సియోల్:దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన భారీ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తులో కీలక విషయం బయటపడింది. జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం డిసెంబర్ 29న మయూన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతూ రన్‌వే పక్కనున్న గోడను ఢీకొట్టింది. విమానం బ్యాంకాక్ నుంచి మయూన్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందు నుంచి విమానంలోని బ్లాక్‌బాక్స్ పని చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణాలపై జరుగుతున్న దర్యాప్తులో తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ విమానం రెండు ఇంజిన్లలో పక్షి ఈకలు, రక్తం ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్లు సమాచారం. విమానాన్ని పక్షి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందన్న వాదనకు బలం చేకూరుతోంది. అయితే ఈ విషయాన్ని దర్యాప్తు బృందం అధికారికంగా ధృవీకరించలేదు. దర్యాప్తులో అధికారులు యాంత్రిక, నిబంధనల ఉల్లంఘన సమస్యలను గుర్తించినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించినట్లు కథనాలు వెలువడ్డాయి.
ముఖ్యంగా విమానం థ్రస్ట్ రివర్సర్స్, ఫ్లాప్స్, స్పీడ్‌బ్రేక్స్ వంటివి పూర్తిస్థాయిలో పని చేయలేదని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేకుండానే విమానం నేల పైకి దిగడానికి అనుమతించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమానం రన్‌వేపై అత్యవసరంగా దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ పని చేయకపోవడంతో అది బాడీ పైనే బెల్లీ ల్యాండింగ్ చేసిందని ప్రమాద సమయంలో అధికారులు తెలిపారు.
అప్పటికే ఒక ఇంజిన్‌ను పక్షి ఢీకొనడంతో దానిలో శక్తి కూడా గణనీయంగా తగ్గిందని అందువల్లే ల్యాండ్ అయ్యాక అదుపుతప్పి గోడను ఢీకొట్టిందని చెప్పారు. ద.కొరియా విమాన ప్రమాదం జరిగే కొద్ది రోజుల ముందే అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్తాన్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలోనూ భారీ సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తోడు 2024 సంవత్సరాంతంలో వరుస విమాన ప్రమాదాలు జరగడంతో విమాన ప్రయాణికులు కలవరపాటుకు గురయ్యారు.
ఇదీ చదవండి: నల్లపెట్టె మౌనరాగం
Comments
Please login to add a commentAdd a comment