నాగ్‌పూర్: మావోయిస్టులతో లింకు ఉందన్న కేసులో జీవిత ఖైదు పడిన ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్ధోషులుగా పేర్కొంటూ మంగళవారం తీర్పిచ్చింది.
తమకు ఈ కేసులో జీవిత ఖైదు విధిస్తూ గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సాయిబాబాతో పాటు మరో ఐదుగురు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌ను విచారించిన హైకోర్టు కింది కోర్టు తీర్పును కొట్టివేసింది. దీంతో మావోయిస్టులతో సంబంధాల కేసులో సాయిబాబాతో పాటు శిక్షపడిన మరో ఐదుగురు జైలు నుంచి విడుదలవనున్నారు.
కేసు వివరాలు ఇలా..
మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌లాల్‌ఆనంద్ కాలేజీ ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేశారు. ఐపీసీతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)సెక్షన్ల కింద ఆయనపై ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన తర్వాత ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి తొలగించింది.
సెషన్స్‌కోర్టు ఇచ్చిన జీవితఖైదు తీర్పుపై సాయిబాబా అప్పీల్‌కు వెళ్లగా యూఏపీఏ కేసులో ప్రొసీజర్‌ను పోలీసులు సరిగా పాటించలేదన్నా కారణంగా బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా అత్యున్నత కోర్టు సాయిబాబా విడుదలపై స్టే ఇచ్చింది. కేసును తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్ చేసింది. దీంతో తాజాగా అప్పీల్ విచారించిన బాంబే హైకోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్ధోషులుగా విడుదల చేస్తూ తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment