విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుండా అటు కేంద్రం నాన్చుతోంది. మరోవైపు ఇటు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగబోదంటూ తెర వెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ‘‘విశాఖ ఉక్కుకు ప్యాకేజీ’’ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.
ప్యాకేజీ అనేది కంటి తుడుపు చర్య. అది శాశ్వత పరిష్కారం ఎంత మాత్రం కాదు. ఇచ్చిన ప్యాకేజీ రెండు మూడు నెలలకు మించి సరిపోదు. ప్యాకేజీలతో ఒరిగేదేం లేదు. స్టీల్ ప్లాంట్(Steel Plant) బతకాలంటే సెయిల్ లో విలీనం ఒక్కటే మార్గమని సూచిస్తున్నాయి. అలాగే.. స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనుల కేటాయించాలన్న డిమాండ్‌ను మరోసారి ప్రస్తావించాయి.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(Steel Plant Privatization) జరగదని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగదని హామీ ఇస్తేనే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను నమ్ముతాం అని కార్మికులు చెబుతుండడం గమనార్హం.
సాక్షి టీవీతో ఉక్కు పోరాట కమిటీ నేతలు మాట్లాడుతూ.. ముడి సరుకు కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ప్యాకేజీతో కొత్తగా స్టీల్ ప్లాంట్ కు ఒరిగేది లేదు. కార్పొరేట్ల ఒత్తిడి మేరకే..ప్యాకేజి ప్రకటించారు. ప్యాకేజీ మొత్తం బకాయిలకే పోతుంది.
.. శాశ్వత పరిష్కారం చూపే వరకూ మా పోరాటం ఆగదు. ప్రజల్లో మమ్మల్ని చులకన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతీసారి డబ్బులు ఇవ్వలేమని చంద్రబాబు చెప్పారు. మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు విలీనం చెయ్యండి. మాకు అప్పు అవసరం లేదు. ఉన్న అప్పులను ఈక్విటీగా మార్చాలి. సెయిల్ లో విలీనం ఒక్కటే పరిష్కార మార్గం. అలాగే సొంత గనులు కేటాయించాలి అని ఉక్కు పోరాట కమిటీ నేతలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment