విశాఖ ఉక్కుకు.. కూటమి సర్కార్‌ తుప్పు! | KSR On Kutami Prabhutvam Silence Over Vizag Steel Plant Privatization | Sakshi
Sakshi News home page

విశాఖ ఉక్కుకు.. కూటమి సర్కార్‌ తుప్పు!

Published Tue, Dec 31 2024 11:12 AM | Last Updated on Tue, Dec 31 2024 12:48 PM

KSR On Kutami Prabhutvam Silence Over Vizag Steel Plant Privatization

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ కూడా అటకెక్కిందా? ఎన్నికల సమయంలో ఈ అంశం ఆధారంగా విశాఖ ప్రజలను అడ్డంగా రెచ్చగొట్టిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు.. అధికారం చేతికొచ్చాక నాలుక మడతేస్తున్నారా?. కేంద్రం తీసుకున్న నిర్ణయానికీ జగన్‌ బాధ్యుడిని చేస్తూ అభాండాలు మోపిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూండటం వెనుక కారణం ఏమి?. ఈ అనుమానాలకు, ప్రశ్నలకు కారణం ఒక్కటే.. 

ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ని కలిసి రాష్ట్ర సమస్యలంటూ వినతిపత్రాలు సమర్పించిన బాబుగారు.. వాటిల్లో మచ్చుకైనా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించకపోవడం. అదే సమయంలో వస్తుందో రాదో కూడా తెలియని ఆర్సెలార్‌ మిట్టల్‌ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని ప్రధానిని కోరడం విశేషం. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అక్కడ తాను కలిసే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర సమస్యలు, కీలకాంశాలను కచ్చితంగా వినతిపత్రం ద్వారా వారి దృష్టికి తీసుకొచ్చేవారు. కానీ తన కేసుల కోసమే ఢిల్లీ వెళతాడని బాబు అండ్‌ కో అబద్ధపు ప్రచారానికి దిగేది. మరి.. ప్రస్తుతం కేంద్రంలోనూ కీలకంగా ఉన్న టీడీపీ ప్రజా సమస్యల కోసం ప్రధానిని కలిసిందా? లేక ఇంకేదైనా లోగుట్టు ఉందా?. 

విశాఖ ప్లాంట్‌ మూతకు గనులు లేకపోవడమే కారణమంటున్నప్పుడు ఓ ప్రైవేట్‌ కంపెనీ ప్రయోజనాల కోసం గనులు కేటాయించమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని కోరడం ఏమిటి? ఈ నెపంతో ఆయన తనపై ఉన్న కేసులు ముందుకు రాకుండా మేనేజ్ చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా, ఏపీ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు మణిహారం వంటి విశాఖ స్టీల్ విషయంలో కూటమి డ్రామా ఆడుతున్న విషయం తేటతెల్లం అవుతోంది. 

ఎన్నికలకు ముందు ఏమన్నారంటే.. 

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)లు చేసిన గంభీర ప్రసంగాలు ఒకసారి చూడండి. ఆ తర్వాత వీరి వ్యవహారం ఏమిటో గమనించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని, ఆ సెంటిమెంట్‌ కాపాడతామని చంద్రబాబు అప్పట్లో పదే, పదే ప్రచారం చేశారు. పవన్ అయితే తనకు ఇద్దరు ఎంపీలను ఇచ్చినా ప్రైవేటీకరణపై పార్లమెంటులో బలంగా గొంతెత్తుతానని కూడా చెప్పుకున్నారు. శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను నివారించలేని జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన గగ్గోలు పెట్టారు. అయితే.. 

అధికారంలోకి వచ్చాక..  

స్టీల్ ప్లాంట్‌ ఒక్కో యూనిట్‌ను నిర్వీర్యం చేస్తున్నా వీరు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నందున తమకు సమస్యపై స్పష్టమైన అవగాహన లేకపోయిందని, అఖిలపక్షం వేసినా విమర్శలు తప్ప ప్రయోజం ఏమీ ఉండదని తేల్చేశారు. సెయిల్‌లో విలీనం చేయబోతున్నారంటూ ఎన్నికల సమయంలో వచ్చిన ఎల్లో కథనాలు కూడా వట్టివేనని స్పష్టమైపోయింది. టీడీపీ, జనసేనలకు ఉమ్మడిగా 18 మంది ఎంపీలతో కేంద్రంలో కీలకంగా ఉన్నా ప్రైవెటీకరణను నిలిపివేతకు మోడీ ఒప్పుకోరా అని కార్మిక సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కాని చంద్రబాబు అసలు ఆ ఊసే లేకుండా ఢిల్లీ టూర్ చేసి వస్తున్నారు. మరో వైపు కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్స్ పునరుద్ధరణకు కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy) ఏకంగా రూ.15 వేల కోట్లు మంజూరు చేసుకున్నారు. విశాఖకు కూడా అదేరీతిలో సాయం చేయవచ్చు కదా! అని అడిగే నాథుడు లేకుండా పోయారు. 

ఈ నేపథ్యంలో కొద్దికాలం క్రితం విశాఖ కూటమి నేతలను శిక్షించాలని జన జాగరణ సమితి పేరుతో ప్లెక్సీలు వెలిశాయి. చంద్రబాబు, పవన్‌, పురందేశ్వరిలు విశాఖ స్టీల్ కార్మికుల పొట్టగొట్టాలని చూస్తున్నారని, ఈ ముగ్గురు మోసగాళ్లను శిక్షించాలని సింహాచలం అప్పన్న స్వామిని వేడుకుంటున్నట్లు ప్లెక్సీలలో రాశారు. అయినా కూటమి నేతలలో ఉలుకు, పలుకు లేకుండా పోయింది. 

విశాఖ స్టీల్(Vizag Steel Plant) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పట్లో సీఎంగా ఉన్న టైంలో వైఎస్‌ జగన్ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న విశాఖ సభలో ప్లాంట్‌ను కాపాడాలని వేలాది మంది సమక్షంలో కోరారు. విశాఖ స్టీల్‌కు ఉన్న వేల ఎకరాల భూమిలో కొంత అమ్మి రక్షించాలని సూచించారు. దీనిపై కూడా టీడీపీతో పాటు ఎల్లో మీడియా నీచమైన కథనాలను ప్రచారం చేసింది. జగన్ విశాఖ స్టీల్ భూములను ఎవరికో కట్టబెడుతున్నారని వక్రీకరించింది. ఇప్పుడేమో భూములు అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని కూటమి మంత్రులు అంటుండడం విశేషం. 

ఎన్నికల సమయంలో జగన్ చాలా స్పష్టంగా.. కూటమికి ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుందని హెచ్చరించారు. అయినా కూటమి నేతల మాయ మాటలు నమ్మో, మరే  కారణమో తెలియదు కాని ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ది పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasa Rao) గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చాక వారి అసలు రంగు బయటపడింది. ప్లాంట్ ను అమ్మివేయడానికి కేంద్రం ఒక్కో అడుగు ముందుకు వస్తోంది. 

స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి ఒకసారి విశాఖ వచ్చి  ప్రైవేటైజ్ చేయబోమని చెప్పినా, అది మాటవరసకే అని అర్థమైపోయింది. శాసనమండలిలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. విశాఖ స్టీల్ లో రెండు యూనిట్లను నిలిపివేశారని, రెగ్యులర్ ఉద్యోగులకు 30 శాతం జీతాలే  ఇస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు సభ దృష్టికి తెచ్చారు. జగన్ వల్లే ఐదేళ్లపాటు ప్రైవేటీకరణ ఆగిందని వైఎస్సార్‌సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్నికలలో  ఇచ్చిన  హామీ ప్రకారం చంద్రబాబు, పవన్‌లు  విశాఖ స్టీల్ ను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 

కాగా విశాఖలో కూటమి తీరుపై నిరసనలు వస్తున్నా, ఇంకా అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాలేదు. ప్రధాని పర్యటన నేపథ్యంలో దాల్చే అవకాశం లేకపోలేదు. అయితే.. స్టీల్ ప్రైవేటైజైషన్ సమస్యను డైవర్ట్ చేయడానికి విశాఖకు టీసీఎస్‌ వస్తోందని, అనకాపల్లిలో మిట్టల్ ప్లాంట్ వస్తుందని, ఇలా రకరకాల ప్రచారాలు ఆరంభించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సెంటిమెంట్లు గుర్తుకు వస్తాయి. అధికారంలోకి రాగానే ఇంకేం సెంటిమెంట్ అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు పవన్ కూడా ఆయనకు తోడయ్యారు. అలా మాట మార్చడం వారికి మాత్రమే సాధ్యమైన కళ!



:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement