నేరాల నిరోధం (ప్రివెన్షన్), కేసులు కొలిక్కి తీసుకురావడం (డిటెక్షన్), నిందితుల్ని దోషులుగా నిరూపించడం (కన్విక్షన్).. ఇవి పోలీసుల ప్రాథమిక విధులు. మొదటి రెండింటి మాట అటుంచితే అనివార్య కారణాల నేపథ్యంలో మూడోది మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కోర్టులో నేర నిరూపణే కష్టసాధ్యంగా మారిన తరుణంలో ఇక నిందితుడికి ఉరి శిక్ష అనేది దుర్లభమే. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు కేసుల్లోనే ఈ శిక్షపడగా.. వాటిలో ఒకటి హైదరాబాద్‌లోని నారాయణగూడ పరిధిలో జరిగిన ఓ కుటుంబ హత్యకు సంబంధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి ఉరి శిక్ష పడటంతో ఓ హోటల్ మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా నిలిచింది.
హైదరాబాద్, అంబర్‌పేటలోని గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్ నాగుల సాయి.. శుభకార్యాలకు బ్యాండ్ వాయించే పని చేస్తుండేవాడు. ఆ పనిలేనప్పుడు చిత్తుకాగితాలు ఏరుకుని బతుకీడ్చేవాడు. అతనికి స్నేహితుడి ద్వారా హైదరాబాద్‌లోని చిక్కడపల్లి వాసి ఆర్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2014లో ఇరువురూ ఒక్కటి కాగా.. ఏడాదికి కూతురు పుట్టింది. ఆ ఇద్దరి మధ్యా ఉన్న చిన్న చిన్న స్పర్థలు చినికి చినికి గాలివానగా మారడంతో ఆర్తి 2021లో భర్తను వదిలేసింది. కూతురిని తీసుకుని చిక్కడపల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయి తల్లి లక్ష్మీబాయి, సోదరుడు జితేందర్‌లతో కలిసి ఉండసాగింది. సాయి తరచు ఆర్తి పుట్టింటికి వెళ్తూ ఆమె కుటుంబీకులతో ఘర్షణ పడేవాడు. ఓ సందర్భంలో జితేందర్‌పై దాడి చేసి, మరోసారి కోర్టు ధిక్కరణ నేరంపై జైలుకూ వెళ్లాడు.
ఆర్తికి మగతోడు అవసరమని తలచిన జితేందర్ భార్య అనువైన సంబంధం కోసం వెదకసాగింది. ఆమె ద్వారా పరిచయమైన నాగరాజు మీద ఆర్తి కుటుంబానికి సదభిప్రాయం కలగడంతో 2021లో వీరిద్దరికీ వివాహం చేశారు. తన భార్యను వివాహం చేసుకుని తనకు పూర్తిగా దూరం చేశాడనే ఉద్దేశంతో నాగరాజుపై ద్వేషం పెంచుకున్నాడు సాయి. హైదరాబాద్, నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఉన్న మార్కెట్‌లో నాగరాజు పూల వ్యాపారం చేసేవాడు. అతనికి ఆర్తి చేదోడువాదోడుగా ఉండేది. తరచు తమ దుకాణం వద్దకు వచ్చి ఘర్షణ పడుతున్న, తన భార్యతో వాగ్వాదానికి దిగుతున్న సాయిని నాగరాజు అనేకసార్లు మందలించాడు. వీరికి కొడుకు (విష్ణు) పుట్టడంతో సాయిలో ద్వేషంతో పాటు ఈర్ష్య కూడా పెరిగింది. దాంతో అతని ప్రవర్తన విపరీతంగా మారడమే కాదు ఆర్తి కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ పలుమార్లు బహిరంగంగానే బెదిరించాడు.
దీన్ని తీవ్రంగా పరిగణించిన నాగరాజు.. తన భార్యను వేధిస్తున్న సాయిని బెదిరించాలని భావించాడు. 2022 నవంబర్ 7న నారాయణ గూడ మెట్రో స్టేషన్ వద్ద నాగరాజుకు సాయి కనిపించాడు. అతడిని అడ్డగించి.. మరోసారి ఆర్తితో మాట్లాడినా, ఫోన్ చేసి బెదిరించినా ఊరుకునేది లేదంటూ బెదిరించిన నాగరాజు.. ఇకపై ఆమెను సోదరిగా భావిస్తూ చెల్లి అని పిలవాలంటూ హెచ్చరించాడు. ఈ పరిణామంతో విచక్షణ కోల్పోయిన సాయి.. చిక్కడపల్లికే చెందిన తన స్నేహితుడు రాహుల్‌తో కలిసి నాగరాజు, ఆర్తిల హత్యకు కుట్రపన్నాడు. అదేరోజు రాత్రి హైదరాబాద్, నల్లకుంటలోని పెట్రోల్ బంక్ నుంచి ఖాళీ వాటర్ బాటిల్‌లో పెట్రోల్ తీసుకు వచ్చాడు. ఆర్తి, నాగరాజు తమ దుకాణంలో ఉన్నారని గుర్తించిన అతగాడు.. ఇద్దరిపైనా పెట్రోల్ చల్లడం ఇబ్బందికరమని భావించాడు. తన స్నేహితుడు రాహుల్‌తో కలిసి నారాయణ గూడ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న లక్కీ కేఫ్‌లోకి వెళ్లాడు.
అక్కడ మంచి నీళ్లు తాగుతూ అదును చూసుకుని ఓ మగ్గు తస్కరించాడు. నాగరాజు దుకాణానికి సమీపంలో ఆగి బాటిల్‌లోని పెట్రోల్‌ను మగ్గులో పోసుకున్నాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ చేతిలో అగ్గిపెట్టెను సిద్ధంగా ఉంచుకుని నాగరాజు దుకాణం వద్దకు వెళ్లాడు. ఆర్తి, నాగరాజు తేరుకునేలోపే వారిపై మగ్గులోని పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఆ దాడిలో వీరిద్దరితో పాటు ఆర్తి ఒడిలో ఉన్న ఎనిమిది నెలల విష్ణు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ నుంచి రాహుల్‌తో కలిసి బర్కత్‌పుర వైపు పారిపోయిన సాయి నల్లగొండకు చేరి తలదాచుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్తి, విష్ణు, నాగరాజు చనిపోయారు. పోస్టుమార్టంలో ఆర్తి గర్భవతని తేలింది. దీంతో సాయి చేతిలో చనిపోయింది నలుగురుగా తేల్చారు.
నారాయణగూడ పోలీసులు సాయి, రాహుల్‌ను అదే నెల 16న అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన అధికారులు ఘటనాస్థలి నుంచి కాలిన స్థితిలో ఉన్న మగ్గును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇన్వెస్టిగేషన్ అనంతరం 48 మందిని సాక్షులుగా చేరుస్తూ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. కోర్టు విచారణ సందర్భంగా కొందరు సాక్షులు విముఖత చూపినా.. పెట్రోల్ చల్లేందుకు వాడిన, సగం కాలిన మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా మారింది. దీన్ని తస్కరించినట్లు సాయి అంగీకరించగా.. అది తమ మగ్గే అంటూ లక్కీ కేఫ్ యజమాని సాక్ష్యం చెప్పాడు. దీన్ని సైతం ఓ కీలక ఆధారంగా పరిగణించిన న్యాయస్థానం సాయి, రాహుల్‌ను దోషులుగా తేల్చింది. గత నెల 20న (20.12.2024) సాయికి ఉరి శిక్ష, రాహుల్‌కు జీవితఖైదు విధించింది. ఈ కేసు విచారణలో నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ యు.చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment