విడిపోతే విద్యుత్ సంక్షోభం
విజయవాడ, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తే విద్యుత్ సంక్షోభం తప్పదని సమైక్యాంధ్ర విద్యుత్ జేఏసీ కో కన్వీనర్ ఎమ్.సత్యానందం ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో సమైక్యాంధ్ర విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య సింహగర్జన పేరుతో శనివారం భారీ బహిరంగసభ నిర్వహించారు. విడిపోయిన తర్వాత ఎగువనుంచి రావల్సిన నీళ్లు రాకపోతే 1700 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే వీటీపీఎస్ కేంద్రాన్ని ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. నష్టాలలో ఉన్న జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు ఫ్రాంఛైజీలను ఏర్పాటు చేస్తామనటం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
ఇక రాష్ట్రం విడిపోతే విద్యుత్‌పరంగా రైతులు ఎంతగానో నష్టపోతారన్నారు. ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉండబట్టి రైతుల పరిస్థితి కొంచం మెరుగ్గా ఉందని, సాగర్, గోదావరిల నుంచి నీళ్లు రాకపోతే అన్నదాతల పరిస్థితి మరీ దుర్భరంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఎన్జీఓ సమక్యాంధ్ర జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన 14ఎఫ్ చట్టానికి రాష్ట్ట్రపతి ద్వారా సవరణ చేయించిన నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించే యాక్ట్ టూ ఆఫ్ 94కు ఎందుకు సవరింపచేయలేకపోతున్నారని ప్రశ్నించారు. సభకు అధ్యక్షత వహించిన కెఎన్‌వి సీతారాం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌కు ఆలంబనగా ఉన్న హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని స్పష్టం చేశారు. పి.కాశీమధుబాబు మాట్లాడుతూ తెలంగాణావాదం రాజకీయ నిరుద్యోగం నుంచి పుట్టుకొచ్చిందన్నారు. సమావేశంలో మధు (కర్నూలు), నాగరాజు (ప్రకాశం), శివారెడ్డి, మహేశ్వరరెడ్డి(వైఎస్సార్ జిల్లా), సునీత(విశాఖ), సురేష్‌కుమార్(వీటీపీఎస్)లతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రతినిధులు ప్రసంగించారు. తొలుత నగరంలో విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.