
న్యూఢిల్లీ: స్వీట్స్, స్నాక్స్ బ్రాండ్ బికనీర్‌వాలా చైర్మన్ కేదార్‌నాథ్ అగర్వాల్ (86) సోమవారం కన్నుమూశారు. ‘కాకాజీ’ అంటూ అంతా ఆప్యాయంగా పిల్చుకునే అగర్వాల్ మరణం తమకు తీరని లోటని సంస్థ డైరెక్టరు, ఆయన కుమారుడు రాధే మోహన్ అగర్వాల్ తెలిపారు.
ఢిల్లీ వీధుల్లో ఒకప్పుడు రసగుల్లాలు, భుజియా వంటి తినుబండారాలను విక్రయించిన అగర్వాల్.. అంచెలంచెలుగా బికనీర్‌వాలాతో దేశ, విదేశాల్లోనూ కార్యకలాపాలు విస్తరించే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం భారత్‌తో పాటు అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితర దేశాల్లో 60 పైచిలుకు అవుట్‌లెట్స్ ఉన్నాయి.