ఆదివారం విద్యుత్ జేఏసీ నేతలతో చర్చిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ, ఇతర డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ స్టేట్ పవర్/ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీలతో, విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీ‹శ్‌రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. 6శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలుకు క్రితం సారి జరిగిన చర్చల్లో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ప్రతిపాదించగా, ఉభయ జేఏసీలు తిరస్కరించాయి.
మరోశాతం పెంచి 7శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, దీనికి అంగీకరించి 17 నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని తాజాగా జరిపిన చర్చల్లో విద్యుత్‌శాఖ మంత్రి ప్రతిపాదించగా, ఇందుకూ జేఏసీలు తిరస్కరించాయి. దీంతో విద్యుత్ జేఏసీలతో ఏడో దఫా చర్చలు సైతం విఫలమయ్యాయి.
17నుంచి సమ్మె పిలుపులో మార్పు లేదు: గతంలో జరిగిన చర్చల్లో 30శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలుకి పట్టుబట్టామని, తాజాగా కనీసం 25శాతం ఫిట్‌మెంట్‌తోనైనా అమలు చేయాలని కోరామని పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు సాయిబాబు వెల్లడించారు.
ఇప్పటికే ప్రకటించిన విధంగా ఈ నెల 17 నుంచి సమ్మె ప్రారంభిస్తామని, ఈ విషయంలో ఎలాంటి మార్పులేదని ప్రకటించారు. సోమవారం నుంచి జిల్లాల్లో సమ్మె సన్నాహక సమావేశాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో రోజువారీగా నిర్వహించే సమీక్ష సమావేశాలను సోమవారం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చర్చల్లో యాజమాన్యాల తరఫున ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, ఉత్తర/దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి.రఘుమారెడ్డి, పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు పి.రత్నాకర్ రావు, శ్రీధర్, బీసీ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment