South Korea: బ్లాక్‌బాక్స్‌ సైలెన్స్‌!! | South Korea Plane Incident: Back Box stopped 4 minutes before Crash | Sakshi
Sakshi News home page

దక్షిణ కొరియా విమాన ప్రమాద ఘటనలో బ్లాక్‌బాక్స్‌ ట్విస్ట్‌!

Published Sat, Jan 11 2025 3:58 PM | Last Updated on Sat, Jan 11 2025 3:58 PM

South Korea Plane Incident: Back Box stopped 4 minutes before Crash

దక్షిణ కొరియా ఘోర విమాన ప్రమాదంపై ఆ దేశ రవాణా శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రమాదానికి సరిగ్గా  నాలుగు నిమిషాల ముందే విమానంలో బ్లాక్‌ బాక్సు పని చేయకుండా పోయిందని ప్రకటించింది. దీంతో కేసు దర్యాప్తు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

179 మంది ప్రాణాలను బలిగొన్న జెజు విమానం శకలాల నుంచి బాక్‌ బాక్స్‌ను సేకరించి అధికారులు విశ్లేషించారు. అయితే అందులో ఎలాంటి సమాచారం లేకపోయేసరికి అధికారులు ఆశ్చర్యపోయారు. దీంతో.. అమెరికాలోని ట్రాన్స్‌పోర్టేషన్‌‌ సేఫ్టీ బోర్డు ల్యాబోరేటరీకి పంపించారు. యూఎస్‌ సేఫ్టీ రెగ్యులేటరీ సహకారంతో డాటా రికార్డర్‌ను విశ్లేషిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది.

‘‘రక్షణగోడను ఢీకొట్టి ప్రమాదం జరగడానికి నాలుగు నిమిషాల ముందే విమానంలో ఉండే బ్లాక్‌ బాక్సుల్లో ఎలాంటి డేటా రికార్డు కాలేదని దర్యాప్తులో భాగంగా వెల్లడైంది. అసలు ఆ డేటా పోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం ’’ అని మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే దర్యాప్తులో కీలకమైన ఈ సమాచారం కోల్పోవడంతో ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలుసుకోవడం కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే ఇది అత్యంత అరుదైన ఘటన అని మాజీ అధికారి  సిమ్‌ జై డోంగ్‌ అంటున్నారు.  ఇలా బ్లాక్‌బాక్స్‌లు మూగబోయిన సందర్భాలు గతంలోనూ నమోదయ్యాయని చెబుతున్నారాయన.

ఇటీవల జెజు ఎయిర్‌ విమానం థాయ్‌లాండ్‌ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియా ముయాన్‌కు బయలుదేరింది. మరో అయిదు నిమిషాల్లో క్షేమంగా దిగుతామనుకుంటుండగా.. విమానం రన్‌వేపై జారుతూ.. నిప్పురవ్వలు రాజేస్తూ రక్షణగోడ వైపు దూసుకెళ్లి, గోడను ఢీకొట్టి, పేలిపోయింది. విమాన వెనుక భాగంలో కూర్చున్న ఇద్దరు మినహా మిగతా వాళ్లంతా ప్రాణాలు కోల్పోయారు.

అనుమానాలెన్నో..
విమానాన్ని పక్షి ఢీ కొట్టిందనే సమాచారాన్ని పైలట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించారు. అయితే అత్యవసర ల్యాండింగ్‌కు విమానం ఒకసారి ప్రయత్నించి విఫలమైంది. ఈ క్రమంలో రెండోసారి సింగిల్‌ రన్‌వేపై దిగగా ల్యాండింగ్‌ గేర్‌ సమస్యతో దూసుకెళ్లి అక్కడున్న గోడను ఢీ కొట్టింది. అయితే విమాన ప్రమాదం జరిగిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవై దర్యాప్తు జరుగుతున్న తీరుపైనా బాధిత కుటుంబాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే.. లోకలైజర్‌ను రన్‌వే చివర.. అదీ అంతటి గట్టి పదార్థంతో నిర్మించాల్సిన అవసరం ఏంటనే కోణంలో దర్యాప్తు జరగాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement