హైదరాబాద్: విద్యుత్ జేఏసీతో సీఎండీ చర్చలు సఫలం అయ్యాయి. తాత్కాలిక విద్యుత్ ను పునరుద్దరించేందుకు జేఏసీ అంగీకరించింది. విద్యుత్ ఉద్యోగుల ఆకస్మిక సమ్మెతో రాష్ట్రంలో అంధకారం అలుముకుంది. అత్యవసర సేవల్లో ఒకటైన విద్యుత్ స్తంభించిపోవడంతో ఆదివారం సాయంత్రం సీఎండీ జేఏసీ సభ్యులతో చర్చలు జరిపారు. కాగా, జేఏసీ మాత్రం రేపు ఉదయం వరకూ మాత్రమే విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపింది. దీంతో ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల ప్రజలకు ఊరట లభించనుంది. విజయవాడ ట్రాన్స్ కోలో విద్యుత్ ఉత్పత్తి జీరో స్థాయికి పడిపోయింది.
సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విద్యుత్ సంక్షోభం కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం 28 రైళ్లను రద్దు చేశారు. వీటిలో 24 ప్యాసింజర్, 4 ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పలు రైళ్లు మార్గమధ్యంలో ఆగిపోగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపుతున్నారు. విద్యుత్ స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.