Power jAC
-
చర్చలు మళ్లీ విఫలం.. రోజువారీ సమీక్షల బహిష్కరణకు పిలుపు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ, ఇతర డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ స్టేట్ పవర్/ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీలతో, విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీ‹శ్‌రెడ్డి ఆదివారం తన కార్యాలయంలో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. 6శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకు క్రితం సారి జరిగిన చర్చల్లో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ప్రతిపాదించగా, ఉభయ జేఏసీలు తిరస్కరించాయి. మరోశాతం పెంచి 7శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, దీనికి అంగీకరించి 17 నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని తాజాగా జరిపిన చర్చల్లో విద్యుత్‌శాఖ మంత్రి ప్రతిపాదించగా, ఇందుకూ జేఏసీలు తిరస్కరించాయి. దీంతో విద్యుత్ జేఏసీలతో ఏడో దఫా చర్చలు సైతం విఫలమయ్యాయి. 17నుంచి సమ్మె పిలుపులో మార్పు లేదు: గతంలో జరిగిన చర్చల్లో 30శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుకి పట్టుబట్టామని, తాజాగా కనీసం 25శాతం ఫిట్‌మెంట్‌తోనైనా అమలు చేయాలని కోరామని పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు సాయిబాబు వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా ఈ నెల 17 నుంచి సమ్మె ప్రారంభిస్తామని, ఈ విషయంలో ఎలాంటి మార్పులేదని ప్రకటించారు. సోమవారం నుంచి జిల్లాల్లో సమ్మె సన్నాహక సమావేశాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో రోజువారీగా నిర్వహించే సమీక్ష సమావేశాలను సోమవారం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చర్చల్లో యాజమాన్యాల తరఫున ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, ఉత్తర/దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి.రఘుమారెడ్డి, పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు పి.రత్నాకర్ రావు, శ్రీధర్, బీసీ రెడ్డి పాల్గొన్నారు. -
4న విజయవాడలో ఆమరణ దీక్ష
విద్యుత్ జేఏసీ కన్వీనర్ సాయిబాబా సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సెక్టార్లో పనిచేస్తున్న 37వేలమంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 4న విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు విద్యుత్ జేఏసీ కన్వీనర్ సాయిబాబా ప్రకటించారు. హైదరాబాద్ ఏపీఎన్జీవో భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఏపీట్రాన్స్కో, డిస్కంలు, ఏపీ జెన్‌కోల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఏళ్లతరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేకుండా, చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్ కోసం ఈనెల 28న‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని కూడా చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకుంటే ఫిబ్రవరి 6నుంచి రాష్ట్రంలోని 23జిల్లాలకు చెందిన కాంట్రాక్టు కార్మికులంతా సమ్మెబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు ఏపీఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నుంచి మద్ధతును కోరుతున్నట్లు ఆయన చెప్పారు. 3న విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి విద్యుత్ కోతలకు నిరసనగా వచ్చే నెల 3న విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది. విద్యుత్ కోతల వల్ల నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఓట్ల కోసం 9 గంటలు, ఆచరణలో 3 గంటలా? అని ప్రభుత్వ తీరును ప్రశ్నించింది. శనివారమిక్కడ రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశం రాష్ట్రంలో రైతుకు కష్టాలపై స్పందిస్తూ ఈ మేరకు తీర్మానించింది. సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నేతలు కొల్లి నాగేశ్వరరావు, సీపీఐ శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేష్, కె.రామకృష్ణ, రావుల వెంకయ్య పాల్గొన్నారు. -
విడిపోతే విద్యుత్ సంక్షోభం
విజయవాడ, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తే విద్యుత్ సంక్షోభం తప్పదని సమైక్యాంధ్ర విద్యుత్ జేఏసీ కో కన్వీనర్ ఎమ్.సత్యానందం ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో సమైక్యాంధ్ర విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య సింహగర్జన పేరుతో శనివారం భారీ బహిరంగసభ నిర్వహించారు. విడిపోయిన తర్వాత ఎగువనుంచి రావల్సిన నీళ్లు రాకపోతే 1700 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే వీటీపీఎస్ కేంద్రాన్ని ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. నష్టాలలో ఉన్న జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు ఫ్రాంఛైజీలను ఏర్పాటు చేస్తామనటం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఇక రాష్ట్రం విడిపోతే విద్యుత్‌పరంగా రైతులు ఎంతగానో నష్టపోతారన్నారు. ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉండబట్టి రైతుల పరిస్థితి కొంచం మెరుగ్గా ఉందని, సాగర్, గోదావరిల నుంచి నీళ్లు రాకపోతే అన్నదాతల పరిస్థితి మరీ దుర్భరంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఎన్జీఓ సమక్యాంధ్ర జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన 14ఎఫ్ చట్టానికి రాష్ట్ట్రపతి ద్వారా సవరణ చేయించిన నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించే యాక్ట్ టూ ఆఫ్ 94కు ఎందుకు సవరింపచేయలేకపోతున్నారని ప్రశ్నించారు. సభకు అధ్యక్షత వహించిన కెఎన్వి సీతారాం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌కు ఆలంబనగా ఉన్న హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని స్పష్టం చేశారు. పి.కాశీమధుబాబు మాట్లాడుతూ తెలంగాణావాదం రాజకీయ నిరుద్యోగం నుంచి పుట్టుకొచ్చిందన్నారు. సమావేశంలో మధు (కర్నూలు), నాగరాజు (ప్రకాశం), శివారెడ్డి, మహేశ్వరరెడ్డి(వైఎస్సార్ జిల్లా), సునీత(విశాఖ), సురేష్‌కుమార్(వీటీపీఎస్)లతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రతినిధులు ప్రసంగించారు. తొలుత నగరంలో విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. -
తాత్కాలిక విద్యుత్ పునరుద్దరణకు జేఏసీ అంగీకారం
హైదరాబాద్: విద్యుత్ జేఏసీతో సీఎండీ చర్చలు సఫలం అయ్యాయి. తాత్కాలిక విద్యుత్ ను పునరుద్దరించేందుకు జేఏసీ అంగీకరించింది. విద్యుత్ ఉద్యోగుల ఆకస్మిక సమ్మెతో రాష్ట్రంలో అంధకారం అలుముకుంది. అత్యవసర సేవల్లో ఒకటైన విద్యుత్ స్తంభించిపోవడంతో ఆదివారం సాయంత్రం సీఎండీ జేఏసీ సభ్యులతో చర్చలు జరిపారు. కాగా, జేఏసీ మాత్రం రేపు ఉదయం వరకూ మాత్రమే విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపింది. దీంతో ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల ప్రజలకు ఊరట లభించనుంది. విజయవాడ ట్రాన్స్ కోలో విద్యుత్ ఉత్పత్తి జీరో స్థాయికి పడిపోయింది. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విద్యుత్ సంక్షోభం కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం 28 రైళ్లను రద్దు చేశారు. వీటిలో 24 ప్యాసింజర్, 4 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పలు రైళ్లు మార్గమధ్యంలో ఆగిపోగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపుతున్నారు. విద్యుత్ స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీపీపీలో ఉద్రిక్తత
ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో సమైక్యాంధ్ర ఉద్యమం శనివారం ఉద్రికత్తకు దారితీసింది. తెలంగాణ నోట్‌ను వెంటనే కేంద్రం రద్దు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆర్టీపీపీలోని విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు ప్రాజెక్టులోకి గేట్లను తోసుకుంటూ వెళ్లారు. విధులకు ఎవరినీ పోనివ్వకుండా అడ్డుకున్నారు. మొదట మూడవ యూనిట్‌ను నిలిపి వేసి సర్వీసులోకి తీసుకురావద్దని జేఏసీ నాయకులు సీఈ కుమారుబాబును కోరారు. సీఈ వినకపోవడంతో వారందరూ యూనిట్‌లోని యూసీబీ(యూనిట్ కంట్రోల్ బోర్టు)లోకి వెళ్లి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. వెంటనే సీఈ కుమారుబాబు మూడవ యూనిట్‌ను నిలుపుదల చేస్తామని చెప్పడంతో వారు శాంతించారు. యూనిట్లన్నీ ట్రిప్.. ఆర్టీపీపీలో ఉన్న 1,2,3,4,5 యూనిట్లన్నీ సమైక్యవాదులు ట్రిప్ చేశారు. దీంతో గ్రిడ్‌లో సాంకేతిక లోపం ఏర్పడి 1050 మెగావాట్లు విద్యుత్ ఒక్కసారిగా నిలిచిపోయి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెల్ టవర్ ఎక్కి... ఆర్టీపీపీలో వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు గుగ్గల మహేశ్వర్‌రెడ్డి, పులి సుధాకర్‌రెడ్డి, కిరణ్కుమారు, నాయక్ బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐ సంజీవరెడ్డి, ఉద్యోగులు, కార్మికులు టవర్ ఎక్కిన వారిని దించడానికి ప్రయత్నాలు చేశారు. యూనిట్లన్నీ నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆర్టీపీపీ జేఏసీ నాయకులు అక్కడికి చేరుకుని సమైక్యవాదులను శాంతింప చేసి కిందకు దించారు.