
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తొలగింపు త్వరగా జరగకూడదని భావిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. పావెల్ పనితీరుపట్ల ట్రంప్ మండిపడ్డారు. ఇతర సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నా తాను అనుకున్న విధంగా అమెరికా వేగంగా వాటిని తగ్గించడంలేదని అభిప్రాయపడ్డారు.
తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. వినియోగదారుల వ్యయంలో మందగమనం సంభవించే అవకాశముందని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి కొనసాగుతోందని వ్యాపార వర్గాల్లో అంచనాలు నెలకొన్న సమయంలో ఫెడ్ ఛైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో ఏ మాత్రం తొందరపడబోమని పావెల్ స్పష్టం చేశారు. కానీ ట్రంప్ త్వరగా వడ్డీరేట్ల కోతను కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి: గ్రిడ్ స్థిరీకరణకు స్టోరేజ్ సిస్టమ్
ఇమిగ్రేషన్, టాక్సేషన్, నియంత్రణలు, టారిఫ్ వంటి విధానపరమైన మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థపై కలిగే ప్రభావంపట్ల ఫెడరల్ రిజర్వ్ స్పష్టత కోరుతోందని పావెల్ పేర్కొన్న మరుసటి రోజే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ఎప్పుడో రేట్లు తగ్గించిందని ట్రంప్ అన్నారు. ఇకనైనా పావెల్ రేట్ల కోతకు పూనుకోవాలని సూచించారు. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్‌గా జెరోమ్ పావెల్ తొలగింపు త్వరగా జరగకూడదని భావిస్తున్నట్లు ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. పావెల్ పదవీ కాలం 2026 చివరి వరకు ఉంది. ఆయనను 2017లో ట్రంప్ ప్రతిపాదించారు. తర్వాత 2022లో బైడెన్ మరో నాలుగేళ్ల పాటు ఫెడ్ ఛైర్మన్‌గా కొనసాగించారు.