![Donald Trump metal tariffs put India exports at risk](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/BUSINESS-TRUMP.jpg.webp?itok=GjFV0jje)
స్టీల్, అల్యుమినియంపై 25% టారిఫ్‌లు వడ్డించే యోచ
బిలియన్ డాలర్ల భారత్ ఎగుమతులపై ప్రభావం
ఆందోళనలో దేశీ పరిశ్రమలు
న్యూఢిల్లీ: అన్ని రకాల ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై పాతిక శాతం టారిఫ్‌లు వడ్డించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచన భారత పరిశ్రమలను కలవరపరుస్తోంది. దీనితో బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం భారత్ ఉక్కు ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు అయిదు శాతం లోపు ఉంటోంది.
అయినప్పటికీ భారతీయ ఉక్కు ఎగుమతిదార్లు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో కొంత సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హుయ్ తింగ్ సిమ్ తెలిపారు. అమెరికా టారిఫ్‌ల దెబ్బతో మిగతా దేశాల్లో సరఫరా పెరిగిపోయి, భారత్ ఎగుమతులకు ప్రతికూలం కావచ్చని పేర్కొన్నారు. గత పన్నెండు నెలలుగా భారీ స్థాయిలో ఉక్కు దిగుమతులతో ధరలు, ఆదాయాలు పడిపోయి దేశీ ఉత్పత్తి సంస్థలు ఇప్పటికే సతమతమవుతున్నట్లు వివరించారు.
ఇదే సమయంలో టారిఫ్‌ల వల్ల అమెరికాలోని ఉక్కు ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని సిమ్ చెప్పారు. అక్కడ దేశీయంగా ఉక్కుకు డిమాండ్ పెరిగి, ధరలూ పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. సుంకాల విధింపుతో అమెరికాకు ఉక్కు ఎగుమతులు 85 శాతం మేర తగ్గిపోవచ్చని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ఐఎస్‌ఏ) ప్రెసిడెంట్ నవీన్ జిందాల్ తెలిపారు. ఇలా మిగిలిపోయేదంతా, ప్రస్తుతం వాణిజ్యపరమైన ఆంక్షలు లేని అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన భారత మార్కెట్లోకి వెల్లువెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు, అల్యూమినియం పరిశ్రమపై ప్రభావం గట్టిగా పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే భారత అల్యుమినియం ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 12 శాతం ఉంటుంది. గతేడాది నవంబర్ నాటికి 777 మిలియన్ డాలర్ల అల్యూమినియం ఎగుమతులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉక్కు పరిశ్రమతో పోలిస్తే అల్యుమినియం రంగంపై టారిఫ్‌ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్‌తో నిర్వహించబోయే సమావేశంలో టారిఫ్‌ల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2018 వ్యూహం..
ట్రంప్ 2018 వ్యూహాన్నే మళ్లీ అమలు చేస్తే వాణిజ్యానికి సంబంధించి బేరసారాలు ఆడేందుకు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. 2018లోనూ ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నా, అప్పట్లో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌పై పెద్దగా ప్రభావం పడలేదు. ప్రతిగా 2019లో 28 అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై భారత్ కూడా అదనపు సుంకాలు విధించింది. 2023లో భారత్ నుంచి ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు తొలగించింది. తాజాగా టారిఫ్‌ల పెంపు అనేది అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేసే జపాన్, యూరప్ దేశాలు, కెనడా, మెక్సికోపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ సరఫరా పెరిగిపోయి, ధరలు పడిపోవడం వల్ల భారత్‌కి కూడా కాస్త ప్రతికూలంగానే ఉండొచ్చని విశ్లేషకులు తెలిపారు.
ఆందోళన చెందనక్కర్లేదు: ఉక్కు శాఖ
అమెరికాకు భారత్ ఉక్కు ఎగుమతులు అంతగా లేవు కాబట్టి టారిఫ్‌ల గురించి దేశీ పరిశ్రమ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ తెలిపారు. ‘గతేడాది మనం 14.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తే అందులో అమెరికాకు ఎగుమతి చేసింది చాలా తక్కువే. కాబట్టి, టారిఫ్‌ల పెంపు పెద్ద సమస్య కాబోదు‘ అని ఆయన చెప్పారు. దేశీయంగా ఉక్కు వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో డిమాండ్‌కి తగ్గట్లుగా పరిశ్రమ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment