సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రుణం ఇస్తామని అంగీకరించి మధ్యలో నిధులివ్వకుండా ఆపేయడంపై గ్రామీణ విద్యుదీకరణ సంస్థపై (ఆర్‌ఈసీ) రాష్ట్ర విద్యుదుత్పాదన సంస్థ (టీఎస్ జెన్‌కో) ఆగ్రహంగా ఉంది. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా నిధులు ఆపేయడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత నాలుగు నెలలుగా దాదాపు రూ. 500 కోట్ల రుణంవిడుదల చేయకుండా ఆపేయడంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరగడమే కాకుండా సకాలంలో ప్రాజెక్టు అందుబాటులోకి రాని పరిస్థితి తలెత్తిందని జెన్‌కో పేర్కొంటోంది.
కేంద్రం, రాష్ట్రం మధ్య అగాధం నేపథ్యంలో
దాదాపు రూ. 30 వేల కోట్ల వ్యయంతో 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందని, విద్యుత్ సమస్య లేకుండా సాఫీగా సరఫరాకు వీలవుతుందని జెన్‌కో వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌ఈసీ నుంచి రూ. 17,200 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) నుంచి రూ. 3,800 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి జెన్‌కో ఒప్పందం చేసుకుంది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం, సంస్థ పనితీరు, రుణాలు ఎగేసిన ఉదంతాలున్నాయా వంటి అంశాలన్నీ పరిశీలించాకే రుణం ఇవ్వడానికి ఆ సంస్థలు అంగీకరించాయి.
ఇందులో పీఎఫ్‌సీ నుంచి ఒప్పందం మేరకు జెన్‌కో దాదాపు మొత్తం రుణాన్ని తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన రుణదాత అయిన ఆర్‌ఈసీ మాత్రం తాను అంగీకరించిన దాంట్లో కేవలం 50 శాతం నిధులనే విడుదల చేసింది. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన అగాధం నేపథ్యంలో ఇవ్వాల్సిన రుణ విడుదలను ఆపేసింది. దీనిపై జెన్‌కో అధికారులు పలుమార్లు ఆర్‌ఈసీని సంప్రదించినా స్పందించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.
ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు జెన్‌కో సిద్ధమైనట్లు సమాచారం. ఈ డిసెంబర్‌కు విద్యుత్ ప్రాజెక్టును సిద్ధం చేయాలని భావించినా నిధుల సమస్యతో వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జెన్‌కో వర్గాలు తెలిపాయి. రుణాల కోసం ప్రయత్నిస్తుంటే వాణిజ్య బ్యాంకుల నుంచి కూడా నిధులు రాకుండా కేంద్రంలోని పెద్దలు అడ్డుపడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రంగంలోకి బీహెచ్‌ఈఎల్...
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను జెన్‌కో కేంద్ర నవరత్న కంపెనీల్లో ఒకటైన భారత భారీ విద్యుత్ పరికరాల సంస్థ (బీహెచ్‌ఈఎల్)కు అప్ప గించింది. ఇప్పుడు జెన్‌కోకు రుణ ఇబ్బందుల నేపథ్యంలో బీహెచ్‌ఈఎల్‌కు కూడా నిధుల సమస్య తలెత్తుతోందని ఓ అధికారి వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఈసీ నుంచి రుణాల విడుదలకు కేంద్ర భారీ పరిశ్ర మల మంత్రిత్వ శాఖ కూడా ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. అయితే డిస్కంలతో కొనుగోలు ఒప్పందం, విద్యుత్, పర్యా వరణ మంత్రిత్వ శాఖల అనుమతితోపాటు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం ఉన్న ఈ ప్రాజెక్టుకు రుణాలు నిలుపుదలను జెన్‌కో కక్షసాధింపుగానే భావిస్తోంది.
ప్రాజెక్టు నిర్మాణం మధ్యలో నిలిచిపోవడంతో సాగునీటి ప్రాజెక్టులకు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థికంగా కొంత ఇబ్బందులున్నా జెన్‌కో ఎప్పటికప్పుడు చెల్లింపులు చేపడుతోందన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ వినియోగానికి సంబంధించి రూ. 1,500 కోట్ల మేర ప్రభుత్వం నుంచి జెన్‌కోకు రావాల్సి ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment