
భారత్ తన ప్రతిష్టాత్మకమైన సున్నా కర్బన ఉద్గారాల స్థితి (తటస్థం)ని 2070 నాటికి చేరుకోవాలంటే.. వచ్చే పదేళ్లలో 700 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (రూ.60 లక్షల కోట్లు) విద్యుత్ రంగం(Power Sector)లో చేయాల్సి వస్తుందని మూడిస్ రేటింగ్స్ తెలిపింది. పునరుత్పాదక ఇంధనాలు, అణు ఇంధనం, విద్యుత్ ప్రసారం, పంపిణీ, ఇంధన స్టోరేజీ వసతుల కోసం ఈ మొత్తం వెచ్చించాల్సి వస్తుందని వివరించింది.
దేశంలో కర్బన ఉద్గారాల విడుదలలో 37 శాతం విద్యుత్ రంగం నుంచే ఉంటోందని మూడిస్ పేర్కొంది. 2026 నుంచి 2051 ఆర్థిక సంవత్సరాల మధ్య ఏటా జీడీపీలో 1.5–2 శాతం మేర పెట్టుబడులను (వచ్చే పదేళ్లు ఏటా 2 శాతం) ఈ రంగంలో చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. 2034–35 వరకు ఏటా రూ.4.5–6.4 లక్షల కోట్ల చొప్పున, ఆ తర్వాత 2026–51 మధ్యకాలంలో ఏటా రూ.6–9 లక్షల కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని వెల్లడించింది. ఈ స్థాయిలో పెట్టుబడులను ప్రభుత్వం, ప్రైవేటు రంగం, దేశ, విదేశీ మూలధనం రూపంలో సమకూర్చుకోవచ్చని సూచించింది. దేశంలో ఇప్పటికీ అధిక శాతం విద్యుత్ బొగ్గు ఆధారితమే ఉన్నందున, ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయని అభిప్రాయపడింది. వచ్చే పదేళ్ల పాటు బలమైన ఆర్థిక వృద్ధి అన్నది బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి విస్తరణను సూచిస్తోందని, ఇది కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యానికి ప్రతికూలంగా మారొచ్చని పేర్కొంది.
ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌లో 20,000 నియామకాలు!
తలసరి వినియోగం మూడో వంతే
భారత ఆర్థిక వ్యవస్థ ఏటా 6.5 శాతం చొప్పున వచ్చే పదేళ్ల పాటు వృద్ధిని నమోదు చేస్తుందని, దీంతో ఏటా విద్యుత్ డిమండ్ 6 శాతం చొప్పున కాంపౌండెడ్ వార్షిక పెరుగుదలను చూస్తుందని మూడిస్ రేటింగ్స్ అంచనా వేసింది. ‘భారత్‌లో తలసరి విద్యుత్ వినియోగం (2021–22లో 1,255 కిలోవాట్ హవర్) ప్రపంచ వినియోగంలో మూడింత ఒక వంతుగానే ఉంది. ఆర్థిక వృద్ధితోపాటు, జీవన ప్రమాణాల మెరుగుదల నేపథ్యంలో రానున్న కాలంలో వినియోగం మరింత పెరగనుంది. వచ్చే పదేళ్లలో 450 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం డిమాండ్‌ను తీర్చలేదు. ఈ కాలంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని మరో 35 శాతం పెంచుకోవాల్సి రావచ్చు. 1.7–1.8 రెట్లు పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 2034–35 నాటికి 2–2.2 రెట్లు పెరగాలి. 2023–24 నాటికి శిలాజేతర ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ తయారీ 23.5 శాతంగా ఉంటే, 2034–35 నాటికి 45–50 శాతానికి చేర్చాలి’అని మూడిస్ వివరించింది. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లే విషయంలో ప్రైవేటు రంగం ఎంతో కీలకమంటూ, విదేశీ నిధులు అంతరాన్ని భర్తీ చేయగలవని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment