
శాసనసభలో ప్రతిపక్షం తరపున ప్రసంగించేటప్పుడు వ్యూహాత్మకంగా ఉండాలి. అధికార పక్షం డైవర్ట్ చేసే అవవకాశం ఉన్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండ్లకంట జగదీశ్ రెడ్డి అధికార కాంగ్రెస్ వేసిన ట్రాప్‌లో పడినట్లు అనిపిస్తుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ మీద జగదీశ్ రెడ్డిని శాసనసభ నుంచి ఈ సెషన్ వరకు సస్పండ్ చేశారు. నిజానికి ఇందులో జగదీశ్ రెడ్డి చేసిన పెద్ద తప్పేమీ లేదనిపిస్తుంది. సభ ఎవరిది అన్న ప్రస్తావన తెచ్చి అందరిది అని, అందరి తరపున పెద్ద మనిషిగా స్పీకర్ ఉన్నారని, అది ఆయన సొంతం కాదని జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఆధారంగా మంత్రులు శ్రీధర్ బాబు, తదితరులు పెద్ద రగడ సృష్టించారు.
స్పీకర్‌ను, అందులోను దళిత నేతను అవమానించారంటూ ఆక్షేపిస్తూ, జగదీశ్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో జగదీశ్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ఉండాల్సింది. తాను గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడుతున్న సంగతిని ఆయన మర్చిపోయారు. ఆ స్పీచ్‌లో ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సాగించారు. ఆ క్రమంలో ఒకసారి మంత్రి కోమటి రెడ్డి అడ్డుపడి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ జోక్యం చేసుకుని జగదీశ్ రెడ్డి ప్రసంగానికి అడ్డుపడడం సరికాదని చెప్పారు. ఈ క్రమంలో జరిగిన సంవాదంలో జగదీశ్ రెడ్డి తన మానాన ఉపన్యాసం కొనసాగించకుండా తాను ఏమి తప్పు చేశానో చెబితే, ఆ తర్వాత మాట్లాడతానని అన్నారు. అక్కడే ఆయన పొరపాటు చేసినట్లు అనిపిస్తుంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం అవుతోందని, పిట్టకథలతో ఆయా అంశాలు వివరిస్తూ జగదీశ్ రెడ్డి మాట్లాడారు. నాలుగు బర్రెల కథ అంటూ ఒక స్టోరీ చెప్పినప్పుడు చర్చను పక్కదారి పట్టించవద్దని స్పీకర్ సూచించారు. తాను చర్చను పక్కదారి పట్టించ లేదని, ఒక్క అక్షరమైనా పక్కదోవ పట్టించినట్లు తేల్చాలని, సభలో ఉండమంటే ఉంటా.. పొమ్మంటే పోతా.. అంటూ ఆవేశంగా తన చేతిలో ఉన్న నోట్స్‌ను బల్లపైకి విసిరారు. నిజానికి జగదీశ్ రెడ్డి ఇంత ఆగ్రహం చెందాల్సిన అవరమే కనిపించదు. జగదీశ్ రెడ్డి స్పీకర్‌ను బెదిరిస్తున్నారని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు సలహా ఇచ్చారు. అప్పుడైనా ఈయన సర్దుకుని ఉండాల్సింది.
స్పీకర్ జోక్యం చేసుకుని మీరు సీనియర్ సభ్యులు, పదేళ్లు మంత్రిగా పనిచేశారు. సహనంగా ఉండాలని, సంప్రదాయాలను పాటించాలని వ్యాఖ్యానించారు. ఆ మాట జగదీశ్ రెడ్డికు మరింత కోపం తెప్పించిందట. తాను ఏ సంప్రదాయాన్ని ఉల్లంఘించానో చెబితే, ఆ తర్వాత మాట్లాడతా అని ఆయన అన్నారు. అప్పుడు తనను ప్రశ్నించడమే సంప్రదాయ విరుద్ధమని ప్రసాదకుమార్ జవాబు ఇచ్చారు. అప్పుడైనా జగదీశ్ రెడ్డి సంయమనం పాటించి తన స్పీచ్ కంటిన్యూ చేసి ఉండాల్సింది. అలా కాకుండా ఈ సభ అందరిది అని, సమాన హక్కులు ఉంటాయని, పెద్దమనిషిగా స్పీకర్ ఉంటారని, మీ సొంతం కాదని అనడం వివాదంగా మారింది. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకున్న కాంగ్రెస్ పార్టీ వెంటనే రియాక్ట్ అయింది.
స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ బాబు అయితే ఏకంగా స్పీకర్ను జగదీశ్ రెడ్డి దూషించారని విమర్శించారు. నిజానికి జగదీశ్ రెడ్డి దూషించిందేమీ లేదు. నీ సొంతం కాదు అనడం అభ్యంతరం అయితే అవ్వవచ్చు. అందులో దూషణ ఏమీ లేదు. కాని అధికార పక్షం ఆయా పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవడం జరుగుతుంటుంది. గతంలో స్పీకర్ పై కాగితాలు విసిరిన కారణంగా అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వమే రద్దు చేసిన విషయాన్ని అధికార పక్షం గుర్తు చేసింది. ఈ దశలో అయినా జగదీశ్ రెడ్డి వెనక్కి తగ్గి సారీ చెప్పేస్తే అయిపోయేది. ఆయన అలా చేయలేదు. దాంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతు ఇవ్వక తప్పలేదు.
దీంతో గవర్నర్ ప్రసంగంపై బీఆర్‌ఎస్ వాదనను ఎఫెక్టివ్‌గా వినిపించే అవకాశాన్ని జగదీశ్ రెడ్డి కోల్పోయారు. ఆ తర్వాత సభ నుంచి సస్పెండ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేయడం, తదుపరి అదే ప్రకారం సెషన్ అంతటికి సస్పెండ్ చేయడం జరిగిపోయాయి. ఈ మాత్రానికి సెషన్ అంతా సస్సెండ్ చేయడం కూడా అంత సమంజసం కాదు. జగదీశ్ రెడ్డి తప్పుగా మాట్లాడారని అనుకుంటే ఒక రోజు సస్సెండ్ చేసి ఉంటే సరిపోయేది. తప్పు చేయలేదని, హరీష్ రావు కేటీఆర్‌లు అన్నప్పటికి, పరిస్థితిని బట్టి మసలుకోకపోతే వారికే నష్టం జరుగుతుంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకుండా ఉండడానికి ఇలాంటి ఘటనలను వాడుకోవాలని బీఆర్‌ఎస్ చూస్తోందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
అది కరెక్టో, కాదో తెలియదు కాని, ఈ మొత్తం వ్యవహారంలో జగదీశ్ రెడ్డి చేసింది పెద్ద తప్పు కాకపోయినా సెషన్ అంతా సస్పెండ్ అవడం, కాంగ్రెస్ ట్రాప్‌లో బీఆర్ఎస్ పడినట్ల అయిందనిపిస్తుంది. ఇలాంటివి ఉమ్మడి ఏపీలోనూ అనేకసార్లు జరిగాయి. ప్రత్యేకించి అధికారపక్షం వారు విపక్ష సభ్యులు బాగా మాట్లాడుతున్నప్పుడు వారి భాషణలో ఏదైనా ఒక్క పదం దొరికితే, దానిమీదే రచ్చ చేసి మొత్తం చర్చను డైవర్ట్ చేస్తుంటారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య హోరా హోరీగా చర్చలు జరుగుతున్నప్పుడు ఇలాంటివి చోటు చేసుకుంటాయి. టీడీపీ హయాంలో ప్రతిభా భారతి స్పీకర్‌గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ హయాంలో కుతూహలమ్మ డిప్యూటి స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి చోటు చేసుకున్నాయి.
వెంటనే అధికారపక్షం దళిత, మహిళ కార్డులను బయటకు తీసి విపక్షాన్ని ఇరుకున పెట్టడానికి యత్నిస్తుంది. విపక్షం కూడా అలా ప్రయత్నం చేస్తుంటుంది కాని, వారికి తక్కువ అవకాశాలు లభిస్తాయి. జగదీశ్ రెడ్డి కాస్త సంయమనంగా వ్యవహరించి ఉంటే, కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్‌కి అవకాశం ఉండేది కాదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన విధంగానే ఇప్పుడు కూడా విపక్ష సభ్యుడిపై ఇంతటి సీరియస్ చర్య తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మంచి సంకేతం పంపించలేదు. నిజానికి ఈ సభ అందరిది అన్నది వాస్తవమే.
- కొమ్మినేని శ్రీనివాసరావు,
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవాహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment