
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అత్యధిక వృద్ధిరేటును నమోదు చేస్తుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. బడ్జెట్‌లో ఆదాయపన్ను పరంగా భారీగా కల్పించిన పన్ను మినహాయింపు ప్రయోజనాలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రస్తావించింది. ఈ చర్యలతో భారత్ మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5% వృద్ది రేటును సాధించొచ్చన్న అంచనాలను ప్రకటించింది. 2024–25 సంవత్సరానికి మూడీస్ వృద్ధి అంచనాలు 6.7%తో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. ద్రవ్యోల్బ ణం గత ఆర్థిక సంవత్సరంలో సగటున 4.9 శాతంగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో (2025–26) 4.5 శాతానికి దిగొస్తుందని తెలిపింది.
భారత్ నిలబడుతుంది..
వర్ధమాన దేశాల్లోకి పెట్టుబడుల ప్రవాహం, సరఫరా వ్యవస్థలు, భౌగోళిక రాజకీయాలను యూఎస్ వాణిజ్య విధానాలు మార్చివేయనున్నట్టు మూడీస్ పేర్కొంది. అయితే, భారత్ మాదిరి పెద్ద స్థాయి వర్ధమాన దేశాలు ఈ అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన వనరులు కలిగి ఉన్నట్టు మూడీస్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా అమెరికా విధానాలతో వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులు బయటకు తరలిపోయే రిస్క్‌ను ప్రస్తావించింది.
ఇదీ చదవండి: టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..
భారత్, బ్రెజిల్ మాత్రం పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, వాటిని కాపాడుకునేందుకు మెరుగైన స్థితిలో ఉన్నట్టు తెలిపింది. ఈ రెండూ దేశీ వినియోగంపై ఆధారపడిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడం, బలమైన దేశీ క్యాపిటల్ మార్కెట్లకు తోడు స్థిరమైన విదేశీ మారకం నిల్వలు కలిగి ఉన్నాయని గుర్తు చేసింది. దేశీ కరెన్సీ ఆధారిత విదేశీ రుణ భారం ఎక్కువగా కలిగి ఉన్నందున.. విదేశీ మారకం రిస్క్‌లను భారత్ బలంగా ఎదుర్కోగలదని అంచనా వేసింది. ఈ సానుకూలతలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని కలిగించగలవని పేర్కొంది. భారత్ వృద్ధి రేటు 2025–26లో నిదానించినప్పటికీ బలంగానే కొనసాగుతుందని, ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అధిక వృద్ధి రేటును నమోదు చేస్తుందని వివరించింది.