టీడీపీ జయభేరి
టీడీపీ జయభేరి
Published Sat, May 17 2014 2:34 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
సీమాంధ్రలో టీడీపీ విజయం
కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో తెలుగుదేశం-బీజేపీ కూటమి విజయం సాధించింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి నరేంద్ర మోడీ పట్ల దేశవ్యాప్తంగా ఉన్న హవా తోడు కావడంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్థానాలు లభించాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 106 స్థానాల్లో టీడీపీ-బీజేపీ కూటమి గెలిచింది.
అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 88 సీట్ల కంటే 18 స్థానాలు అధికంగా వచ్చాయి. టీడీపీ 102, బీజేపీ 4 స్థానాలు గెలిచాయి. సీమాంధ్రలోని 25 లోక్‌సభ స్థానాల్లో కూటమి 17 సీట్లు గెలుచుకుంది. వీటిలో టీడీపీకి 15, బీజేపీకి రెండు దక్కాయి. తొలిసారి సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 67 శాసనసభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 8 లోక్‌సభ స్థానాలనూ గెలుచుకుంది.
టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ తప్ప సీమాంధ్ర తొలి శాసనసభలో మరో పార్టీకి ప్రజలు అవకాశమివ్వలేదు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుంచి ఎస్వీఎస్సెన్ వర్మ, ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ రూపంలో రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్రం స్వతంత్రులు గెలుపొందారు. ఇంతకాలం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. అన్నిచోట్లా ఆ పార్టీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయారు.
వామపక్షాలు, జై సమైక్యాంధ్ర పార్టీ, లోక్‌సత్తా పార్టీలతో పాటు పెద్దఎత్తున రంగంలోకి దిగిన స్వతంత్రులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఎన్నికలు టీడీపీ-బీజేపీ కూటమికి, వైఎస్సార్‌సీపీకి మధ్యే జరిగినట్టు ఎన్నికల ఫలితాలనుబట్టి తేలింది.
ఉదయం 11 గంటలకే ఆధిక్యతపై స్పష్టత
సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు వాడటంతో ఉదయం 11 గంటలకే పార్టీల ఆధిక్యతపై స్పష్టత వచ్చింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు టీడీపీ, వైఎస్సార్‌సీపీ పోటాపోటీగా ఉన్నాయి. 10.30 గంటల వరకు ఇదే ఒరవడి కొనసాగింది. తర్వాత టీడీపీ క్రమంగా పుంజుకుంది.
ప్రతిఫలించిన ఉభయ గోదావరి సెంటిమెంట్
ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ స్థానాలు సాధించిన పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే సెంటిమెంటు కొత్త రాష్ట్రంలో కూడా ప్రతిఫలించింది. ఈ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఆ పార్టీనే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో టీడీపీకి అత్యధిక స్థానాలు లభించాయి.
టీడీపీకి కలిసొచ్చిన మోడీ హవా
మోడీ హవా ఇక్కడ చంద్రబాబుకు బాగా కలిసొచ్చింది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో మోడీ ప్రభావం కనిపించింది. వ్యాపారులు, ఉన్నతవర్గాలు మోడీ పట్ల ఆకర్షితులవడం వల్ల టీడీపీకి మేలు జరిగిందని పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు మద్దతిచ్చి, పార్లమెంట్‌లో విభజన బిల్లు గట్టెక్కడానికి కారణమైన బీజేపీకి సీమాంధ్రలో ఒక్క సీటూ రాదని ఎన్నికలకు ముందు విశ్లేషకులు భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ 4 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. మోడీ పట్ల నగర ఓటర్లు ఆకర్షితులవడం వల్లే బీజేపీ గెలుపు సాధ్యమైందని, ఇదే టీడీపీ విజయానికీ దోహదం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రుణ మాఫీతో గణనీయంగా గ్రామీణ ఓట్లు పొందిన టీడీపీ
గ్రామీణ ప్రాంతాల్లో బాబు పట్ల ప్రజల్లో, మరీ ముఖ్యంగా రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గిం చుకొని వారి ఓట్లు కొల్లగొట్టడానికి టీడీపీ ఇచ్చిన రుణమాఫీ హామీ బాగా పనిచేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. రుణ మాఫీ హామీని రైతులు విశ్వసించడంతో గ్రామీణ ప్రాంతాల్లో నూ టీడీపీకి గణనీయంగా ఓట్లు వచ్చాయి. మోడీ హవాతో పట్టణ, నగర ఓట్లు, రుణమాఫీ తో గ్రామీణ ఓట్లు రావడంవల్లే టీడీపీ విజయం సాధ్యమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాంగ్రెస్‌కు గుండు సున్నా
గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ సీమాంధ్రలో చతికిలపడింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ మీద ప్రజలు కసి తీర్చుకున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వారినందరినీ చిత్తుగా ఓడించారు.
Advertisement
Advertisement