
ఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్దంలో రష్యా తరఫున పోరాడుతున్న 16 మంది భారతీయులు కనిపించకుండా పోవడంతో పాటు, ఇప్పటి వరకు 12 మంది మరణించినట్లు కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ప్రస్తుతం రష్యాలో చిక్కుకుని యుద్ధంలో పోరాడుతున్న భారతీయ పౌరులందరినీ స్వదేశానికి రప్పించడం కోసం తాము రష్యన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.
రష్యా తరఫున యుద్ధంలో 126 మంది భారతీయులు పాల్గొన్నట్లు సమాచారం ఉందన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ.. 96 మంది సైన్యం నుంచి విడుదలయ్యారని పేర్కొంది. కొందరు స్వదేశానికి తిరిగివచ్చారని.. ఇక 18 మంది ఇంకా సైన్యంలోనే పనిచేస్తున్నారని జైశ్వాల్ తెలిపారు. వారిలో 16 మంది ఆచూకీ లేదని స్పష్టం చేశారు.
తాజాగా రష్యా తరఫున యుద్దంలో పాల్గొన్న భారతీయుడు మృతిచెందడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారతీయుడి మృతిని దేశ విదేశాంగశాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో, రష్యా యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా యుద్ధం చేస్తున్న కేరళకు చెందిన బినిల్ బాబు(32) మృతిచెందాడు. అలాగే, అతడి సమీప బంధువు టీకే జైన్ (27)కు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బినిల్ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో భారతీయుడి మృతిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.
ఇదీ చదవండి: ద.కొరియా విమాన ప్రమాదం..వెలుగులోకి కీలక విషయాలు
Comments
Please login to add a commentAdd a comment