డీయూ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత | ex DU professor G N Saibaba passed away | Sakshi
Sakshi News home page

డీయూ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

Published Sat, Oct 12 2024 9:28 PM | Last Updated on Sun, Oct 13 2024 10:20 AM

ex DU professor G N Saibaba passed away

ఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త జీ.ఎన్‌ సాయిబాబా కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నక్సల్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో గతంలో సాయిబాబాను అరెస్టు చేశారు. దాదాపు 9 ఏళ్లపాటు ఆయన జైల్లోనే గడపాల్సి వచ్చింది. 

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అభియోగాలపై 2014లో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను అరెస్ట్ చేశారు. సాయిబాబా కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేసింది. 2017లో గడ్చిరోలి కోర్టు నిందితులకు జీవితఖైదు విధించగా.. ఆయన నాగ్‌పూర్‌ జైల్‌లో శిక్ష అనుభవించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. సాయిబాబాను నిర్ధోషిగా బాంబే హైకోర్టు ప్రకటించింది. మార్చి నెలలో నాగ్‌పూర్‌ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

సాయిబాబా 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన పోలియో కారణంగా ఐదేళ్ల వయస్సు నుంచి వీల్ చైర్‌ను ఉపయోగిస్తున్నారు. ఆయన జైలులో ఉన్న సమయంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. 

సాయిబాబా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో చాలా ఏళ్లు ఇంగ్లీష్ బోధించారు. ఆయన మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే కేసులో జైలుకు వెళ్లారు. దీంతో ఫిబ్రవరి 2021లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి నుండి తొలగించబడ్డారు.

మావోయిస్టులతో లింకు ఉందన్న కారణంగా మహారాష్ట్ర పోలీసులు 2014లో ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌లాల్‌ఆనంద్‌ కాలేజీ ప్రొఫెసర్‌ సాయిబాబాను అరెస్టు చేశారు. ఐపీసీతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)సెక్షన్ల కింద ఆయనపై ఛార్జ్‌షీట్‌ నమోదు చేశారు. 2017 వరకు ఈ కేసు విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్‌కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. శిక్ష పడిన తర్వాత ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఉద్యోగం నుంచి తొలగించింది.

సెషన్స్‌కోర్టు ఇచ్చిన జీవితఖైదు తీర్పుపై సాయిబాబా అప్పీల్‌కు వెళ్లగా యూఏపీఏ కేసులో ప్రొసీజర్‌ను పోలీసులు సరిగా పాటించలేదన్నా కారణంగా బాంబే హైకోర్టు 2022లోనే సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా అత్యున్నత కోర్టు సాయిబాబా విడుదలపై స్టే ఇచ్చింది. కేసును తిరిగి వినాలని బాంబే హైకోర్టుకే రిఫర్‌ చేసింది.

చదవండి: డాక్టర్ల రాజీమాలు చట్టపరంగా చెల్లవు: బెంగాల్‌ సర్కార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement