విద్యుత్ యజ్ఞంలో మరో ముందడుగు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు నేడు కేసీఆర్ శంకుస్థాపన
♦ 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణం
♦ ప్రాజెక్టు వ్యయం రూ. 17,650 కోట్లు
♦ నాలుగేళ్లలో పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యుత్ యజ్ఞంలో మరో ముందడుగు పడనుంది.
నల్లగొండ జిల్లాను తెలంగాణ విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృష్ణా నదీతీరంలో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 5:05 నిమిషాలకు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు పైలాన్‌ను కూడా ఆవిష్కరిస్తారు.
అనంతరం 5:50 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి నల్లగొండకు చేరుకుంటారు. ఎన్జీ కళాశాల మైదానంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. అంతకంటే ముందు హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన చౌటుప్పల్‌కు సాయంత్రం 4:30 గంటలకు చేరుకుంటారు. అక్కడ వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను ఆయన ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి దామరచర్ల వెళ్లి యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంటుకు శంకుస్థాపన చేసి నల్లగొండకు వస్తారు. రాత్రి 7:10 నిమిషాలకు బహిరంగసభలో పాల్గొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం పర్యటనకుగాను అధికార, టీఆర్‌ఎస్ వర్గాలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
జెన్ కో, బీహెచ్‌ఈఎల్ ఆధ్వర్యంలో...
నల్లగొండ జిల్లాలోని కృష్ణపట్టెలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెం అటవీరేంజ్ పరిధిలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంట్‌ను జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ ఆధ్వర్యంలో రూ.17,650 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించేందుకు ఇటీవలే ఒప్పందం కూడా కుదిరింది. ప్లాంట్‌ను నాలుగేళ్లలో పూర్తి చేయాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం ఐదు టర్బైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో టర్బైన్ సామర్థ్యం 800 మెగావాట్లు.
ఇందులో రెండు టర్బైన్లను మూడేళ్లలో, మరో మూడింటిని నాలుగేళ్లలో నిర్మించాలని ప్రణాళికలు రూపొందిం చారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 10 వేల ఎకరాల అటవీ భూములను సేకరించాలని తొలుత నిర్ణయించినా ఆ తర్వాత 6 వేల ఎకరాలనే తీసుకున్నారు.
ఇందుకుగాను అంతే భూమిని అటవీశాఖకు బదలాయించడం, కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతి కూడా లభించడంతో కేసీఆర్ ఇప్పుడు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాకు చెందిన జి.జగదీశ్‌రెడ్డి విద్యుత్ మంత్రిగా ఉండటంతో ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
రూ.1.9 కోట్లతో వాటర్‌గ్రిడ్ పైలాన్
రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి చిహ్నంగా జిల్లాలోని చౌటుప్పల్‌లో పైలాన్‌ను ఏర్పాటు చేశారు. పైలాన్ నిర్మాణానికి రూ.1.9 కోట్లు ఖర్చు చేశారు. పైలాన్ చుట్టూ తెలంగాణలోని పది జిల్లాలకు ప్రతిబింబాలుగా 10 బతుకమ్మలను కూడా ఏర్పాటు చేశారు. పైలాన్ ఆవిష్కరణకు ప్రధాని మో దీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం తొ లుత భావించినా ఆయన అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారు.