తప్పు చేస్తే ‘సెకండ్‌ వేవ్’‌ ముప్పు | Coronavirus Second Wave Spreading Depends On Human Negligence | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తే ‘సెకండ్‌ వేవ్’‌ ముప్పు

Published Fri, Nov 6 2020 1:45 AM | Last Updated on Fri, Nov 6 2020 10:05 AM

Coronavirus Second Wave Spreading Depends On Human Negligence - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. యూరప్‌లోని పలు దేశాలు ఇప్పుడు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. మరికొన్ని ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నాయి. మన దేశంలో కేసుల సంఖ్య తగ్గుతున్నా, కేరళ, ఢిల్లీ, ఒడిశా, హరియాణాలో ఒక శాతానికి మించి నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు మన దేశానికీ సెకండ్‌వేవ్‌ ముప్పుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అలాగే, ప్రపంచంలో సెకండ్‌వేవ్‌పైనా, ప్రస్తుత పరిస్థితిపైనా ప్రపంచ ఆరోగ్యసంస్థ విశ్లేషించింది. సెకండ్‌వేవ్‌ను నియంత్రించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించింది. 

మన తప్పిదాలతోనే ‘సెకండ్‌ వేవ్‌’ 
అలలాగా వైరస్‌ విరుచుకుపడటాన్నే ‘వేవ్‌’ అంటారు. కేసులు గణనీయంగా తగ్గాక మళ్లీ ఒక్కసారిగా వైరస్‌ విజృంభిస్తుందన్న మాట. కరోనా వ్యాక్సిన్‌ వచ్చే వరకు సెకండ్‌ వేవ్, థర్డ్‌ వేవ్, ఫోర్త్‌ వేవ్‌.. అలా వస్తూనే ఉంటాయి. సైన్స్‌ జర్నల్‌ ప్రకారం ఒకసారి కరోనా వచ్చిన వారికి మళ్లీ వచ్చే అవకాశం 90 శాతానికిపైగా ఉండదు. ఫస్ట్‌ వేవ్‌లో కరోనా రానివారు నిర్లక్ష్యం చేస్తే సెకండ్‌ వేవ్‌లో దాని బారినపడే ముప్పుంది. కరోనా వైరస్‌ ఇప్పుడెంత తీవ్రతతో ఉందో ఇకముందూ అదే తీవ్రతతో ఉంటుంది. జాగ్రత్తలు తీసుకున్నంత వరకు అదెవరికీ సోకే అవకాశం లేదు. అజాగ్రత్తతో వ్యవహరిస్తే మాత్రం సోకుతుంది. మాస్క్‌ పెట్టుకుంటే, భౌతికదూరం, శుభ్రత పాటిస్తే సెకండ్‌ వేవ్‌ రాదు. ప్రపంచంలో ఏ ప్రాంతం కూడా సెకండ్‌ వేవ్‌కు అతీతం కాదు. ఎటొచ్చీ మానవ తప్పిదాలతోనే అదొచ్చే అవకాశముందని వైద్య నిపుణులు అంటున్నారు. బలమైన ప్రజారోగ్య వ్యవస్థ, ప్రజల సహకారంతోనే దీన్ని అధిగమించాలని చెబుతున్నారు. నిజానికి సెకండ్‌ వేవ్‌లో మరణాలు తగ్గాయి. మొదటి వేవ్‌లో పరీక్ష సామర్థ్యం, సన్నద్ధత లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు పరీక్షల సామర్థ్యం పెరగడంతో మరణాల రేటు తగ్గింది. 

యూకేలో 3 నెలల తర్వాత...
యూకేలో వైరస్‌ తగ్గిన మూడు నెలల తర్వాత సెకండ్‌ వేవ్‌ వచ్చింది. యూరప్, అమెరికా, ఆసియా దేశాల్లో ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ నడుస్తోంది. యూరప్‌లో మార్చిలోనే వైరస్‌ తీవ్రస్థాయికి వెళ్లింది. ఈ ఏడాది మార్చిలో ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో 66 శాతం యూరప్‌లోనే నమోదయ్యాయి. జూలై నాటికి అక్కడ 6 శాతానికి తగ్గాయి. ఆగస్టు నుంచి అక్కడ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్‌ రెండో వారం నాటికి

ప్రపంచంలో నమోదైన కేసుల్లో
46 శాతం కేసులు అక్కడే గుర్తించారు. అంటే ఆగస్టు చివరి నుంచే సెకండ్‌ వేవ్‌ మొదలై అక్టోబర్‌ చివరి నాటికి తీవ్రస్థాయికి వెళ్లింది. ప్రస్తుతం ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో 19 శాతం అమెరికాలో నమోదవుతున్నాయి. చైనాలోనూ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. గత వారంతో పోలిస్తే ఇప్పుడు
33 శాతం కేసులు పెరిగాయి. 44 దేశాలున్న యూరప్‌లో స్వీడన్, బెల్జియం, స్పెయిన్, ఐర్లాండ్‌ మినహా మిగతా అన్ని దేశాలు సెకండ్‌ వేవ్‌ బారినపడ్డాయి. 

దేశంలో 4 శాతం తగ్గిన కేసులు 
లాక్‌డౌన్‌ చివరి దశలో ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో మన దేశం వాటా 15%. జూన్‌లో క్రమంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలో జూలై చివరి నాటికి 22%, ఆగస్టు చివరి నాటికి 30%, సెప్టెంబర్‌ చివరికి 40% కేసులు నమోదయ్యాయి. అక్టోబర్‌ తొలి వారంలో ప్రపంచంలో నమోదైన కేసుల్లో మన దేశం కేసుల వాటా 25%, రెండో వారంలో 15%గా ఉంది. ప్రస్తుతం మన దేశంలో కేసులు 4%, మరణాలు 12% తగ్గాయి. కేరళలో మాత్రం ప్రస్తుతం రోజుకు 1.6 శాతం చొప్పున కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, ఒడిశా, హరియాణాలో ఒక శాతానికిపైగా పెరుగుతున్నాయి. ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మన దగ్గరా జనవరి రెండో వారం నాటికి సెకండ్‌ వేవ్‌ వస్తుందని అంచనా. 

పాజిటివిటీ రేటు ఆధారంగానే అంచనా
కేసుల సంఖ్య ఆధారంగా కాకుండా పాజిటివిటీ రేటు ప్రకారం సెకండ్‌ వేవ్‌ను అంచనా వేయాలి. తక్కువ టెస్టులు చేసినందున మొదటి వేవ్‌లో తప్పిపోయిన కేసులు ఎక్కువ. యూరప్‌లో మొదటి వేవ్‌లో 14 మందికి కరోనా ఉంటే ఒకరినే గుర్తించారు. ఐసీఎంఆర్‌ లెక్కల ప్రకారం మన దేశంలో మొదట్లో 84 కేసులుంటే, ఒకటే గుర్తించగలిగాం. 83 మిస్సయ్యాయి. ఇప్పుడు పరీక్షలు ఎక్కువ చేస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ సరాసరి పాజిటివిటీ రేటు 15 శాతం కాగా, మన దేశంలో అది 4.3 శాతంగా ఉంది. 

ప్రపంచంలో 13 లక్షల జన్యు విశ్లేషణలు 
ప్రపంచంలో దాదాపు అన్నిచోట్లా లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేశారు. యూరప్‌లో విద్య, రవాణా వ్యవస్థలపై ఆంక్షలను తొలగించారు. ప్రజలు గుంపులుగా బయటకు వస్తున్నారు. యువకుల నిర్లక్ష్యం వల్ల వైరస్‌ పెద్ద వారికి సోకుతోంది. చలికాలం ఎక్కువ.. వేసవిలో తక్కువనే తేడా లేకుండా వైరస్‌ దాడి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు సంబంధించి 13 లక్షల జన్యు విశ్లేషణలు జరిగాయి. వైరస్‌ తన రూపాన్ని మార్చుకుంటోందని ఇవన్నీ తేల్చాయి. అయితే, తీవ్రత తగ్గుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.  

సెకండ్‌ వేవ్‌ ప్రభావం తక్కువే 
మొదటి దశ కరోనా నుంచి జనంతో పాటు ప్రభుత్వాలు రిలాక్స్‌ అయ్యాయి. ఫస్ట్‌వేవ్‌.. సెకండ్‌ వేవ్‌.. ఏ దశలోనైనా వైరస్‌ అంతే తీవ్రత కలిగి ఉన్నా సెకండ్‌ వేవ్‌లో దాని ప్రభావం, మరణాలూ అంతగా ఉండవు. ఎందుకంటే వైరస్‌ లక్షణాలకు ఎలాంటి చికిత్స చేయాలనేది ఇప్పటికే తెలిసిపోయింది. ఆసుపత్రుల్లో వసతులు పెరిగాయి. యూరప్‌లో ఉన్నంత ప్రమాదం మన దేశానికి ఉండదు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి జనవరి నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం వరకు వ్యాక్సిన్‌ను తీవ్ర ప్రభావిత ప్రజలకు ఇస్తారు. జూలై నాటికి ప్రపంచంలోని అందరికీ అందుతుంది. మార్చి వరకు జాగ్రత్తలు తీసుకుంటే సెకండ్‌ వేవ్‌ను ఆపేయొచ్చు. అయితే వ్యాక్సిన్‌ వచ్చే వరకు నిర్లక్ష్యం కూడదు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినంత మాత్రాన ప్రజలు నిర్లక్ష్యం చేయరాదు. టెస్టు కేవలం ఆ నిమిషం పరిస్థితిని మాత్రమే చెబుతుంది. కాబట్టి లక్షణాలుంటే అశ్రద్ధ చేయవద్దు. 
 – డాక్టర్‌ కిరణ్‌ మాదల,క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement