న్యూఢిల్లీ: వారాంతాన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 8వసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖకు పలు రంగాలు వినతులను అందించగా.. ఆదాయపన్ను సవరణలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి కొత్త ఏడాదిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల నడకను పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
శనివారం ట్రేడింగ్
కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో శనివారం(ఫిబ్రవరి 1) స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. పూర్తిస్థాయిలో ట్రేడింగ్‌ను నిర్వహించనుండటంతో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆరు రోజులపాటు లావాదేవీలకు వేదిక కానున్నాయి. అయితే బడ్జెట్ సెంటిమెంటుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి మార్కెట్ల ట్రెండ్‌కు దిక్సూచిగా నిలవనున్నట్లు పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్ల చూపు బడ్జెట్ ప్రతిపాదనలపై నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. ప్రధానంగా నిరుత్సాహకర క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాల నేపథ్యంలో బడ్జెట్‌కు ప్రాధాన్యత ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. వినియోగం, ఫైనాన్షియల్ రంగాలు పేలవ పనితీరు చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక విధానాలు, వివిధ రంగాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. మౌలికం, తయారీ, టెక్నాలజీలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
యూఎస్ జీడీపీ
యూఎస్ ఫెడ్ గురువారం(30న) పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే ద్రవ్యోల్బణ పరిస్థితులు బలపడుతుండటంతో వడ్డీ రేట్ల తగ్గింపు బాటను వీడి కఠిన విధానాలవైపు దృష్టిపెట్టవలసి రావచ్చునని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ట్రంప్ విధానాలు సైతం ఫెడ్ నిర్ణయాలను ప్రభావితం చేసే వీలున్నట్లు విశ్లేషకుల అంచనా. ఇక 2024 చివరి క్వార్టర్(అక్టోబర్–డిసెంబర్)కు జీడీపీ గణాంకాలు సైతం ఇదే రోజు వెలువడనున్నాయి. క్యూ3(జులై–సెప్టెంబర్)లో యూఎస్ జీడీపీ 3.1 శాతం ఎగసింది.
క్యూ3 జాబితాలో..
దేశీయంగా ఈ వారం మరికొన్ని కంపెనీల అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు వెల్లడికానున్నాయి. జాబితాలో దిగ్గజాలు ఎన్‌టీపీసీ, ఐవోసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, మారుతీ, బజాజ్ ఆటో, సిప్లా, ఓఎన్‌జీసీ, అంబుజా సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మాస్యూటికల్, బయోకాన్, మారికో, గెయిల్ ఇండియా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, అదానీ పవర్ చేరాయి.
ఇదీ చదవండి: స్వల్పకాల పెట్టుబడికి దారేదీ?
ఇతర కీలక అంశాలు
ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేయగల ఇతర అంశాలలో డాలరు మారకం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్, ముడిచమురు ధరలు సైతం ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ప్రపంచ మార్కెట్ల పరిస్థితులకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు వెల్లడించారు. దీంతో మార్కెట్లు మరోసారి ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. బడ్జెట్‌లో పెట్టుబడుల కేటాయింపులకు వీలున్న రైల్వే, డిఫెన్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాలతోపాటు పీఎస్‌యూ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment