నల్లపెట్టె మౌనరాగం! | Black Boxes Mysteriously Stopped Working Before Crash, Investigations Becoming More Complex | Sakshi
Sakshi News home page

నల్లపెట్టె మౌనరాగం!

Published Fri, Jan 17 2025 6:08 AM | Last Updated on Fri, Jan 17 2025 10:19 AM

Black boxes mysteriously stopped working before crash

విమాన ప్రమాదాల్లో మూగవోతున్న బ్లాక్‌ బాక్స్‌ 

క్లిష్టంగా మారుతున్న దర్యాప్తులు 

నల్ల రంగులో ఉండదు. పేరు మాత్రం బ్లాక్‌ బాక్స్‌. ‘డెత్‌ కోడ్‌’ను తనలో గోప్యంగా దాచుకుంటుంది. నిజానికిది ఒక్క బాక్సు కూడా కాదు. రెండు పెట్టెలు! విమానం కూలిందంటే అందరి కళ్లూ దానికోసమే చూస్తాయి. రికవరీ బృందాలు దాని వేటలో నిమగ్నమవుతాయి. అది దొరికితే ప్రమాద కారణాలు తెలిసినట్టే.  కానీ ఇటీవల బ్లాక్‌బాక్సులు తరచూ విఫలమవుతుండటం  ఆందోళన కలిగిస్తోంది.


గాలిలో ప్రయాణం ఎప్పుడూ గాల్లో దీపమే. రన్‌ వే నుంచి ఎగిరిన విమానం క్షేమంగా కిందికి దిగేదాకా టెన్షనే. వైమానిక దుర్ఘటనలకు కచి్చతమైన కారణాలు తెలియాలంటే బ్లాక్‌ బాక్స్‌ చిక్కాలి. అందులో ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ (ఎఫ్డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌) అని రెండు భాగాలుంటాయి. 

వీటిని ఫ్లైట్‌ రికార్డర్స్‌ అంటారు. సులభంగా గుర్తు పట్టేందుకు వీలుగా అవి ప్రకాశవంతమైన ఆరెంజ్‌ రంగులో ఉంటాయి. బ్లాక్‌ బాక్స్‌ సురక్షితంగా ఉండేలా ప్రమాదాల్లో తక్కువ నష్టం జరిగే తోక భాగంలో అమర్చుతారు. ఎఫ్డీఆర్‌ సెకన్ల వ్యవధిలో దాదాపు వెయ్యి పరామితులను నమోదు చేస్తుంది. ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ఎగురుతోంది, ఇంజన్‌ పనితీరు, ప్రయాణ మార్గం, దిశ తదితరాలను రికార్డు చేస్తుంది. ఇక సీవీఆర్‌ పైలట్ల సంభాషణలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు వారు పంపిన, స్వీకరించిన సమా చారం, కాక్‌పిట్‌ శబ్దాల వంటివాటిని నమోదు చేస్తుంది. 

కనుక విమాన ప్రమాదాలకు దారితీసిన కారణాలు, చివరి క్షణాల్లో మార్పులు తదితరాలను బ్లాక్‌ బాక్స్‌ మాత్రమే వెల్లడించగలదు. దాని డేటాను విశ్లేషించి ప్రమాద కార ణంపై పరిశోధకులు అంచనాకు వస్తారు. ఇంత కీలకమైన ఈ ‘నల్ల పెట్టె ఇటీవల మొండికేస్తుంది. మూగనోము పడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘జెజు ఎయిర్‌’విమానం గత నెల 29న కూలిపోయి ఇద్దరు మినహా 179 దుర్మరణం పాలవడం తెలిసిందే. కూలడానికి నాలుగు నిమిషాల ముందు నుంచే అందులోని ఫ్లైట్‌ రికార్డర్లు పని చేయడం మానేశాయి. దాంతో దర్యాప్తు క్లిష్టంగా మారింది.

వైఫల్యానికి కారణాలివీ...
బ్లాక్‌ బాక్సులోని రెండు రికార్డర్లు 4.5 కిలోలుంటాయి. గురుత్వశక్తి కంటే 3,400 రెట్లు అధిక శక్తితో విమానం కూలినా బ్లాక్‌ బాక్స్‌ తట్టుకోగలదు. వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతనూ కాసేపటిదాకా భరించగలదు. సము ద్రంలో కూలినా హై పిచ్‌ శబ్దాలతో 90 రోజులపాటు సంకేతాలు పంపగలదు. 20 వేల అడుగుల లోతులోనూ నెల పాటు పని చేయగలదు. దొరికాక కీలక డేటా, ఆడియో చెరిగిపోకుండా జాగ్రత్తగా వివరాలు సేకరిస్తారు. డేటాను డౌన్లోడ్‌ చేసి కాపీ చేస్తారు. దాన్ని డీకోడ్‌ చేసి గ్రాఫ్స్‌ రూపొందిస్తారు. అయితే... 

→ సర్క్యూట్‌ పాడవటం, సెన్సర్లు విఫ లమవడం తదితర సాంకేతిక అవరోధాలు, సాఫ్ట్‌వేర్‌ లోపాలు తలెత్తినప్పుడు బ్లాక్‌ బాక్సు పనిచేయదు. 
→ ప్రమాద తీవ్రత విపరీతంగా ఉండి భౌతికంగా ధ్వంసమైనప్పుడు కూడా దానిపై ఆశ వదిలేసుకోవాల్సిందే. 
→ విమాన సిబ్బంది ఉద్దేశపూర్వకంగా డీ యాక్టివేట్‌ చేసినా బ్లాక్‌బాక్స్‌ పనిచేయడం మానేస్తుంది. 
→ డేటా ఓవర్‌ లోడ్‌ అయినప్పుడు కూడా మొరాయిస్తుంది. 
→ కొన్ని పాత బ్లాక్‌ బాక్సుల్లో నిరీ్ణత కా లం తర్వాత డేటా ఓవర్‌ రైట్‌ అయిపోతుంది. దాంతో వాటినుంచి ఎ లాంటి సమాచారమూ లభించదు. నిరుడు జనవరిలో అలస్కా ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ విమానం ప్రయాణ సమయంలో తలుపు ఊడటంతో సీవీఆర్‌ పూర్తిగా ఓవర్‌ రైట్‌ అయింది. దాని నుంచి డేటా లభ్యం కాలేదు. 
→ అత్యుష్ణ, అత్యల్ప ఉష్ణోగ్రతలు, ఎక్కువ కాలం నీటిలో నానడం వల్ల కూడా ఫ్లైట్‌ రికార్డర్లు పాడవుతాయి. 
→ తేమ చేరి సున్నిత భాగాల్లో పరికరాలు దెబ్బతిని షార్ట్‌ సర్క్యూట్‌ కావడం, అత్యధిక ఎత్తుల్లో పీడనం, పక్షులు ఢీకొనడం, పిడుగుపాట్లు వంటి వాటి వల్ల కూడా బ్లాక్‌ బాక్సు పనిచేయకపోవచ్చు. 

పదేళ్లుగా జాడ లేని మలేసియా విమానం! 
నిజానికి ఫ్లైట్‌ రికార్డర్ల సామర్థ్యం పెంచాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఖర్చు, పరిమితుల దృష్ట్యా అది ఆలస్యమవుతోంది. అత్యవసర సందర్భాల్లో ఫ్లైట్‌ రికార్డర్లు పనిచేయాలంటే వాటికి విమానంలో ప్రత్యేక వ్యవస్థల నుంచి పవర్‌ సరఫరా తప్పనిసరి. రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు విమానమంతటా ఎలక్ట్రికల్‌ పవర్‌ నిలిచిపోతుంది. 1999లో న్యూయార్క్‌ నుంచి కైరో వెళుతున్న ‘ఈజిప్ట్‌ ఎయిర్‌’విమానం అట్లాంటిక్‌ మహాసముద్రంలో కూలి 217 మంది మరణించారు. 

ఎలక్ట్రికల్‌ పవర్‌ ఆగిపోగానే దాని ఫ్లైట్‌ రికార్డర్లు పని చేయడం మానివేశాయి. దాంతో, విమానం లోపల సాధారణ అవసరాల కరెంటుపై ఆధారపడకుండా ఫ్లైట్‌ రికార్డర్లు 10 నిమిషాలు అదనంగా రికార్డింగ్‌ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయ బ్యాకప్‌ పవర్‌ ఏర్పాట్లుండాలని అమెరికా జాతీయ రవాణా సేఫ్టీ బోర్డు సిఫార్సు చేసింది. బ్లాక్‌ బాక్సుల బ్యాకప్‌ బ్యాటరీల జీవితకాలం తక్కువ. కొన్ని సందర్భాల్లో పనే చేయవు.

 దక్షిణ కొరియా ‘జెజు ఎయిర్‌’విమానంలోనూ విద్యుత్‌ వ్యవస్థ విఫలమై ఫ్లైట్‌ రికార్డర్లకు పవర్‌ అందక మూగవోయాయని భావిస్తున్నారు. సీవీఆర్‌ ఒక విడతలో రెండు గంటలపాటు మాత్రమే రికార్డు చేయగలదు. ఆ డేటానే రిపీట్‌ చేస్తుంది. రికార్డింగ్‌ నిడివిని 25 గంటలకు పెంచాలన్న డిమాండ్‌ కార్యరూపం దాలుస్తోంది. 2009లో ఎయిర్‌ ఫ్రాన్స్‌ విమానం బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నుంచి పారిస్‌ వెళ్తూ అట్లాంటిక్‌ మహాసముద్రంలో కూలి 228 మంది చనిపోయారు. మలేసియా ఎయిర్‌లైన్స్‌ ఎంహెచ్‌ 370 విమానానిదైతే ఇప్పటికీ అంతు లేని వ్యథే! 2014లో కౌలాలంపూర్‌ నుంచి బీజింగ్‌ వెళ్తూ అకస్మాత్తుగా రాడార్‌ తెర నుంచి అదృశ్యమైంది. 

మొత్తం 239 మందీ మరణించారని భావిస్తున్నారు. విమానం ఎందుకు, ఎలా అదృశ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. వైమానిక చరిత్రలోనే ఇదో పెద్ద మిస్టరీ. విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిందని అనుమానిస్తున్నారు. దాని జాడ కోసం మళ్లీ అన్వేషణ చేపట్టాలని మలేసియా తాజాగా నిర్ణయించింది. ‘ఎయిర్‌ ఫ్రాన్స్‌’దుర్ఘటన దరిమిలా మహా సముద్రాలను దాటి ప్రయాణించే విమానాల కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లో 25 గంటల డేటా రికార్డింగ్‌ తప్పనిసరి చేయాలని ఫ్రాన్స్‌ సిఫార్సు చేసింది. అమెరికా కూడా దీన్ని చట్టంలో చేర్చింది. కానీ కొత్తగా తయారయ్యే విమానాల్లోనే ఈ మార్పులకు వీలుంది. పాతవాటిలో సాధ్యపడటం లేదు. ఇప్పుడు తిరిగే చాలా విమానాల జీవిత కాలం 40–50 ఏళ్లు! 

కొత్త టెక్నాలజీతో బ్లాక్‌ బాక్సులు! 
తాజా సవాళ్లు, మారిన సాంకేతికత నేపథ్యంలో అధునాతన రీతిలో సరికొత్త బ్లాక్‌ బాక్సుల కు పకల్పన జరుగుతోంది. ఎక్కువ గంటల రికార్డింగ్, అధిక డేటా స్టోరేజీ, బ్యాకప్‌ బ్యాటరీల జీవితకాలం పెంపు వంటివి వీటిలో ప్రధానాంశాలు. ప్రమా ద తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సమర్థంగా పనిచేసే బ్లాక్‌ బాక్సులూ రానున్నాయి. సముద్రాల్లో కూలినప్పుడు తక్కువ శ్రమతో సత్వరం గుర్తించే అండర్‌ వాటర్‌ లొకేటర్‌ బీకాన్స్‌ అభివృద్ధి దశలో ఉన్నాయి. ముఖ్యంగా, డేటాను రియల్‌ టైమ్‌లో పంపే బ్లాక్‌ బాక్సులు రానున్నాయి. తద్వారా కీలక సమాచారం వెంటనే గ్రౌండ్‌ స్టేషనుకు చేరుతుంది కనుక ప్రమాదంలో బ్లాక్‌ బాక్స్‌ నాశనమైనా ఇబ్బంది ఉండబోదు. 

– జమ్ముల శ్రీకాంత్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement