పర్యవేక్షించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి
ప్రక్రియలో భాగంగా జనరేటర్ గ్రిడ్‌తో అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల రెండో యూనిట్‌కు బుధవారం కీలకమైన సింక్రనైజేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా యూనిట్‌కి సంబంధించిన జనరేటర్‌ను విద్యుత్ సరఫరా వ్యవస్థ(గ్రిడ్)కు అనుసంధానం చేసి పరీక్షిస్తారు. జనరేటర్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ గ్రిడ్ ఫ్రిక్వెన్సీ, వోల్టేజీ, ఫేజ్ యాంగిల్స్‌తో మ్యాచ్ అయితే సింక్రనైజేషన్ విజయవంతమైనట్టుగా ప్రకటిస్తారు.
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి విద్యుత్ కేంద్రానికి చేరుకొని సింక్రనైజేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. సింక్రనైజేషన్ తర్వాత కమిషనింగ్, కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ) ప్రక్రియలను పూర్తి చేస్తేనే యూనిట్ నిర్మాణం విజయవంతంగా పూర్తయినట్టు భావిస్తారు. కమిషనింగ్‌లో భాగంగా ఎలక్రి్టకల్, మెకానికల్, కంట్రోల్ యూనిట్స్, ఇతర అన్ని విభాగాలు విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉన్నాయా.. లేదా..అని పరీక్షిస్తారు.
ఇందుకుగాను ఆయా విభాగాల పనులు సంపూర్ణంగా పూర్తి కావాల్సి ఉంటుంది. కమిషనింగ్ తర్వాత విద్యుదుత్పత్తి కొనసాగినా, విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయినట్టు భావించరు. పూర్తి స్థాపిత సామర్థ్యంతో నిరంతరంగా 72 గంటలపాటు యూనిట్‌లో విద్యుదుత్పత్తి జరిగితేనే సీఓడీ ప్రక్రియ విజయవంతమైనట్టు భావిస్తారు. ఈ క్రమంలో కొత్త విద్యుత్ కేంద్రంలో బయటపడే ఒక్కో లోపాన్ని సరిదిద్దుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఓడీ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశముంది.
అక్టోబర్‌లో 2 యూనిట్లు పూర్తి కావాలి
యూనిట్–1, యూనిట్–2లు అక్టోబర్ 24, యూనిట్–3 వచ్చే ఏడాది ఫిబ్రవరి, యూనిట్–4 మార్చి, యూనిట్ –5 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని జెన్‌కో లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని యూనిట్లకు సింక్రనైజేషన్, కమిషనింగ్, సీఓడీ నిర్వహించాల్సి ఉంది.
నల్లగొండ జిల్లా దామరచర్లలో జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 4000(5 ్ఠ800) మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి రూ.29,965 కోట్ల అంచనాలతో నిర్మాణ పనులు ప్రారంభించగా, తాజాగా వ్యయం రూ.34,543 కోట్లకు చేరింది. ఇప్పటివరకు రూ.27,486 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. వాస్తవానికి 2021 అక్టోబర్–2022 అక్టోబర్ మధ్యకాలంలో అన్ని యూనిట్లు పూర్తికావాల్సి ఉండగా, తీవ్ర జాప్యం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment