ఏడాదిగా కేంద్ర ప్రభుత్వోద్యోగులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎనిమిదో వేతన సంఘం సాకారం కాబోతోంది. ఆ సంఘం రూపురేఖలూ, దాని గడువు, మార్గదర్శకాలు వగైరా వివరాలు ఇంకా తెలియాల్సేవున్నా తమ జీతభత్యాలు పెరగబోతున్నాయన్న కబురు సహజంగానే ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కేంద్ర వేతన సంఘం సిఫార్సులకు కొంచెం అటూ ఇటూగా రాష్ట్రాల్లో వేతన సవరణ సంఘాలు కూడా సిఫార్సులు చేస్తాయి గనుక రాష్ట్రప్రభుత్వాల సిబ్బందికి సైతం ఇది సంతోషించే సందర్భమే.
పదేళ్లకోసారి నియమించే వేతన సంఘాల గురించిన ప్రకటన లెప్పుడూ లోక్‌సభ ఎన్నికల ముందు వెలువడటం రివాజు. అందుకే నిరుడంతా ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ప్రకటన వెలువడింది. మరో మూడు వారాల్లోఅసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న ఢిల్లీలో గణనీయంగావున్న కేంద్ర సిబ్బంది ఓటుబ్యాంకునుదృష్టిలో ఉంచుకునే తాజా ప్రకటన వెలువడిందన్న విమర్శలు లేకపోలేదు. మన దేశంలో ప్రభుత్వో ద్యోగులు సంఘటిత శక్తి, పటిష్ఠమైన ఓటుబ్యాంకు కూడా! కనుక వారిని నిరాశపరచాలని ఏ ప్రభు త్వమూ చూడదు.
ఇందుకు ఒకే మినహాయింపు వుంది. 2003లో కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని అప్పటి ఎన్డీయే సర్కారు వేతన సంఘం డిమాండ్‌ను తిరస్కరించింది. అటు తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం 2005లో వేతన సంఘం ఏర్పాటు చేసి, ఆ మరుసటి ఏడాది జనవరి 1 నుంచి దాని సిఫార్సులు అమలుచేయటం మొదలుపెట్టింది. అంతేకాదు... 2013లో ఏడో వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. దేశంలో రక్షణ, రైల్వే విభాగాల సిబ్బందిని కూడా కలుపుకొంటే 49 లక్షల మందికి పైగా కేంద్రప్రభుత్వోద్యోగులున్నారు.
వీరుగాక పింఛన్ అందుకునే 65 లక్షల మంది రిటైర్డ్ సిబ్బంది ఉన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలనూ, ప్రభుత్వరంగ సిబ్బందికి ఇచ్చే బోనస్‌నూ వేతన సంఘం సిఫార్సు చేస్తుంది. అలాగే పింఛన్‌దార్లకు నెలనెలా చెల్లించాల్సిన మొత్తం, కరువుభత్యం కూడా నిర్ణయిస్తుంది. అది చేసే సిఫార్సులను యథాతథంగా ఆమోదించటం లేదా ఉద్యోగుల కోర్కె మేరకు దాన్ని మరింత పెంచటం, తనకున్న వనరులను దృష్టిలో ఉంచుకుని ఆ సిఫార్సులకు కోతపెట్టడం కేంద్రం చేసే పని.
కేంద్రంలోనైనా, రాష్ట్రాల్లోనైనా రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య రానురాను తగ్గిపోతోంది.కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవటం, తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకోవటంగతంతో పోలిస్తే పెరిగింది. ఏతావాతా, రిటైరవుతున్న సిబ్బంది స్థానంలో కొత్త రిక్రూట్‌మెంట్లు బాగా తగ్గాయి. ఆరో వేతన సంఘం ఏర్పాటు సమయానికి దేశంలో 55 లక్షలమంది కేంద్రసిబ్బంది ఉన్నారని అంచనా వేశారు. ఇప్పుడు నిండా 50 లక్షల మంది కూడా లేరు. మరో మాటలో – సర్వీసులో ఉన్న సిబ్బంది కన్నా పింఛన్‌దార్లే ఎక్కువున్నారు.
దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాల్లో సంపూర్ణంగా కంప్యూటరీకరణ జరగటంతోపాటు ఇంటర్నెట్ అందుబాటులోకొచ్చింది కనుక మును పటితో పోలిస్తే ఎక్కువమంది సిబ్బంది అవసరం ఉండకపోవచ్చన్న వాదనలో నిజముంది. కానీ మనతో పోలిస్తే అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో ప్రతి లక్షమంది పౌరులకూ దాదాపు ఏడువేల మంది ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు. మన దేశంలో అది 1,500 మించదు. అమెరికాలో తమ ఏలుబడి మొదలయ్యాక ప్రభుత్వ సిబ్బంది సంఖ్యలో భారీగా కోత పెడతామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ బాహాటంగానే చెప్పారు.
ఫలితాలొచ్చిన వారం రోజు ల్లోపునే ప్రభుత్వ సామర్థ్య విభాగం పేరిట వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్‌లతో ఆయన ఒక కమిటీని కూడా నియమించారు. తాము విడివిడిగా ఉరిశిక్షలు వేయబోమని, ఒకేసారి ఊచకోతఉంటుందని వివేక్ రామస్వామి చమత్కరించారు కూడా! కనుక అక్కడ కూడా ప్రభుత్వ సిబ్బంది తగ్గుతారు. చాలా యూరప్ దేశాల్లో రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోతపెట్టే ప్రయత్నాలు చేయటం, దాన్ని ఉద్యోగులు ప్రతిఘటించటం కనబడుతూనే ఉంది.
ప్రభుత్వ పథకాలను ప్రజానీకానికి చేర్చటంలో ప్రభుత్వ సిబ్బంది పాత్ర కీలకమైనది. గతంతో పోలిస్తే కొత్త సాంకేతికతలు అందుబాటులోకొచ్చి ఉండొచ్చుగానీ అందుకు తగ్గట్టే సూక్ష్మస్థాయివివరాల సేకరణ పెరిగింది గనుకా, రిటైరవుతున్నవారి స్థానంలో కొత్త నియామకాలు లేవు గనుకా వారి పని భారం పెరిగింది. పని మీద శ్రద్ధలేనివారూ, అవినీతికి పాల్పడేవారూ అన్నిచోట్లాఉంటారు. వారి వల్ల సహజంగానే అందరికీ చెడ్డపేరు వస్తుంది. ప్రభుత్వోద్యోగులపైనా అలాంటి నింద ఉంది.
ఉద్యోగ భద్రత వరకూ చూస్తే ప్రైవేటు రంగంలో కన్నా ప్రభుత్వరంగంలో అది ఎక్కువ. ఒకసారంటూ ప్రభుత్వ ఉద్యోగం వస్తే చీకూచింతా ఉండబోదని అనుకుంటారు గనుకేఅందుకోసం చాలామంది అర్రులు చాస్తారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో విఫలమవుతున్నందున వేతనాలు పెంచాలన్న ప్రభుత్వ సిబ్బంది డిమాండ్‌కు ప్రభుత్వాలు తలొగ్గక తప్పడం లేదు. కొన్ని లోటుపాట్లున్నా ప్రభుత్వోద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వాలు శ్రద్ధ పెడుతున్నాయి. నిర్ణీత కాలంలో జీతభత్యాలు పెంచుతున్నాయి.
కానీ వారితో పోలిస్తే ఎంతో ఎక్కువున్న ప్రైవేటురంగ సిబ్బందినీ, రెక్కాడితే గానీ డొక్కాడని అసంఘటిత రంగ కార్మికులనూ, వారి సంక్షేమాన్నీ విస్మరిస్తున్నాయి. పాశ్చాత్యదేశాల్లో ఇంత చేటు అసమానతలుండవు. ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనాన్నిఆశించే పాలకులు ఈ రంగాల పట్ల తాము ఎలా వ్యవహరిస్తున్నామో ఆలోచించుకోవాలి. ఈ అసమానతల్ని తగ్గించే ప్రయత్నం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment