ఆదివారం దక్షిణకొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో వెనకవైపు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఇద్దరు ప్రాణాలతో బయటపడినట్లు వార్తలొచ్చాయి. దీంతో
విమానంలో ముందువైపు లేదంటే వెనుకవైపు అసలు ఏ నంబర్ సీటులో కూర్చుంటే ప్రమాదం జరిగినా బయటపడొచ్చనే అంశంపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. తరచూ విమానప్రయాణాలు చేసే అంతర్జాతీయ ప్రయాణికులు ఈ చర్చలను తీక్షణంగా గమనిస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిజంగానే వెనుకవైపు సీట్లు భద్రమా? అనే ప్రశ్న ఇప్పుడు ప్యాసింజర్లను తొలచేస్తోంది.
మిగతా ప్రయాణాలతో చూస్తే భద్రమే
ఎక్కడ కూర్చుంటే క్షేమంగా ఉంటామనే ప్రశ్న కంటే అసలు విమానంలో ప్రయాణమే అత్యంత భద్రమని మరో వాదన మొదలైంది. నిర్లక్ష్య డ్రైవింగ్, గతుకుల రోడ్డు, ఎత్తుఒంపులు ఉన్న చోట్ల సాంకేతిక ప్రమానాలు పాటించకుండా నిర్మించిన రోడ్లు, సరైన సూచికల వ్యవస్థ లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రయాణంతో పోలిస్తే విమాన ప్ర యాణం ఎంతో క్షేమదాయకమని వారు చెబుతున్నారు. విమానంలో ఎక్కడ కూర్చున్నా భద్ర మేనని, ఎప్పటికప్పుడు మొత్తం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీచేసి సుశిక్షుతులైన పైలట్ల పర్యవేక్షణలో విమానం ప్రయాణిస్తుందని, అ త్యంత అరుదుగా మాత్రమే, అసాధారణ వాతావరణ పరిస్థితుల్లోనే వి మా నం ప్రమాదంబారిన పడుతుంద ని విశ్లేషకులు చెబుతు న్నారు.
అమెరికాలో ఎలా?
ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం అమెరికా రోడ్లపై ప్రతి 10 కోట్ల వాహన ప్రయాణాల్లో కేవలం 1.18 మరణాలు సంభవిస్తున్నాయి. అదే 10 కోట్ల మైళ్ల రైలు ప్రయాణంలో 0.04 మరణాలు సంభవిస్తున్నాయి. ఇక 10 కోట్ల మైళ్ల విమాన ప్రయాణాల్లో అత్యంత స్వల్పంగా కేవలం 0.003 మరణాలు సంభవిస్తున్నాయి. అంతర్జాతీయ పౌర విమానయాన రంగ గణాంకాల ప్రకారం 2023లో ప్రతి వంద కోట్ల మంది ప్రయాణికులకు కేవలం 17 మంది మాత్రమే విమాన ప్రమాదాల్లో చనిపోయారు. 2022 ఏడాదిలో ఈ సంఖ్య 50గా ఉంది. అత్యాధునిక విమానాల్లో ఆధునిక భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నా అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగానే అత్యల్ప స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
తోక క్షేమమే
విమానం ద్రవరూప ఇంధనం(ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్)తో నడుస్తుంది. చిన్న జెట్ విమానాలను మినహాయిస్తే అంతర్జాతీయ సర్వీస్‌లకు వాడే భారీ పౌరవిమానాల్లో రెక్కల కింద ఈ ఇంధనాన్ని నిల్వచేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి నిప్పురవ్వులు రాజుకుంటే రెక్కల కింద ఇంధనం భగ్గున మండి రెక్కల సమీప సీట్లలోని ప్రయాణికులు బుగ్గిపాలుకావడం ఖాయం. ఈ కోణంలో చూస్తే రెక్కల సమీపంలోని సీట్లు ప్రమాదసందర్భాల్లో అంత క్షేమదాయకం కాదని గత ప్రమాదరికార్డులు తేటతెల్లంచేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాలో పాపులర్ మెకానిక్స్ అనే మేగజైన్ 1971 నుంచి 2005 వరకు జరిగిన విమాన ప్రమాదాలను విశ్లేíÙస్తూ ఒక నివేదిక సిద్ధంచేసింది. దీని ప్రకారం తోకభాగంలో కూర్చుంటే ప్రమాదాల్లో బతికే అవకాశాలు మిగతా సీట్లతో పోలిస్తే 40 శాతం అధికంగా ఉంటాయి.
ముందు సీట్లతో ముప్పే
ప్రమాదంలో ఇంధనం అంటుకుని మంటలు చుట్టుముట్టకపోయినా ముందు సీట్లు ఒకరకంగా ప్రమాదకరమని నివేదించారు. ఎదురుగా ఏదైనా కొండను ఢీకొట్టినా, నేలపై కుప్పకూలినా, వేరే విమానాన్ని ఢీకొట్టినా, రన్‌వే చివరన గోడలాంటి నిర్మాణాన్ని ఢీకొట్టినా, రన్‌వే దాటి లోయ లేదంటే సముద్రం, సరస్సు వంటి జలాశయంలోకి దూసుకెళ్లినా ప్రమాద ప్రభావం ముందు సీట్లపైనే అధికంగా ఉంటుంది.
మధ్య సీట్ల పరిస్థితి విచిత్రం
మధ్య సీట్లలో కూర్చుంటే రెక్కలకు సమీపంలో ఉండటం వల్ల ఇంధనంలో మంటలొస్తే ప్రమాదమే. కానీ మంటలు చెలరేగని పక్షంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గం వీళ్లకే దగ్గరగా ఉంటుంది. తప్పించుకునే అవకాశాలు వీళ్లకే ఎక్కువ. ఏదేమైనా విమానం ప్రమాదంలో పడిన తీరు, వేగం, దిశను బట్టి విమానంలోని ముందు, వెనుక, పక్క భాగాలు దెబ్బతింటాయి. భారత్‌లో గంటకొకటి చొప్పున జరిగే రోడ్డు ప్రమాదాలు, ఇటీవల సర్వసాధారణమైన పట్టాలు తప్పడం వంటి రైలు ప్రమాదాలతో పోలిస్తే అత్యంత అరుదుగా జరిగే విమాన ప్రమాదాలను భూతద్దంలో చూడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చే వాళ్లు ఈ ‘సీటు క్షేమం’చర్చలో పాల్గొన్నారు.
బతికే అవకాశాలు 60 శాతం
అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డ్ నివేదికను విశ్లేíÙస్తూ బ్రిటన్ పాత్రికేయుడు మ్యాక్స్ ఫాస్టర్ తాజాగా ఒక విషయాన్ని బయటపెట్టారు. ‘‘విమానం నేలపై కూలినా, నీటిలో పడినా, గాల్లోనే పేలిపోయినా ముందు సీట్లలో కూర్చునే ప్రయాణికులు 49 శాతం వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. రెండు రెక్కల మధ్యభాగంలోని సీట్లలో కూర్చుంటే 59 శాతం వరకు బతికే అవకాశాలు ఉన్నాయి. ఇక వెనుకవైపు అంటే తోక సమీప సీట్లలో కూర్చుంటే 69 శాతం బతికే అవకాశాలు ఉన్నాయి’’అని అన్నారు. అయితే ఇక్కడో ఘటనను తప్పక గుర్తుచేసుకోవాలని ఆయన చెబుతున్నారు. ‘1989లో అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురైనప్పుడు 269 మంది ప్రయాణికుల్లో 184 మంది బతికారు. వీరిలో చాలా మంది ముందు సీట్లలో కూర్చున్నారు’’అని ఆయన గుర్తుచేశారు. ప్రఖ్యాత ‘టైమ్’మేగజైన్ నివేదిక సైతం వెనుక సీట్లు క్షేమమని తెలిపింది. మిగతా సీట్లతో పోలిస్తే వెనుకవైపు సీట్లలో మధ్య వాటిల్లో కూర్చుంటే మరింత క్షేమమని పేర్కొంది. ఇక్కడ కూర్చుంటే మరణించే అవకాశం కేవలం 28 శాతమని, అదే విమానం మధ్యలో కూర్చుంటే ముప్పు శాతం 44 శాతంగా ఉంటుందని వెల్లడించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment