కావూరికి సమైక్య సెగ
ఢిల్లీలో మంత్రి నివాసాన్ని ముట్టడించిన సీమాంధ్ర విద్యార్థి జేఏసీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్య సెగ తగిలింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై కేంద్రం మొండిగా ముందుకు వెళుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల తీరును నిరసిస్తూ సీమాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఢిల్లీలో కావూరి ఇంటిని ముట్టడించారు. విభజన బిల్లును పార్లమెంట్‌లో అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ కావూరి నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది. సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నేత అడారి కిశోర్, సీమాంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని ప్రసాద్‌ల నేతృత్వంలో 30 మంది విద్యార్థులు కావూరి ఇంటిని ముట్టడించారు.
సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా కావూరి వారిని కలిసేందుకు నిరాకరించారు. దీంతో విద్యార్థులు ఆయన నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు దీన్ని నిరసిస్తూ అక్కడ ఉన్న పూలకుండీలను పగులగొట్టారు. ఇంటిముందు బైఠాయించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. రాష్ట్ర సమైక్యతను కాపాడతానని ప్రతిజ్ఞ చేసిన కావూరి నేడు పదవి కాపాడుకునేందుకు అధిష్టానానికి సహకరిస్త్తున్నారని ఆరోపించారు. కావూరి ఇంటిముం దున్న నేమ్‌ప్లేట్‌కు ‘రాష్ట్రాన్ని కాపాడండి’ ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి’ అన్న పోస్టర్లను అతికించారు. అరగంట తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి నేత కిశోర్‌తోపాటు ఇతరులను అరెస్టు చేసి అనంతరం విడిచిపెట్టా రు. 15 రోజుల్లో పోయే పదవి కోసం కావూరి సమైక్య నినాదాన్ని పక్కనపెట్టారని విద్యార్థి నేత కిశోర్ విమర్శించారు.