విద్యుత్ జేఏసీ కన్వీనర్ సాయిబాబా
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సెక్టార్లో పనిచేస్తున్న 37వేలమంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 4న విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు విద్యుత్ జేఏసీ కన్వీనర్ సాయిబాబా ప్రకటించారు. హైదరాబాద్ ఏపీఎన్జీవో భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఏపీట్రాన్స్‌కో, డిస్కంలు, ఏపీ జెన్‌కోల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఏళ్లతరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేకుండా, చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్ కోసం ఈనెల 28న‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని కూడా చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకుంటే ఫిబ్రవరి 6నుంచి రాష్ట్రంలోని 23జిల్లాలకు చెందిన కాంట్రాక్టు కార్మికులంతా సమ్మెబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు ఏపీఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నుంచి మద్ధతును కోరుతున్నట్లు ఆయన చెప్పారు.
3న విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి
విద్యుత్ కోతలకు నిరసనగా వచ్చే నెల 3న విద్యుత్ సబ్‌స్టేషన్లను ముట్టడించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది. విద్యుత్ కోతల వల్ల నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఓట్ల కోసం 9 గంటలు, ఆచరణలో 3 గంటలా? అని ప్రభుత్వ తీరును ప్రశ్నించింది. శనివారమిక్కడ రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశం రాష్ట్రంలో రైతుకు కష్టాలపై స్పందిస్తూ ఈ మేరకు తీర్మానించింది. సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నేతలు కొల్లి నాగేశ్వరరావు, సీపీఐ శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేష్, కె.రామకృష్ణ, రావుల వెంకయ్య పాల్గొన్నారు.