కావూరి రాజీనామా.. ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేయబోనని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వెల్లడించారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, ఏ పార్టీలోకి వెళ్లాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ఆయన గురువారం ఉదయం పదిగంటలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసానికి వెళ్లి రాజీనామా సమర్పించారు. ఆయన వెంటనే రాష్ట్రపతికి ఆ లేఖను పంపారు. రాష్ట్రపతి దానిని ఆమోదించారు. విభజన తీరు తనను ఎంతో బాధించిందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. విభజనకు సంబంధించిన ప్రతి అంశాన్ని టేబుల్ ఐటంగానే కేబినెట్ ముందుకు తెచ్చారని, అప్రజాస్వామికమైన ఈ నిర్ణయాలను తాను సమర్థించబోనని ప్రతి కేబినెట్ సమావేశంలో సూచించినట్టు అందులో తెలిపారు. రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించి ఎన్నోమార్లు వ్యక్తిగతంగానూ కలసి విజ్ఞప్తి చేసినట్టు గుర్తుచేశారు. అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను ఆపాలని కేబినెట్‌లోనూ, పార్లమెంట్‌లోనూ ప్రయత్నించానన్నారు. 20 రోజుల కిందటే రాజీనామా చేయాల్సి ఉన్నా కొంత ఆలస్యమైందని చెప్పారు. కొత్త రాష్ట్రానికి అభివృద్ధి నిధుల కోసం, పోలవరం ముంపు మండలాలపై ఆర్డినెన్స్, హైదరాబాద్ యూటీ... ఇలా పలు విషయాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకుందామన్న ఉద్దేశంతోనే కేబినెట్‌లో కొనసాగినట్లు తెలిపారు. తన పనితీరు బాగుందని, రాజీనామా చేయవద్దని ప్రధాని వారించారని తెలిపారు. తాను కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తనకెలాంటి హామీ రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
జైరాం, కావూరి మాటల యుద్ధం
కావూరి రాజీనామాపై జైరాం రమేశ్ మాట్లాడుతూ... కావూరికి వ్యాపార ప్రయోజనాలు తప్ప సిద్ధాంతాలేవీ లేవని దుయ్యబట్టారు. కేబినెట్ నిర్ణయాలు వెలువరించేందుకు జైరాం విలేకరుల సమావేశం నిర్వహించారు. కావూరి రాజీనామా చేశారని విలేకరులు చెప్పగానే.. పార్టీని కూడా వీడారేమోననుకున్న కావూరిపై విరుచుకుపడ్డారు. ఆయన అప్పులపై ప్రశ్నించకుండా ఉండేందుకు బీజేపీని ఆశ్రయించినట్టున్నారని ధ్వజమెత్తారు. పురందేశ్వరి, కావూరి వంటి వారు కాంగ్రెస్ నుంచి పూర్తి లబ్ధిపొంది ఆ తరువాత కాంగ్రెస్‌ను వదిలేశారని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారని విలేకరులు చెప్పడంతో సర్దుకుని... ‘‘ఆయన మంత్రిపదవికి రాజీనామా చేయడం బాధాకరం. పోలవరం గురించి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ గురించి పోరాటం చేశారు..’’ అని చెప్పారు.
జైరాం వ్యాఖ్యలు తెలుసుకున్న కావూరి సాయంత్రం మళ్లీ విలేకరుల సమావేశం నిర్వహించి నిప్పులు కురిపించారు. దమ్మిడీ విలువ లేని జైరాం లాంటి వారి వల్లే పార్టీకి ఈ గతిపట్టిందని విమర్శించారు. జీవితం లో ఏనాడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీపడనివారు, ఏవో నాలుగు పుస్తకాల్లోని విషయాలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఇలాంటివారివల్లే సీమాంధ్రలో కాంగ్రెస్ ఒక్కసీటూ గెలవని పరిస్థితికి చేరిందని చెప్పారు. ఇలాంటి వాళ్లను నమ్మితే వందేళ్లయినా పార్టీ తిరిగి అధికారంలోకి రాదని చెప్పారు. ప్రభుత్వ విధానాల వల్ల పదేళ్లుగా ఇన్‌ఫ్రా కంపెనీలన్నీ నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి సన్నాసులు ఎందరున్నారో చూశాక పార్టీలో కొనసాగే విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.