ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో సమైక్యాంధ్ర ఉద్యమం శనివారం ఉద్రికత్తకు దారితీసింది. తెలంగాణ నోట్‌ను వెంటనే కేంద్రం రద్దు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆర్టీపీపీలోని విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు ప్రాజెక్టులోకి గేట్లను తోసుకుంటూ వెళ్లారు.
విధులకు ఎవరినీ పోనివ్వకుండా అడ్డుకున్నారు. మొదట మూడవ యూనిట్‌ను నిలిపి వేసి సర్వీసులోకి తీసుకురావద్దని జేఏసీ నాయకులు సీఈ కుమారుబాబును కోరారు. సీఈ వినకపోవడంతో వారందరూ యూనిట్‌లోని యూసీబీ(యూనిట్ కంట్రోల్ బోర్టు)లోకి వెళ్లి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. వెంటనే సీఈ కుమారుబాబు మూడవ యూనిట్‌ను నిలుపుదల చేస్తామని చెప్పడంతో వారు శాంతించారు.
యూనిట్లన్నీ ట్రిప్..
ఆర్టీపీపీలో ఉన్న 1,2,3,4,5 యూనిట్లన్నీ సమైక్యవాదులు ట్రిప్ చేశారు. దీంతో గ్రిడ్‌లో సాంకేతిక లోపం ఏర్పడి 1050 మెగావాట్లు విద్యుత్ ఒక్కసారిగా నిలిచిపోయి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సెల్ టవర్ ఎక్కి...
ఆర్టీపీపీలో వైఎస్‌ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు గుగ్గల మహేశ్వర్‌రెడ్డి, పులి సుధాకర్‌రెడ్డి, కిరణ్‌కుమారు, నాయక్ బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ సంజీవరెడ్డి, ఉద్యోగులు, కార్మికులు టవర్ ఎక్కిన వారిని దించడానికి ప్రయత్నాలు చేశారు. యూనిట్లన్నీ నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆర్టీపీపీ జేఏసీ నాయకులు అక్కడికి చేరుకుని సమైక్యవాదులను శాంతింప చేసి కిందకు దించారు.
ఆర్టీపీపీలో ఉద్రిక్తత
Published Sun, Oct 6 2013 2:33 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement