విద్యా కమిషన్ సలహా మండలి సభ్యుల అసంతృప్తి
అసలు విధులేమిటో చెప్పనేలేదు.. సమాచారమే లేదు..
ఎవరికి సలహాలివ్వాలి? ఏమివ్వాలి?
కమిటీలో చేరబోమని చెప్పేందుకు సిద్ధమైన సలహాదారులు.. అధికారాల్లేని కమిషన్‌లో ఒరగబెట్టేది ఏమిటనే అభిప్రాయం
విద్యా కమిషన్ చైర్మన్‌లోనూ అసంతృప్తి!
సాక్షి, హైదరాబాద్: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తొలిదశలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన కమిషన్‌ను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. విద్యా కమిషన్ కోసం ఏర్పాటు చేసిన సలహా మండలి సభ్యులు ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలాంటి హేతుబద్ధత లేకుండా, తమను సంప్రదించకుండానే సభ్యులుగా చేర్చారని కొందరు సభ్యులు మండిపడుతున్నారు.
సలహా మండలిలో చేరేదే లేదని ఇప్పటికే ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారని.. మరో ఇద్దరు ఇదే బాటలో ఉన్నారని తెలిసింది. మరోవైపు కమిషన్ చైర్మన్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కమిటీ ఏర్పాటు చేసినా.. ఎలాంటి మౌలిక సదుపాయాలు ఇవ్వకపోవడం, సలహాదారుల ఎంపికలో తనకు ప్రమేయమే లేకపోవడాన్ని ఆయన జీర్ణించుకోవడం లేదని తెలిసింది. విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అన్నీ తానే అయి నడిపిస్తుండటమే దీనికి కారణమని విద్యాశాఖ వర్గాలు చెప్తుండటం గమనార్హం.
ఇవేం నియామకాలు?
విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. చైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించింది. చాలా రోజుల తర్వాత కమిషన్‌కు ముగ్గురు సభ్యులను నియమించింది. వాస్తవానికి విద్యా రంగంలోని వివిధ విభాగాల నుంచి సభ్యుల నియామకం జరగాలని కొన్ని నెలల క్రితం జరిగిన మేధావుల సమావేశంలో సీఎంకు పలువురు సూచించారు. కానీ ఒక కార్పొరేటర్, అధికార పారీ్టకి చెందిన ఓ స్కాలర్ సహా మరో వ్యక్తిని సభ్యులుగా నియమించడంపై విమర్శలు వచ్చాయి. దీనివల్ల సభ్యులు రాజకీయ కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుందని.. విద్యా రంగంలో పారదర్శకంగా సంస్కరణలు చేపట్టలేమనే అభిప్రాయాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే విద్యా కమిషన్‌కు సలహా కమిటీ సభ్యులుగా ప్రొఫెసర్ హరగోపాల్ సహా పలువురు ప్రొఫెసర్లను నియమించారు. అయితే ఈ నియామకాలు విద్యా కమిషన్ పరిధిలో జరిగి ఉంటే బాగుండేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం కొందరి సూచనల మేరకు సలహా కమిటీని సీఎం వేశారని అంటున్నారు. సలహా కమిటీ కేవలం ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని.. అలాంటప్పుడు విద్యా కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
సంస్కరణలు సాధ్యమేనా?
విద్యా కమిషన్‌పై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని.. విద్యా రంగంలో సంస్కరణల దిశగా అడుగులు వేయడం లేదని సలహా కమిటీలో నియమితులైన సభ్యుడొకరు మండిపడ్డారు. కర్నాటకలోనూ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారని, ఆ కమిషన్ మొత్తం 14 సబ్ కమిటీలను వేసుకుందని.. వాటి ద్వారా మార్పులకు శ్రీకారం చుడుతోందని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ రాజకీయ, సామాజిక కోణంలోని వారినే ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చారని.. సాంకేతిక విద్య, అంగన్‌వాడీ, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో నిపుణులను భాగస్వామ్యం చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అంతేగాకుండా అసలు విధులేమిటో చెప్పలేదని, ఏం సలహాలివ్వాలి, ఎవరికి ఇవ్వాలనే స్పష్టతా లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యా కమిషన్‌కు ఆదిలోనే తలపోట్లు తప్పేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment