సెన్సెక్స్ 106 పాయింట్లు డౌన్; 24,200 దిగువకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, వాణిజ్యపరమైన ఉద్రిక్తతల ప్రభావంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 80,004 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 24,194 వద్ద నిలిచింది. యుటిలిటీస్, పవర్, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్, సర్వీసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ఐటీ, టెక్, టెలికమ్యూనికేషన్, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రంప్ తన ప్రమాణ స్వీకారం రోజు జనవరి 20న మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25%, చైనాల నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై పది శాతం పన్ను విధింపునకు అవసరమైన పత్రాలపై సంతకం చేస్తానంటూ తెలపడంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి.
సీవేజ్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ ఐపీఓ చివరి రోజు నాటికి 89.90 రెట్ల స్పందన వచ్చింది ఇష్యూలో భాగంగా కంపెనీ 3.07 కోట్ల షేర్లు జారీ చేయగా, 277 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యూఐబీ విభాగం 157 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 24 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment