కర్నూలు, అనంత జిల్లాలను తెలంగాణలోనే ఉంచండి
ఏలూరు: కేంద్రమంత్రి కావూరి సాంబశివరావును సమైక్యాంధ్ర ఉద్యమ సెగ వెంటాడుతోంది. భారీ బందోబస్తు మధ్య ఏలూరులో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఇటీవల చింతలపూడిలో జరిగిన కావూరి పర్యటనను వైసీపీ నేతలు అడ్డుకోవడం, అనంతరం కోడిగుడ్లతో దాడికి తెలిసిందే. దాంతో కావూరి పర్యటనకు పోలీసులు భారీగా మోహరించారు.
తానెప్పటికీ సమైక్యవాదినే అంటూ కావూరి ...మరోసారి సమైక్యవాదులను తన మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. రాష్ట్రం ఎప్పుడూ కలిసుండాలనే కోరుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ తప్పనిసరై రాష్ట్ర విభజన జరిగితే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే భద్రాచలంను ఆంధ్రాలో కలపాలని కావూరి అభిప్రాయపడ్డారు. కేంద్రం పర్యవేక్షణలో హైదరాబాద్ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా డిమాండ్ చేశామన్నారు. తెలంగాణ బిల్లులో కచ్చితంగా మార్పులుంటాయన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదానికి వస్తే అందులో తాను భాగస్వామిని కాలేనని కావూరి చెప్పారు. రాజీనామా చేయటమా? గైర్హాజరు కావటమా అనేది అప్పుడే నిర్ణయించుకుంటానని కావూరి తెలిపారు.