Moodys indian economy
-
ట్రంప్ ‘ఉక్కు’ పాదం..!
న్యూఢిల్లీ: అన్ని రకాల ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై పాతిక శాతం టారిఫ్‌లు వడ్డించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచన భారత పరిశ్రమలను కలవరపరుస్తోంది. దీనితో బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం భారత్ ఉక్కు ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు అయిదు శాతం లోపు ఉంటోంది. అయినప్పటికీ భారతీయ ఉక్కు ఎగుమతిదార్లు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో కొంత సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హుయ్ తింగ్ సిమ్ తెలిపారు. అమెరికా టారిఫ్‌ల దెబ్బతో మిగతా దేశాల్లో సరఫరా పెరిగిపోయి, భారత్ ఎగుమతులకు ప్రతికూలం కావచ్చని పేర్కొన్నారు. గత పన్నెండు నెలలుగా భారీ స్థాయిలో ఉక్కు దిగుమతులతో ధరలు, ఆదాయాలు పడిపోయి దేశీ ఉత్పత్తి సంస్థలు ఇప్పటికే సతమతమవుతున్నట్లు వివరించారు. ఇదే సమయంలో టారిఫ్‌ల వల్ల అమెరికాలోని ఉక్కు ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని సిమ్ చెప్పారు. అక్కడ దేశీయంగా ఉక్కుకు డిమాండ్ పెరిగి, ధరలూ పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. సుంకాల విధింపుతో అమెరికాకు ఉక్కు ఎగుమతులు 85 శాతం మేర తగ్గిపోవచ్చని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ఐఎస్ఏ) ప్రెసిడెంట్ నవీన్ జిందాల్ తెలిపారు. ఇలా మిగిలిపోయేదంతా, ప్రస్తుతం వాణిజ్యపరమైన ఆంక్షలు లేని అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన భారత మార్కెట్లోకి వెల్లువెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అల్యూమినియం పరిశ్రమపై ప్రభావం గట్టిగా పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే భారత అల్యుమినియం ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 12 శాతం ఉంటుంది. గతేడాది నవంబర్ నాటికి 777 మిలియన్ డాలర్ల అల్యూమినియం ఎగుమతులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉక్కు పరిశ్రమతో పోలిస్తే అల్యుమినియం రంగంపై టారిఫ్‌ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్‌తో నిర్వహించబోయే సమావేశంలో టారిఫ్‌ల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2018 వ్యూహం.. ట్రంప్ 2018 వ్యూహాన్నే మళ్లీ అమలు చేస్తే వాణిజ్యానికి సంబంధించి బేరసారాలు ఆడేందుకు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. 2018లోనూ ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నా, అప్పట్లో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌పై పెద్దగా ప్రభావం పడలేదు. ప్రతిగా 2019లో 28 అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై భారత్ కూడా అదనపు సుంకాలు విధించింది. 2023లో భారత్ నుంచి ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు తొలగించింది. తాజాగా టారిఫ్‌ల పెంపు అనేది అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేసే జపాన్, యూరప్ దేశాలు, కెనడా, మెక్సికోపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ సరఫరా పెరిగిపోయి, ధరలు పడిపోవడం వల్ల భారత్‌కి కూడా కాస్త ప్రతికూలంగానే ఉండొచ్చని విశ్లేషకులు తెలిపారు. ఆందోళన చెందనక్కర్లేదు: ఉక్కు శాఖఅమెరికాకు భారత్ ఉక్కు ఎగుమతులు అంతగా లేవు కాబట్టి టారిఫ్‌ల గురించి దేశీ పరిశ్రమ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ తెలిపారు. ‘గతేడాది మనం 14.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తే అందులో అమెరికాకు ఎగుమతి చేసింది చాలా తక్కువే. కాబట్టి, టారిఫ్‌ల పెంపు పెద్ద సమస్య కాబోదు‘ అని ఆయన చెప్పారు. దేశీయంగా ఉక్కు వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో డిమాండ్‌కి తగ్గట్లుగా పరిశ్రమ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చని వివరించారు. -
మారిన మూడీస్ ‘అవుట్‌లుక్’,భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే?
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ పేర్కొంది. ఆర్థిక, ఫైనాన్షియల్ వ్యవస్థలకు సవాళ్లు తగ్గడం దీనికి కారణంగా పేర్కొంది. అయితే సావరిన్ రేటింగ్‌ను మాత్రం యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ ‘బీఏఏ3’ రేటింగ్‌ను ఇస్తోంది. జంక్ (చెత్త) స్టేటస్‌కు ఇది ఒక అంచె ఎక్కువ. కేంద్ర ఆర్థికశాఖ అధికారులు సెప్టెంబర్ చివరి వారంలో మూడీస్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. భారత్ సావరిన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను పెంచాలని విజ్ఞప్తి చేశారు. భారత్ ఎకానమీ మూలస్తంభాలు పటిష్టంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు ఈ సందర్భంగా మూడీస్ ప్రతినిధులకు వివరించారు. ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కేవీ సుబ్రమణ్యం, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నుంచి ఎకానమీ వేగంగా రికవరీ చెందుతోందని మూడీస్ ప్రతినిధులకు అధికారులు వివరించారు. సంస్కరణలను, రికవరీ వేగవంతానికి ఆయా సంస్కరణలు ఇస్తున్న తోడ్పాటు వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. 2021–22 బడ్జెట్ తీరు, ద్రవ్యలోటు, రుణ పరిస్థితులు కూడా సమావేశంలో చోటుచేసుకోనున్నాయి. ఆయా అంశాల నేపథ్యంలో మూడీస్ అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్ చేసినా, రేటింగ్‌ను మాత్రం యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మూడీస్ చెప్పిన ముఖ్యాంశాలు... ♦భారత్ ఫారిన్ కరెన్సీ, లోకల్ కరెన్సీ దీర్ఘకాలిక ఇష్యూయెర్ రేటింగ్స్, లోకల్ కరెన్సీ సీనియర్ అన్సెక్యూర్డ్ రేటింగ్స్‌ను కూడా ‘బీఏఏ3’గా కొనసాగిస్తున్నట్లు మూడీస్ తాజాగా విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ♦ మూలధనం, ద్రవ్యలభ్యత, బ్యాంకులు, నాన్ బ్యాంక్ ఫైనాన్స్ సంస్థల పరిస్థితులు గతంతో పోల్చితే ఇప్పుడు మెరుగుపడినట్లు మూడీస్ వివరించింది. ♦ అయితే రుణ భారాలపై అప్రమత్తత అవసరమని సూచించింది. మూడీస్ తాజా ప్రకటన ప్రకారం 2019లో జీడీపీలో భారత్ రుణ భారం 74 శాతం. 2020 జీడీపీలో ఇది 89 శాతానికి చేరింది. సమీపకాలంలో దాదాపు 91 శాతంగా ఉండే అవకాశం ఉంది. రుణ భారాల నిష్పత్తుల తగ్గాలంటే, దేశానికి భారీ వృద్ధి రేటు అవసరం. ♦ ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు వచ్చే కొద్ది సంవత్సరాల్లో మరింత తగ్గుతుందన్న అంచనాలను మూడీస్ వెలువరించింది. ♦ ద్రవ్యలోటు తగ్గితే దేశ సావరిన్ క్రెడిట్ ప్రొఫైల్ బలహీనతలు మరింత తగ్గుతాయని విశ్లేషించింది. ప్రభుత్వ ఆదాయలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.8 శాతానికి (రూ.15,06,812 కోట్లు) కట్టడి చేయాలన్నది 2021–22 బడ్జెట్ లక్ష్యం. 2020–21 ఆర్థిక సంవత్సరం కరోనా కష్టాల్లో ఈ లోటు ఏకంగా 9.3 శాతానికి ఎగసింది. ♦ భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ పరిస్థితులు బాగున్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు కరోనా ముందస్తుకాలంకన్నా మెరుగుపడే అవకాశం ఉంది. 2020–21లో జీడీపీ 7.3 శాతం పతనం అయితే, 2021–22లో 9.3 శాతంగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతంగా నమోదుకావచ్చు. ♦ వ్యాక్సినేషన్ పెరగడంతో మూడవవేవ్ ముప్పు ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఉండకపోవచ్చు. ♦ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న పలు విధానపరమైన, సంస్కరణాత్మక చర్యలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, దేశం చక్కటి వృద్ధి బాటన దూసుకుపోయే అవకాశం ఉంది. రేటింగ్‌ల తీరు... 13 సంవత్సరాల తర్వాత నవంబర్ 2017లో భారత్ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు అప్‌గ్రేడ్ చేసింది. అయితే గత ఏడాది తిరిగి ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కు డౌన్‌గ్రేడ్ చేసింది. పాలసీల్లో అమల్లో సవాళ్లు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. ‘బీఏఏ3’ జంక్ (చెత్త) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. రేటింగ్ దిగ్గజ సంస్థలు ఫిచ్, ఎస్అండ్పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తున్నాయి. భారత్ దీనిపట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. భారత్ ఆర్థిక మూలస్తంభాల పటిష్టతను రేటింగ్ సంస్థలు పట్టించుకోవడంలేదన్నది వారి ఆరోపణ. ప్రాముఖ్యత ఎందుకు? అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చే సావరిన్ రేటింగ్ ప్రాతిపదికగానే ఒక దేశంలో పెట్టుబడుల నిర్ణయాలను ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు తీసుకుంటారు. ప్రతియేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్ రేటింగ్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులను వివరించి, రేటింగ్ పెంపునకు విజ్ఞప్తి చేస్తారు. కొద్ది నెలల క్రితం మరో రేటింగ్ దిగ్గజం– ఫిచ్‌తో కూడా ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. -
భారత్ భవిత బంగారం!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం భారత్ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్లేషణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశం ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చని రేటింగ్ సంస్థ మూడీస్ సోమవారం పేర్కొంది. వచ్చే రెండేళ్లలో దేశాభివృద్ధి 6.8 శాతం ఉంటుందని బ్యాంకింగ్ సేవల దిగ్గజ సంస్థ తాజాగా మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. ఈ మేరకు ఆయా సంస్థలు విడుదల చేసిన విశ్లేషణా పత్రాలను వేర్వేరుగా పరిశీలిస్తే- క్రెడిట్ పాజిటివ్: మూడీస్ ఎన్నికల ఫలితాలు సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తుందని మూడీస్ పేర్కొంది. స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఈ పరిణామం దోహదపడే అవకాశాలు ఉన్నాయని మూడీస్ వివరించింది. ఇది భారత్‌కు ‘క్రెడిట్ పాజిటివ్’అని సంస్థ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ప్రస్తుతం దేశానికి మూడీస్ ‘బీఏఏ3’ రేటింగ్ ఉంది. స్టేబుల్ అవుట్‌లుక్‌తో కొంత క్రెడిట్ రిస్క్ ఉన్నట్లు ఈ రేటింగ్ సూచిస్తుంది. అటు ప్రభుత్వానికి, ఇటు కార్పొరేట్ రంగానికి ఈ విజయం క్రెడిట్ పాజిటివ్ అని వివరించింది. బ్యాంకింగ్ రంగానికి సైతం ఇది శుభసూచకమని అభిప్రాయపడింది. చిదంబరం తన తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేటాయించిన మూలధన పెట్టుబడులను మోడీ సర్కారు పెంచవచ్చని విశ్లేషించింది. ఇది బ్యాంకుల క్రెడిట్ పాజిటివ్‌కు దోహదపడుతుందని వివరించింది. ఇన్వెస్టర్ సెంటిమెంట్ తక్షణం మెరుగుదలకు ఇది దోహపదడిందని వివరించింది. కార్పొరేట్, మౌలిక రంగాల విషయంలో నిలిచిపోయిన విధానాల పునరుద్ధరణకు ఈ ఫలితాలు దోహదపడతాయని మూడీస్ వైస్‌ప్రెసిడెంట్, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ వికాశ్ హలాన్ అన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సన్నిహిత సహకారం వల్ల పెట్టుబడుల్లో ప్రస్తుతం ఉన్న నిరుత్సాహ ధోరణి తొలగిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొత్త ప్రభుత్వం సహజ వాయువు ధరలను పెంచే అవకాశం కూడా ఉన్నట్లు వివరించింది. ఇదే జరిగితే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి అప్‌స్ట్రీమ్ ఆయిల్, గ్యాస్ కంపెనీలకు లాభదాయకమని పేర్కొంది. దీర్ఘకాలంలో పెట్టుబడులకు ఇది ఊతమిచ్చే అంశంగా దీనిని విశ్లేషించింది. ఏప్రిల్‌లోనే గ్యాస్ ధరలు పెరగాల్సి ఉన్నా, దీనిపై నిర్ణయాన్ని ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పక్కనబెట్టింది. మోర్గాన్ స్టాన్లీ ఇలా... వచ్చే కొద్ది త్రైమాసికాల్లో దేశం స్టాగ్ఫ్లేషన్ నుంచి బైటపడుతుంది. వృద్ధి కనిష్ట స్థాయి వద్ద కొనసాగుతూ, ధరల పెరుగుదల తీవ్రంగా ఉండే పరిస్థితిని స్టాగ్‌ఫ్లేషన్‌గా వ్యవహరిస్తాం. ఈక్విటీ మార్కెట్ ఊపుమీదుంటుంది. 2015 జూన్ నాటికి మోర్గాన్ స్టాన్లీ సెన్సెక్స్ టార్గెట్ 26,300. దీనికి సంబంధించి క్రితం టార్గెట్ 21,280 పాయింట్లు. భారత్ వృద్ధికి సంబంధించి ఎన్నికల ఫలితాలు కీలకమైనవి. వచ్చే రెండేళ్లలో జీడీపీ వృద్ధి 6.8 శాతానికి పెరగవచ్చు. ద్రవ్యోల్బణం 6 శాతం దిశగా కిందకుదిగే అవకాశం ఉంది. భారత్ సంస్థాగత అంశాలు ఇప్పటికే పటిష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వృద్ధికి ఊతం ఇస్తూ, సంస్కరణల ప్రక్రియ వేగం పెంచవచ్చు. వ్యాపార సెంటిమెంట్‌కు ఫలితాలు ఊపిరులూదాయి. కార్పొరేట్ రంగ లాభదాయకతకు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగడానికి ఈ ఫలితాలు దోహదపడే అవకాశం ఉంది. ఫలితాలు దేశాభివృద్ధికి సంబంధించి మా విశ్వాసాన్ని పెంచాయి. రానున్న పదేళ్లలో జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతానికి పైగా నమోదవుతుంది. జీడీపీ విలువ ప్రస్తుత 1.9 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు. ఇబ్బందులూ ఉన్నాయ్ దేశ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లూ పొంచి ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ నివేదిక విశ్లేషించింది. రానున్న 12 నెలల్లో ఎల్నీనో, ఎగుమతుల స్పీడ్ తగ్గుదల వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. మధ్యకాలికంగా ఎదురయ్యే సవాళ్లలో ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఒకటి. సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేయడం మరొకటి.