సాక్షి ప్రతినిధి, ఏలూరు : తాను సమైక్యవాదినని ఊరూవాడా ప్రచారం చేసుకున్న కావూరి సాంబశివరావు కేంద్ర మంత్రి అయ్యూక సమైక్యవాదులపైనే విరుచుకుపడుతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి పొందాక సమైక్య వాదానికి గుడ్‌బై చెప్పిన ఆయన జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిని దూషించడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. మంగళవారం చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ఆయనును రాష్ట్ర విభజనపై నిలదీయడంతో ఇష్టానుసారం నోరుపారేసుకోవడం కలకలం రేపింది.
నోటికి వచ్చినట్లు తిట్టిన ఆయన అక్కడితో ఆగకుండా సమైక్యవాదులను రెండోసారి అరెస్టు చేయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైనప్పటి నుంచీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు, ఎన్జీవోలు అడుగడుగునా అడ్డుకుంటూనే ఉన్నారు. ఇలా అడ్డుకున్న వారిపై పోలీసులు సాధారణ కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. మంగళవారం చింతలపూడిలో కావూరిని అడ్డుకున్నందుకు అక్కడి పోలీసులు సెక్షన్-151 కింద కేసులు నమోదు చేసి 21 మందిని అరెస్ట్ చేశారు. ఆ వెంటనే వ్యక్తిగత పూచీకత్తుపై అందరినీ వదిలేశారు. అయితే బుధవారం అదే కేసులో మూడు అదనపు సెక్షన్లు నమోదు చేసి మాజీ ఎమ్మెల్యే రాజేష్‌తోపాటు మరో 19మందిని అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
రెండోసారి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే ప్రశ్నకు పోలీసుల వద్ద సమాధానం లేకుండాపోయింది. ఇదంతా కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కక్ష గట్టి చేయించినట్టు అందరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ వారిపై అదనపు సెక్షన్లు పెట్టించి అరెస్ట్ చేయించారు. తీవ్రమైన కేసుల్లో మాత్రమే పోలీసులు ఇలా సెక్షన్లు మార్చుతారు. కానీ సమైక్యాంధ్ర ఉద్యమం కేసులో, అదీ ఒక కేంద్ర మంత్రి ఒత్తిడితో అదనపు సెక్షన్లు పెట్టడం పోలీసులకే ఇబ్బందికరంగా మారింది.
ఉద్యమం మొదలైన నాటినుంచీ ఇంతే...
కావూరి సాంబశివరావు వైఖరి రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. గతంలోనూ ఆయన ఇదే తరహాలో సమైక్యవాదులపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఎన్జీవోలు ఏలూరులోని క్యాంపు కార్యాలయం వద్ద ఆయనను నిలదీయడంతో వారందర్నీ వెధవలంటూ తిట్టిపోశారు. పదవి తనకు లెక్కకాదని చెప్పిన ఆయన అదే పదవి కోసం రాష్ట్ర విభజనను సమర్ధించడాన్ని సమైక్యవాదులు జీర్ణించుకోలేపోతున్నారు. ఒకవైపు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నారుు. అక్కడ రాష్ట్ర విభజన అంశంపై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి కీలక తరుణంలో పార్లమెంట్ సమావేశాలకు డుమ్మా కొట్టి ఢిల్లీ నుంచి జిల్లాకు వచ్చిన కావూరి సమైక్యవాదులను బండబూతులు తిట్టడం గమనార్హం.
కేంద్ర మంత్రి పదవిని అలంకరించినప్పటి నుంచి కావూరి వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పదవి రాకముందు కేంద్ర ప్రభుత్వాన్ని తెగతిట్టిన ఆయన పదవి వచ్చాక సమైక్యవాదులపై దుర్భాషలాడుతున్నారు. పదవికి రాజీనామా చేయాలని ఎంత ఒత్తిడి వచ్చినా పట్టించుకోకుండా దాన్నే అంటిపెట్టుకుని వేలాడటంపై రాష్ట్ర వ్యాప్తం గా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్ర కేబినెట్‌లో రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగే సమయంలో రాయల తెలంగాణకు మద్ధతివ్వడంపైనా తీవ్ర వ్యతిరేకత నెల కొంది. చివరకు విభజనను వ్యతిరేకిస్తూ కేం ద్రంపై కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాసం పెడితే దానికి మద్దతు ఇవ్వడానికి మాజీ సమైక్యవాదిగా ఉన్న కావూరి ముందుకురాలేదు. ఇలా ఏ దశలోనూ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా వ్యవహరించిన ఆయన తరచూ సమైక్యవాదులపై విరుచుకుపడుతుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కావూరి ‘కావరం’!
Published Thu, Dec 19 2013 4:52 AM | Last Updated on Wed, Aug 15 2018 7:45 PM
Advertisement
Advertisement