సెన్సెక్స్ లాభం 1,360 పాయింట్లు
తొలిసారి 84,500పైన ముగింపు
375 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
కలిసొచి్చన ఫెడ్ రేట్ల కోత ఉత్సాహం
ముంబై: ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గింపు, అమెరికా, ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు కలిసిరావడంతో దేశీయ స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. సెన్సెక్స్ 1,360 పాయింట్లు ఎగసి తొలిసారి 84 వేల స్థాయిపైన 84,544 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 375 పాయింట్లు పెరిగి 25,750 ఎగువున 25,791 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది ఇది సరికొత్త రికార్డు ముగింపు.
ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,510 పాయింట్లు బలపడి 84,694 వద్ద, నిఫ్టీ 433 పాయింట్లు ఎగసి 25,849 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు, మెటల్, ఆటో, రియల్టీ రంగాలకు చిన్న, మధ్య తరహా షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది.
దీంతో బీఎస్‌ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.37%, 1.16 శాతం చొప్పున పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ పది పైసలు పెరిగి 83.55 స్థాయి వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి. యూరప్ మార్కెట్ల ఒకటిన్నర శాతం నష్టపోయాయి. రంగాల వారీగా రియల్టీ ఇండెక్స్ 3.21%, ప్రైవేటు రంగ బ్యాంక్ సూచీ 3%, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్సు 2.32% లాభపడ్డాయి. ఆటో, ఇండ్రస్టియల్, మెటల్, కన్జూమర్ సూచీలు 2% పెరిగాయి.
→ పసిడి రుణాల వ్యాపారంపై గతంలో విధించిన ఆంక్షలను ఆర్‌బీఐ ఎత్తివేయడంతో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ షేరు భారీగా లాభపడింది. బీఎస్‌ఈలో 7% పెరిగి రూ.531 వద్ద స్థిరపడింది.
→ ఐటీడీ సిమెంటేషన్ ఇండియా షేరు 20% లాభపడి రూ.566 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. ఈ కంపెనీలో అదానీ ఈ కంపెనీలో 46.64% వాటా కొనుగోలు చేయ నుందన్న వార్తలతో ఈ షేరుకుడిమాండ్ నెలకొంది.
→ సెన్సెక్స్ 1,330 పాయింట్లు ర్యాలీ చేయడంతో ఒక్కరోజులో రూ.6.24 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.472 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌లో 30కి గానూ 26 షేర్లు లాభపడ్డాయి. నాలుగు షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఈ ఏడాదిలో ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే 1000కి పైగా పాయింట్లు లాభపడటం ఇది పదోసారి కావడం విశేషం.
→ ఐసీఐసీఐ(4%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(2%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం 1,360 పాయింట్లలో సగ భాగం ఈ షేర్ల నుంచి వచ్చాయి. ఇంట్రాడేలో ఐసీఐసీఐ బ్యాంకు అయిదున్నర శాతం ర్యాలీ చేసి రూ.1361 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment