కాంగ్రెస్ సీఎం అభ్యర్థులకూ తప్పని ఓటమి
Published Sat, May 17 2014 2:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
డజను మందిలో 8 మంది పరాజయం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులకూ ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలతో కలిపి సుమారు డజను మంది సీఎం పదవిని ఆశించిన సంగతి తెలిసిందే. వీరిలో ఏకంగా 9 మంది ఓటమి పాలయ్యారు. కేంద్ర మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ రాష్ట్ర తాజా మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీధర్‌బాబు, ఎంపీలు వి.హనుమంతరావు, విజయశాంతి, ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి ఈ జాబితాలో ఉన్నారు. సీఎం పదవిని ఆశించిన మిగిలిన నేతల్లో కె.జానారెడ్డి, జె.గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఓటమి నుంచి బయటపడి పరువు దక్కించుకున్నారు. వీరుగాక తాజీ మాజీ మంత్రుల్లోనూ అత్యధికులు పరాజయం పాలయ్యారు. మొత్తం 14 మంది తెలంగాణ తాజా మాజీ మంత్రులుండగా, సబితా ఇంద్రారెడ్డి మినహా మిగిలిన వారంతా ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో ఐదుగురు మాత్రమే గెలవగా, 9 మంది ఘోర పరాజయం పాలయ్యారు. వీరిలో పైన పేర్కొన్న తాజా మాజీలతోపాటు పి.సుదర్శన్‌రెడ్డి, బసవరాజు సారయ్య, దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, సునీత లక్ష్మారెడ్డి ఓటమిపాలవగా, డీకే అరుణ, రాంరెడ్డి వెంకటరెడ్డి టీఆర్‌ఎస్ గాలికి ఎదురొడ్డి గెలిచారు.
బోసిపోయిన గాంధీభవన్
ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడంతో గాంధీభవన్ బోసిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు అటువైపు రాలేదు. టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఒక్కరే గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి వెంటనే వెళ్లిపోయారు.
Advertisement