా ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. అయితే డిస్కంలతో కొనుగోలు ఒప్పందం, విద్యుత్, పర్యా వరణ మంత్రిత్వ శాఖల అనుమతితోపాటు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం ఉన్న ఈ ప్రాజెక్టుకు రుణాలు నిలుపుదలను జెన్కో కక్షసాధింపుగానే భావిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం మధ్యలో నిలిచిపోవడంతో సాగునీటి ప్రాజెక్టులకు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థికంగా కొంత ఇబ్బందులున్నా జెన్కో ఎప్పటికప్పుడు చెల్లింపులు చేపడుతోందన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ వినియోగానికి సంబంధించి రూ. 1,500 కోట్ల మేర ప్రభుత్వం నుంచి జెన్కోకు రావాల్సి ఉందని సమాచారం. -
వాటర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణ
-
విద్యుత్ యజ్ఞంలో మరో ముందడుగు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు నేడు కేసీఆర్ శంకుస్థాపన ♦ 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణం ♦ ప్రాజెక్టు వ్యయం రూ. 17,650 కోట్లు ♦ నాలుగేళ్లలో పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యుత్ యజ్ఞంలో మరో ముందడుగు పడనుంది. నల్లగొండ జిల్లాను తెలంగాణ విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృష్ణా నదీతీరంలో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 5:05 నిమిషాలకు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు పైలాన్‌ను కూడా ఆవిష్కరిస్తారు. అనంతరం 5:50 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి నల్లగొండకు చేరుకుంటారు. ఎన్జీ కళాశాల మైదానంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. అంతకంటే ముందు హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన చౌటుప్పల్‌కు సాయంత్రం 4:30 గంటలకు చేరుకుంటారు. అక్కడ వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను ఆయన ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి దామరచర్ల వెళ్లి యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంటుకు శంకుస్థాపన చేసి నల్లగొండకు వస్తారు. రాత్రి 7:10 నిమిషాలకు బహిరంగసభలో పాల్గొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం పర్యటనకుగాను అధికార, టీఆర్ఎస్ వర్గాలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాయి. జెన్ కో, బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో... నల్లగొండ జిల్లాలోని కృష్ణపట్టెలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెం అటవీరేంజ్ పరిధిలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంట్‌ను జెన్కో, బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ జెన్కో, బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో రూ.17,650 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించేందుకు ఇటీవలే ఒప్పందం కూడా కుదిరింది. ప్లాంట్‌ను నాలుగేళ్లలో పూర్తి చేయాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం ఐదు టర్బైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టర్బైన్ సామర్థ్యం 800 మెగావాట్లు. ఇందులో రెండు టర్బైన్లను మూడేళ్లలో, మరో మూడింటిని నాలుగేళ్లలో నిర్మించాలని ప్రణాళికలు రూపొందిం చారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 10 వేల ఎకరాల అటవీ భూములను సేకరించాలని తొలుత నిర్ణయించినా ఆ తర్వాత 6 వేల ఎకరాలనే తీసుకున్నారు. ఇందుకుగాను అంతే భూమిని అటవీశాఖకు బదలాయించడం, కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతి కూడా లభించడంతో కేసీఆర్ ఇప్పుడు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాకు చెందిన జి.జగదీశ్‌రెడ్డి విద్యుత్ మంత్రిగా ఉండటంతో ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రూ.1.9 కోట్లతో వాటర్‌గ్రిడ్ పైలాన్ రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి చిహ్నంగా జిల్లాలోని చౌటుప్పల్‌లో పైలాన్‌ను ఏర్పాటు చేశారు. పైలాన్ నిర్మాణానికి రూ.1.9 కోట్లు ఖర్చు చేశారు. పైలాన్ చుట్టూ తెలంగాణలోని పది జిల్లాలకు ప్రతిబింబాలుగా 10 బతుకమ్మలను కూడా ఏర్పాటు చేశారు. పైలాన్ ఆవిష్కరణకు ప్రధాని మో దీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం తొ లుత భావించినా ఆయన అపాయింట్మెంట్ దొరకకపోవడంతో కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారు. -
‘యాదాద్రి’ థర్మల్ ప్లాంట్ కోసం రీ సర్వే
మోదుగుకుంటతండా(దామరచర్ల):మండలం పరిధిలో వీర్లపాలెం గ్రామంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతల పెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మాణ భూమి కోసం రెవెన్యూ సిబ్బంది మంగళవారం రీ సర్వే చేపట్టారు. 4 వేల మేఘావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావలసిన అటవీ భూమి 4676 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం జెన్కో సంస్థకు అప్పగించింది. ఆ భూముల పరిధిలో వీర్లపాలెం గ్రామ శివారులో గల మోదుగుకుంటతండా, కపూర్తండాలు ఉన్నాయి. తండాల పరిధిలో 405 ఎకరాల భూమి, 170 ఇళ్లు కోల్పోనున్నారు. అందుకు కలెక్టర్ సత్యనారయణరెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఆయా తండాల్లో సర్వే చేపట్టారు. ఇంటి వైశాల్యం, ఇల్లు దేనితో నిర్మిచారు. గదులు, బోరు, ప్రహరీ, వంటగది వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో తహసీల్దార్ వేముల రమాదేవి, డీటీ శేఖర్, ఆర్ఐ నూర్యకుమారీ, డీఎస్ఓ కిషన్, సర్వేయర్ ఉదయ్, వీఆర్ఓలు మేష్యానాయక్, రూప్రావులు పాల్గొన్నారు. సర్వేను అడ్డుకున్న తండావాసులు థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న మోదుగుకుంటతండా, కపూర్‌తండా ప్రజలు రెవెన్యూ సిబ్బందిని సర్యే చేయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు నష్టపరిహారం, పునరావాసం విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా పవర్ ప్లాంట్ పనులు ఏ విధంగా చేపడుతారని అధికారులను నిలదీశారు. అప్పటి వరకు పనులు చేపట్టనివ్వమన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తాం: ఆర్డీఓ కిషన్‌రావు తండా వాసులు సర్వేను అడ్డుకున్నారని తెలిసి ఆర్డీఓ కిషన్ రావు ఘటన స్థలానికి చేరుకుని తండావాసులతో మాట్లాడారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం పునరావసం, నష్టపరిహాం విషయంలో ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయనున్నట్టు చెప్పారు. అంతే కాకుండా ఉద్యోగ అవకాశాల్లో పాధాన్యత ఇస్తామని చెప్పడంతో తండావాసులు ఆందోళన విరమించారు.ఆర్టీఓ వెంట తహసీల్దార్ రమాదేవి, ఆర్ఐ సూర్యకుమారి, డీటీ శేఖర్ ఉన్నారు.