aluminum
-
వేదాంతా లాభం క్షీణత
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 57 శాతం క్షీణించి రూ. 3,132 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,261 కోట్లు ఆర్జించింది. అల్యూమినియం బిజినెస్ తగ్గడం, రైటాఫ్‌లు లాభాలను దెబ్బతీశాయి. అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం(రూ. 3,092 కోట్లు) 1 శాతం బలపడింది. అయితే మొత్తం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 37,225 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 39,342 కోట్ల టర్నోవర్ సాధించింది. జింక్ నుంచి ముడిఇనుము వరకూ కమోడిటీ ధరలు తగ్గడం ఫలితాలను ప్రభావితం చేసింది. వీటికితోడు చమురు, గ్యాస్ బిజినెస్ నుంచి రూ. 1,336 కోట్లమేర అనుకోని నష్టం వాటిల్లినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 1,45,404 కోట్ల టర్నోవర్ అందుకుంది. పెట్టుబడులకు సై గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అనిల్ అగర్వాల్ సోదరుడు నవీన్ అగర్వాల్, కుమార్తె ప్రియా అగర్వాల్‌లను బోర్డు ఐదేళ్లపాటు డైరెక్టర్లుగా తిరిగి నియమించినట్లు వేదాంతా పేర్కొంది. చమురు, గ్యాస్ అన్వేషణకు 29.6 కోట్ల డాలర్ల పెట్టుబడి వ్యయాలకూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు 2.3 శాతం నీరసించి రూ. 275 వద్ద ముగిసింది. -
చైనా కంపెనీలకు భారత్ షాక్! యాంటీ డంపింగ్ సుంకాలు
న్యూఢిల్లీ: కొన్ని రకాల అల్యుమినియం ఉత్పత్తులు, రసాయనాలు సహా చైనా నుంచి దిగుమతయ్యే అయిదు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం యాంటీడంపింగ్ సుంకం విధించింది. అయిదేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. పొరుగు దేశం నుంచి చౌక ఉత్పత్తులు వెల్లువెత్తడం వల్ల దేశీ తయారీదారులు దెబ్బతినకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిర్దిష్ట ఫ్లాట్ రోల్డ్ అల్యుమినియం ఉత్పత్తులు, సోడియం హైడ్రో సల్ఫైట్ (అద్దకం పరిశ్రమలో ఉపయోగించేది), సిలికాన్ సీలెంట్ (సోలార్ ఫోటోవోల్టెయిక్ మాడ్యూల్స్ తయారీలో ఉపయోగపడేది), హైడ్రోఫ్లూరోకార్బన్ కాంపోనెంట్ ఆర్–32 .. హైడ్రోఫ్లూరోకార్బన్ బ్లెండ్స్ (రెండింటిని రిఫ్రిజిరేషన్ పరిశ్రమలో వాడతారు) వీటిలో ఉన్నాయి. వాణిజ్య శాఖలో భాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) నిర్వహించిన దర్యాప్తులో ఈ ఉత్పత్తులను భారత మార్కెట్లో సాధారణ తయారీ రేటు కన్నా చాలా తక్కువకు చైనా ఎగుమతి చేస్తున్నట్లు తేలింది. ఇలా భారీ స్థాయిలో వచ్చి పడుతున్న దిగుమతుల వల్ల (డంపింగ్) దేశీ పరిశ్రమ నష్టపోతోందని వెల్లడైంది. దీంతో డీజీటీఆర్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం సుంకాలు విధించింది. మరోవైపు, ఇరాన్, ఒమన్ తదితర దేశాల నుంచి కాల్సైన్డ్ జిప్సం పౌడరుపైనా యాంటీ డంపింగ్ సుంకం విధించింది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో చైనాకు భారత్ నుంచి ఎగుమతులు కేవలం 12.26 బిలియన్ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు ఏకంగా 42.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
ఏపీలో ఉత్పత్తికి సిద్ధమైన ‘డైకీ’
సాక్షి, అమరావతి: వందేళ్ల చరిత్ర కలిగిన జపాన్ దిగ్గజ ఉక్కు సంస్థ ‘డైకీ’ ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తికి సిద్ధమైంది. డైకీ అల్యూమినియం సంస్థకు చెందిన ప్రతినిధులు మంగళవారం ఏపీ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న తమ ప్లాంట్ వివరాలను మంత్రికి వెల్లడించారు. ఏడాదిలోగా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయాలు, సంస్కరణలను గురించి డైకీ ప్రతినిధులకు మంత్రి వివరించడంతో.. ఏపీ అభివృద్ది దిశగా ముందుకెళుతోందని వారు హర్షం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఉక్కును అందించడంలో ఏమాత్రం రాజీపడకుండా ముందుకు వెళుతున్న డైకీ సంస్థను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. డైకీ ఉక్కు కర్మాగారానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చేపడతామని వారితో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. -
ట్రయంఫ్ నుంచి మరో ఖరీదైన బైక్
న్యూఢిల్లీ: బ్రిటిష్ ప్రీమియమ్ మోటార్ సైకిల్ కంపెనీ ట్రయంఫ్ టైగర్ 800 సిరీస్‌లో మరో ఖరీదైన బైక్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. టైగర్ 800 ఎక్స్‌సీఏ పేరుతో అందిస్తున్న ఈ బైక్ ధర రూ.15.17 లక్షలు (ఎక్స్ షోరూమ్). మరింత మెరుగైన ఫీచర్లతోఈ ఆఫ్–రోడ్ బైక్‌ను అందుబాటులోకి తెచ్చామని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా తెలిపింది. 800 సీసీ ఇంజిన్‌తో రూపొందిన ఈ బైక్‌లో ఆరు రైడింగ్ మోడ్స్ ఉన్నాయని కంపెనీ జనరల్ మేనేజర్ షోయబ్ ఫరూఖ్ చెప్పారు. ఈ బైక్‌లో ఎల్ఈడీ లైట్లు, జాయ్‌స్టిక్ కంట్రోల్, అల్యూమినియమ్ ఫినిష్డ్ రేడియేటర్ గార్డ్, టీఎఫ్టీ స్క్రీన్ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపారు. -
బామ్మ
నేరు గీతలా మట్టిరోడ్డు, నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం కలిగిన ప్రాథమిక పాఠశాల, వరుసగా పెంకుటిండ్లు, ఇండ్ల చుట్టూ పంటపొలాలు... అంటూ ఎంతో అందంగా ఉన్నప్పటికీ ‘మోటపాలంజేరి’ ఎప్పుడూ నాకు నచ్చలేదు.ఎప్పటినుండి ఈ అయిష్టత ఏర్పడిందో తెలియదు. ‘‘మోటపాలం వీథికి వెళ్లాలి.’’ అన్న అమ్మతో, ‘‘మోటపాలంజేరి కా?’’ అని ఆటోడ్రైవర్ ఆశ్చర్యంగా అడిగిన క్షణం నుండా?కాదు... ఎవరూ లేని దారిలో, ఎదురుగా వచ్చిన సైకిల్‌కు దారివ్వమని బలవంతంగా నా చేతిని పట్టుకొని నొప్పి పుట్టేటట్టుగా బామ్మ నన్ను పక్కకు లాగిన క్షణం నుండా? లేదు... ఎనభైఏళ్ల తాతయ్యను ఇరవైఏళ్ల యువకుడు‘ఒరేయ్ షణ్ముగం’ అని పిలిచిన జ్ఞాపకం తప్పైన తరుణంలోనా?.... తెలియటం లేదు. మోటపాలంజేరి నాకు ఎప్పుడూ నచ్చలేదు. ఆ ఊరిమీదున్న అసహనాన్ని బయటపెట్టినప్పుడల్లా బామ్మ అంటుండేది. ‘‘అదేంటే అలా అనేశావు. ఈ మోటపాలెం ఊరిని ఏర్పరచిన మొదటి నలుగురిలో మా నాన్నకూడా ఒకరు. ఆయన ఏర్పాటుచేసినఊరిని కదా నువ్విలా మాట్లాడేశావు?’’ తాత గురించి బామ్మకు ఎప్పుడూ గౌరవభావమే ఉండేది. ఆ చుట్టుపక్కల ఊళ్లకంతా అప్పట్లోనే నాలుగు గుర్రాల చారెట్బండి ఉన్నది తాతయ్య ఒక్కడికేనని గొప్పలు చెప్పేది. బుద్ధి తెలిశాక... ‘‘ఆ చారెట్బండ్లో ఏ కులంవాళ్లు ఎక్కి వెళ్లేవాళ్లు నానమ్మా?’’ అని అడగాలనిపించేది. ఈ తరంవాళ్ల ముందు ఆమె గొప్పలు ఓడిపోతుందేమోనన్న భయంతోటే అడక్కుండా ఉండిపోయాను.సరదాగా గడపటానికి వీలుకాకపోయినప్పటికీ, మరో దారిలేక, ఆ మోటపాలంజేరిలో నేను ‘ఆలిస్’ గానూ, ఆ వాడను ‘వండర్ ల్యాండ్’ గానూ ఊహించుకొని ఉండాల్సి వస్తుంది. ఇంటి వెనక ప్రవహించే పంటకాలవ మీద, ఒక మనిషి మాత్రం వెళ్లేంతగా వెయ్యబడిన ఆ పొడవైన రాతి వంతెన మీద కూర్చుని, కాలవ నీటిలో కాళ్లు తడిసిన క్షణాలు, సమయాలే... నా వండర్ ల్యాండ్బ్రతుకులోని గొప్ప అనుభూతి తరుణాలు. దాన్ని మార్చటానికి పెద్ద తరుణం ఇప్పటివరకూ మరేదీ రాలేదన్నది అక్షర సత్యం. అయితే దాన్నంతా అధిగమించి ఒక గొప్ప వండర్ ల్యాండ్‌ను తనలో దాచుకొంది మోటపాలంజేరిలో ఉన్న మా బామ్మ ఇల్లు. ‘‘ఆ ఇంట్లో అలా నువ్వేం చూశావనీ?’’ అని అమ్మ మొదలు అమ్మమ్మ వరకూ అడిగి విసిగించిన సమయాలు గతించాయి. తెల్లని తెలుపూ కాస్త నీలిరంగూ కలిసి సున్నం కొట్టిన నున్నటి గోడలమీద ఎక్కణ్ణించో తీసుకొచ్చి నాటిన మనీప్లాంట్ తీగ. దానితోపాటు బచ్చలి తీగా, అల్యూమినియం డబ్బాలలో పెంచుతున్న పట్టు రోజా, సంపంగి, గోరింటాకుతో కలిసి ఇంద్రధనుస్సులా ఉన్న ఆ ఇంటి ద్వారబంధంలో చెక్కిన కిరీటం ధరించిన సింహం మరిక ఏ ఇంట్లోనూ నేను చూడలేదు. ఆ సింహాన్ని నేనెంతో ఆసక్తిగా స్పృశించిన రోజులలో, తాతయ్య చిరునవ్వుతోఅనేవారు... ‘‘అంతా మీ బామ్మ ఇష్టమే. ఆమే కదా ఆచారికి ఆ ఆలోచన చెప్పింది!’’ అని. ఆ తలుపులు మాత్రమే కావు... అంతా బామ్మే చెక్కి ఉంటుందా అని భ్రమించే విధంగా ఆ ఇంటిని నిర్మించుకుంది.పడమరన చూస్తే ఒంటరిగా ఉన్న పెద్ద వంటగది మరో ఇల్లులాగానే ఉంటుంది. నడవ, లోపల ఇల్లు, హాలు అంటూ అన్నీ వేర్వేరు ఇండ్లులాగా... ఒకే ఆవరణలో రెండు ఇండ్లు అన్నట్టుండేవి. ఆ వంటగదే నాకు బోధివృక్షం ఎప్పటికీ! సెలవు దినాల్లో కుటుంబమంతా నడవలోనూ, లోపలి ఇంట్లోనూ, హాల్లోనూ కలిసి ఉంటే... నేను మాత్రం వంటగదిలో కూర్చుని ఉండేదాన్ని. దెబ్బలు తిన్నా, ఏడ్చినా, సంతోష సమయాల్లోనూ, అన్నీ ఆ గదిలోనే. వర్షాకాలం అవసరాల కోసం, మండుటెండల్లో చెట్టూ పుట్టా గుట్టా అంటూ అంతా తిరిగి సేకరించిన కట్టెలతో నిండిన వంటగది. పెరుగుతో నిండిన ఉట్టి కుండలు, ఊరబెట్టిన ఊరగాయలు, చింతపండుతో రోజూ బాగా రుద్దిపెట్టిన రాగి మంచినీళ్ల బిందె, రోలూ దాని పక్కనే... బాగా దంచో, లేదా రుబ్బురాతిలో వేసి రుబ్బో, చేసిపెట్టిన మసాలాలతో కూడిన డబ్బాలూ అంటూ ఆ గది మొత్తమూ... నేను పక్కకువాల్చటానికి తగ్గ భుజాలతోటీ, నా తలను ఆప్యాయంగా తడిమే చేతులతోటీ నిండి ఉందన్నట్టుగా అనిపించేది. ఒకే సమయంలో పదిమంది కూర్చుని భోంచేసే విధంగా ఉన్న ఆ వంటగదిలో ఉన్న మసిపట్టిన కట్టెలపొయ్యికి పైన, బామ్మ అమ్మకు, వాళ్ల అమ్మ పెళ్లి కానుకగా ఇచ్చిన ఒక కత్తిపీట వ్రేలాడుతూ ఉండేది. పూర్తిగా ఇనుముతో చేసిన ఆ కత్తిపీటతో కాయలు కోసినా సరే, కూర కోసినా సరే, జారిపోయి అవిపరుగులు తీసేవి. అంత సన్నగా పదునుగా ఉండేది ఆ కత్తిపీట. ఆశగా కాయలు కొయ్యటానికి ప్రయత్నించి వేలిని కోసుకున్న (ఇంకా ఆ గాయంతో తిరుగుతున్న) ఇష్టం దానిమీద ఉంది నాకు.పళ్లెంమీద కత్తిపీటను పెట్టుకొని బామ్మ కాయలు కోయటం ఎంతో అందంగా ఉండేది. అందులోనూ ఆమె క్యాబేజీ కోసే అన్ని సమయాల్లోనూ నేనే ఆమె మొదటి అభిమానిని. క్యాబేజీలోని ఒక్కో ఆకునూవొలిచి, దాన్ని చెయ్యి పట్టేంతగా ఒకటిగా కలిపి పట్టుకొని, నిదానంగా ఒకే కొలతతో తరిగి తరిగి... ఆ పళ్లెం నిండిపోతున్నప్పుడు, బామ్మ కళ్ల మెరుపులు కోనేట్లో ప్రకాశవంతంగా పూసిన తెల్లతామరలను గుర్తుకుతెచ్చేవి.కాస్త పప్పు, కొన్ని టమోటాలూ, రెండు ఎండుమిరపకాయలూ గిల్లి వేసిన చారూ వేపుడుగా... ఆమెచేసే ఆ క్యాబేజీతోటే, ఒక కుంభం అన్నం తినొచ్చు అని నాన్న అప్పుడప్పుడూ అంటున్నప్పుడు, అదినిజమేనని అనిపిస్తుంటుంది.బామ్మ అద్భుతమైన వంటలకు ఆ కత్తిపీటే కారణమని చాలాకాలం వరకూ నమ్మిన నేను, మా అమ్మకు కూడా ఇవ్వని ఆ కత్తిపీటను నేను తీసుకెళ్లాలని ఎప్పుడూ ఆశపడేదాన్ని. ‘‘బామ్మా, నీ పెళ్లి తర్వాతే మీ అమ్మ నీకు ఈ కత్తిపీటను ఇచ్చిందా?’’ ‘‘ఔను. కానీ ఆ కత్తిపీటను వాళ్లమ్మ ఆమెకు పెళ్లి కానుకగా ఇచ్చింది.’’‘‘అయితే నేను పెళ్లిచేసుకొని వెళ్లేప్పుడు దాన్ని నాకిస్తావా బామ్మా?’’పదేళ్లుకూడా పూర్తిగా నిండని నేను అలా అడగ్గానే బామ్మ ఎంతగా నవ్విందనీ? అమ్మ, అత్త, పెద్దమ్మ, వదిన అంటూ అందరినీ దగ్గరకు పిలిచిన బామ్మ... మా నాన్నతో అంది:‘‘నీ కూతురి పెళ్లికి నగలేవీ వద్దట. ఈ కత్తిపీటే కావాలిట’’‘‘నీకెందుకమ్మా ఇవన్నీ. నీకు మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మెషిన్ అంటూ అన్నీ మెషిన్లనే కొనిస్తాగా.’’ అంటూ నా చేతిని పట్టుకొని నాన్న చెప్పిన ఆ క్షణంలో, ఆ కత్తిపీట నాది కాదన్న బాధ ఎక్కువైంది. అది కన్నీరుగా బయటికొచ్చింది. అది చూసి అదిరిపడ్డ బామ్మ... ‘‘మీ తాతయ్య కుటుంబంలో అయిదారు తరాల తర్వాత వరమై పుట్టిన ఆడబిడ్డవు నువ్వు. నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మకూడా ‘ఆడపిల్ల’ అని ముఖం తిప్పుకుంది. నేనే కదా ఆస్పత్రిలోని వాళ్లకంతా మిఠాయి కొని పంచాను. మా కులదేవతవు నువ్వు. నీకు లేనిదా? మా అమ్మ నాకు ఇచ్చిందంతా నీకే!’’ అని నా తలమీద కొట్టి ప్రమాణం చేశాకే నా కన్నీళ్లు ఆగాయి.ఆ కత్తిపీట మీద నాకు ఇష్టముందా లేక బామ్మ వంటమీదా? అని ఎప్పుడూ నాకొక అనుమానం ఉండేది. లేదూ... బామ్మ అద్భుతమైన వంటకు ఆ కత్తిపీటే కారణమన్న కుతూహలమా అన్నదీ అర్థమయ్యేది కాదు అప్పుడు.ఇంట్లో ఏ కాయగూరలూ లేక, కొనటానికి డబ్బుల్లేని సమయంలోకూడా, బామ్మ దానిగురించి పెద్దగా అంగలార్చేది కాదు.వంటగదిలోకెళ్లి, అక్కడ మూటల్లో నింపి ఉన్న బియ్యంలో నుండి ఒక చాటెడు బియ్యం తీసుకొని, మట్టి కుండలో ఒక ఊరు ఊరే తినేంతగా అన్నం పొంగించేది. కొంచెం కూడా అధైర్యపడకుండా పశువులకోసం ఉంచిన తవుడును చేతి నిండుగా జవురుకొని, ఒక పెద్ద చట్టిలో వేసి కొద్దిగా వేయించి, దానితోపాటు కాస్త చింతపండు, మిరపకాయలు వేసి, మూడింటినీ రుబ్బురోల్లో వేసి రుబ్బి, ఐదే ఐదు నిమిషాల్లో పచ్చడి చేసేది. ఎంత అర్థరాత్రి సమయంలోనైనా ఈ ఇంట్లో ఈ భోజనం కచ్చితంగా ఉంటుందన్న నమ్మకాన్ని అందరిలోనూ కలిగేలా చేసింది బామ్మ. ‘‘కాకరకాయను ఏం చేస్తారు?’’ అని అడిగిన ఆఫీసు ఫ్రెండుతో ‘‘సాంబార్లో వేస్తాను.’’ అన్నప్పుడు ఆమె ముఖంలో కనిపించిన ఆందోళన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.‘‘చింతపులుసులోనేగా కాకరకాయలు వేస్తారు.’‘‘అలాగా. మా ఇంట్లో సాంబార్లో మాత్రమే కాకరకాయల్ని వేస్తాం. లేదూ దాన్ని పప్పులోవేసి వేపుడు చేస్తాం!’’బామ్మ అలాగే అలవాటు చెయ్యించింది. బామ్మకు పెద్ద కాకరకాయలు అంటూ ఒకటుండటం తెలుసో తెలియదో అని ఆలోచించాను. పొట్టి కాకరకాయల అభిమాని ఆమె. సంతలో నుండి పొట్టిపొట్టి కాకరకాయల్ని ఏరుకొని వచ్చేది. ఒక్కో కాకరకాయనూ అడ్డంగా తరిగి, గింజల్ని తీసేసి,దాన్ని అలాగే ఆ ఇటుకల పొయ్యిదగ్గర కటిక నేలమీద పరిచేది. ‘‘ఏం బామ్మా, కాకరకాయల్ని ఇలా కటిక నేలమీద పరిచావు. మసీ, దుమ్మూ ధూళీ అన్నీ అంటుకుంటాయిగా?’’ అని అడిగినపుడు... ‘‘లేదే, కటికనేల కాకరకాయల్లోని చేదునంతా పీల్చేస్తుంది. తర్వాత పులుసు పెడితే చేదుగా ఉండదు.’’ అని వివరణ ఇచ్చింది.ఆమె ఎలా చెప్పగలిగింది, ఏ ఆధారంతో ఈ కటికనేల చేదునుపీల్చేసే కాన్సెప్ట్ పనిచేస్తుంది అని నాకు తెలియలేదు. అయితే ఆమె పెట్టిన ఏ ఒక్క కాకరకాయ సాంబార్లోనూ చేదు అన్నది కాస్తంత కూడా లేదు అన్నది మాత్రం బాగా తెలుసు.శాఖాహారం మాత్రమే కాదు. మాంసాహారంలోనూ బామ్మ దుమ్ము లేపుతుంది. ‘తామ్రభరణి’లో నీటి ప్రవాహాన్ని ఆపేస్తున్నట్టుగా ప్రకటన వచ్చిన రోజుల్లో ఊరు ఊరంతా ఏట్లో ఉండేది, నీళ్లు తగ్గిపోగానే తేలిపోయే చేపల్ని పట్టుకోవటానికి. అయితే బామ్మ మాత్రం చేపల్ని పట్టుకునేది కాదు. మారుగా ఏట్లో అడుగుభాగాన ఉండి, తగ్గిపోయిన నీళ్లు కారణంగా పైకి కనిపించటం మొదలుపెట్టే నత్తగుల్లల మీదే బామ్మ చూపులన్నీ ఉండేవి. ఒక బిందె నిండుగా నింపుకొని వచ్చేది ఆ నత్తల్ని. తర్వాత ఇంటి పెరట్లోని మట్టిలో కూర్చుని, ఆ నత్తల్ని శుభ్రం చెయ్యటం మొదలుపెట్టేది. మూసుకున్న చిప్పల్ని విప్పదీసి, లోపల ఉండే ఆ చిన్ని మాంసాన్ని తీసి, దాన్ని కడిగి ఇంకో చట్టిలో వేసేది. బిందె నిండుగా ఉండే అన్ని నత్తల మాంసాన్ని తీసి, దాన్ని పులుసుగా పెట్టి ఇచ్చేది. మంచు కురిసే రాత్రుల్లో, ఆ కట్టెలపొయ్యి మంటల్లో, వంటగదిలో కూర్చుని, ‘‘తెల్లారన్నమూ నత్తల పులుసూ’’ తిన్న సమయాలు ఇంకా నాలో నేనే చెప్పుకునే విసుగుపుట్టని కథల్లో ఒకటై నిలుస్తోంది.ఏదో ఒక వర్షం కురుస్తున్న రోజు, హాల్లోని మధ్య స్తంభం దగ్గర కూర్చుని శొంఠి కాఫీ తాగుతున్నప్పుడు బామ్మను అడిగాను: ‘‘నువ్వు పెట్టే శొంఠి కాఫీకూడా ఎందుకు ఇంత బాగుంటుంది? ఇంత టేస్టుగా తాగీ తాగీ నాకే బోర్ కొట్టేసేలా ఉంది. నువ్వెందుకు ఇంత బాగా వంటచేస్తావు?’’ అని వరుసగా ప్రశ్నలమీద ప్రశ్నలు అడిగాను.బామ్మ ఏ మానసికస్థితిలో ఉందో, లేదూ వర్షం ఆమెను ఏ గతంలోకి తీసుకెళ్లిందో తెలియదు. మెల్లగానే అయినా ఎంత అద్భుతంగా చెప్పిందనీ?!‘‘మీ తాతయ్య మొదటిభార్య చనిపోవటంతో, ఆమెకు పుట్టిన చిన్ని తమ్ముళ్లందరినీ చూసుకోవటానికి మనిషే లేకుండాపోయారు. మీ తాతయ్య నాకు వరుసకు మేనమామ అవుతారు. ఆయన వయసుకు నేనొక్కదాన్నే సరిపోయాను.మా అక్క చనిపోయినావిడ కన్నా పెద్దది. మా చెల్లెలు చాలా చిన్నది. మరో దారిలేక నన్నే ఇచ్చిపెళ్లి చేసేశారు. అప్పుడు నాకు 16 ఏళ్ల వయస్సుండొచ్చు. పదోతరగతి పూర్తిచేసి టీచర్ ట్రైనింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. పెళ్లికోసం చదువును ఆపేశాను.(తానే ఆగిపోయానని కొనసాగింపు సమాచారం ఇచ్చింది)స్కూలుకు వెళ్లి పెద్దపెద్ద చదువులంతా చదవటంవల్ల నన్ను వంటింటి వైపే మా అమ్మ అనుమతించేది కాదు. అయితే పెళ్లి నిశ్చయం కాగానే వంటకు అలవాటుపడ్డాను. కానీ పూర్తిగా వంట చెయ్యటం రాలేదు. అన్నం వార్చటం రాలేదు. కాయలు తరగటం తెలియలేదు. మసాలా పెట్టటం తెలియదు. ఉప్పు ఎంత వెయ్యాలో కొలత తెలీదు. ఏమీ తెలియదు. మా అమ్మ భయపడిపోయింది. పెద్ద ఇంటికి కోడలు కాబోతున్నాను, వంట చెయ్యటం రాదంటే ఎలా అని!పెళ్లికి ముందురోజే కడయం నుండి మా పిన్ని ఒకామె వచ్చింది. ఆమె దగ్గర మా అమ్మ ఏడవంది ఒక్కటే తక్కువ. నాకు వండటం రాదు అదీ ఇదీ అని చెప్పుకొని బాధపడింది. పిన్ని వెంటనే మా చిన్నాన్నను పిలిచి, ఇంటి వెనకున్న పంటపొలాల్లో ఎక్కడైనా పసరికపాము ఉంటే, దాన్ని పట్టుకు రమ్మని చెప్పింది. నా అదృష్టం, వెంటనే ఒక పాము దొరికిందట. దాన్ని చిన్నాన్న పట్టుకొచ్చాడు. చనిపోయిన ఆ పసరికపామును నా చేతికిచ్చి దాన్ని ఒలవమంది పిన్ని. కాస్త భయం భయంగానే అనిపించింది. కానీ మరో దారిలేదు. ఆ పసరికపామును మూడునాలుగు సార్లు తడిమి వొలిచేశాను. ఇంట్లోవాళ్లు నా చేతులను శుభ్రంచేసుకోకుండా అలాగే ఒకరోజంతా ఉండిపోయేలా చేసేశారు. భోజనం కూడా నాకు పిన్నీనే తినిపించింది. ‘‘పసరికపాము రక్తం మన చేతిలో ఊరితే, జీవితాంతం మనం చేసే వంటలు దేవామృతంలా ఉంటుంది.’’ అని పిన్ని చెప్పింది. కానీ నేను నమ్మలేదు. అయినప్పటికీ పిన్ని చెబుతోంది కదాని విన్నాను. మరుసటిరోజు పెళ్లి! మీ తాతయ్య ఇంటికెళితే, అందరూ కాఫీ పెట్టమని అడిగారు. అప్పుడూ కాస్త బెల్లంవేసి శొంఠి కాఫీనే పెట్టాను. దాన్ని తాగిన వాళ్లందరికీ సంతోషం. మా అమ్మకు చెప్పలేనంత ఆనందం. ఆ పసరికపామేనే ఇప్పటికీ నేను ఇలా అన్నం వార్చి, పులుసు పెట్టటానికి కారణం.’’ అంది ముక్తాయింపుగా బామ్మ.. ‘‘అందరూ ఇలా చేస్తారా?’’ అన్నాను. ‘‘తెలియదు. మన కులంలో ఇలా చేస్తారు.’’ అంది బామ్మ.‘‘మా అమ్మకు కూడా ఇలా చేశారా, ఏం?’’‘‘ఔను. మీ అమ్మను పిల్లను చూసి నిశ్చయం చేసిన వెంటనే నేనే ఆమెను పసరికపామును పట్టుకొని రమ్మని చెప్పి, వొలవమని చెప్పాను. లేకపోతే మీ నాన్నకు మంచి భోజనం ఎక్కణ్ణించి దొరికుండేది?’’కాలేజీలో ఉన్న నాకు, బామ్మ చెప్పినదంతా ఏడు కొండలు ఏడు సముద్రాల కావల ఒక చిలకలో ఉండే రాక్షసుడి ప్రాణం... లాంటి ఫ్యాంటసీ కథకన్నా గొప్పగా అనిపించింది. ఆ వర్షానికీ, ఆ శొంఠి కాఫీకీ ఆ ‘పసరికపాము’ ఎంతో హాయిగా అనిపించింది. ఆ విషయాన్ని చెప్పగానే ‘‘నిన్ను నేను సరిగ్గా పెంచినట్టు లేను.’’ అని చెప్పి బామ్మ లేచి వెళ్లిపోయింది. చదువు ముగించుకొని ఉద్యోగం కోసం చెన్నై వెళ్లి, ఒక ఒంటరి జీవితాన్ని అనుభవించటానికి తయారుగా ఉన్న సమయంలో నాలో కలిగిన పెద్ద అనుమానం ఏంటంటే...‘నాకు వంట చెయ్యటం వచ్చా?’ అన్నదే! వంటింట్లోనే జీవితాన్ని గడిపినా, ఒక్కరోజు కూడా నేను వంటచేసింది లేదనటం కన్నా... బామ్మో, అమ్మనో, అత్తో, పెద్దమ్మో ఎవరూ ఒకరు నన్ను వంట చేసేందుకు అనుమతించలేదన్నది మాత్రం వాస్తవం.చెన్నైలో ఇల్లు చూసి, మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, టి.వి. అన్నీ కొనిచ్చి, టి.నగర్ వెళ్లి వంటపాత్రలు కొనిచ్చి, కుకింగ్ గ్యాస్ బుక్ చెయ్యించి, నాకంటూ ఒక వేరే జీవితాన్ని ఏర్పాటు చేసి, అమ్నానాన్నలు అందరూ బయలుదేరి వెళ్లిపోయిన కొన్ని రోజులకు మా ఇంటి వంటగదిలో, నా మొదటి వంట మొబైల్ సాయంతో మొదలైంది.బామ్మను అడిగి తెలుసుకొని మరీ సాంబార్ పెడుతున్నాను.అలాగే కూరలూనూ. కొబ్బరి పాలను తియ్యటం తెలియక ఏడుపొచ్చేసింది. కొబ్బరి తురుముతున్నప్పుడే చెయ్యి కోసుకుంది. పచ్చి మిరపకాయ కంట్లో పడి మండింది. మూడు గంటల వంటకు నాలుగు గంటలుగా మొబైల్లో పాఠాలు చెబుతోంది బామ్మ. అంతా పూర్తయింది. నాకు నేనే వడ్డించుకొని, మొదటి ముద్ద తినగానే బామ్మకు ఫోన్ చేశాను. ‘‘నీలాగానే వండాను బామ్మా. అందులోనూ మొదటిసారే. ఎంతో సంతోషంగా ఉంది. అంత ఆశ్చర్యంగానూ ఉంది’’అన్నాను.బామ్మ నవ్వింది. ‘‘పసరికపాము పరుగెడుతోందే నీ రక్తంలో. పచ్చ నాగినివిగా నువ్వు.’’ అంటూనే ఫోన్ పెట్టేసింది. అరచేతిని చూసుకున్నాను. విచ్చుకున్న అరచేతిలో వేలవేల సంవత్సరాల పసరికపాము పాకుతున్నట్టు కనిపించింది. చెప్పటం మరిచిపోయాను. ఆ కత్తిపీటను నా పెళ్లికి ముందే పూర్తిగా నాకే ఇచ్చేసింది బామ్మ. తమిళ మూలం : కవితా స్వర్ణవల్లి అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ -
భారత్ ఎగుమతులు బాగున్నాయి
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు గడచిన 14 నెలల్లో చాలా బాగున్నాయని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం చెప్పారు. అయితే పూర్తి సంతృప్తి మాత్రం లేదన్నారు. ఎగుమతుల పెంపునకు భారత్ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు. 2019లో పటిష్ఠ వృద్ధి సాధించడానికి ఎగుమతులే ప్రధాన వనరుగా ఉండాలన్నది ఈ వ్యూహం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రక్షణాత్మకవాదం, మందగమనం, వాణిజ్య యుద్ధం, దిగుమతి సుంకాలుసహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ, దేశ ఎగుమతులు పెరుగుతుండడం గమనార్హమని మంత్రి పేర్కొన్నారు. 2011–12 నుంచి దేశ ఎగుమతుల విలువ 300 బిలియన్ డాలర్లుగా ఉంది. 2017–18లో 10% వృద్ధితో 303 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అల్యూమినియంపై దిగుమతి సుంకం పెంపు! అల్యూమినియంపై దిగుమతి సుంకాల పెంపునకు కేంద్రం సానుకూలంగా ఉంది. దేశీయ పరిశ్రమ, తయారీ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు ప్రభు పేర్కొన్నారు. ఈ కమోడిటీ భారీ దిగుమతులపై అల్యూమినియం పరిశ్రమ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అల్యూమినియం స్క్రాప్‌పై బేసిక్ కస్టమ్స్ సుంకం 2.5%. ప్రైమరీ అల్యూమినియంపై 7.5%. రెండింటిపై ఈ సుంకాన్ని 10 శాతానికి పెంచాలన్న డిమాండ్ వస్తోంది. దీనితోపాటు ఈ కమెడిటీ దిగుమతిపై కనీస దిగుమతి ధర, దిగుమతులపై కోటా నిర్దేశం వంటి మరికొన్ని పరిమితులూ విధించాలని దేశీయ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. -
డొనాల్డ్ ట్రంప్ ఏకాకి
లామాల్బె(కెనడా): ఊహించినట్లుగానే జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు వాడివేడిగా జరిగింది. మిత్ర దేశాల అల్యూమినియం, ఇనుము, వాహనాల ఎగుమతులపై అమెరికా టారిఫ్‌లు పెంచిన అంశం చర్చలను కుదిపేసింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాకున్నా అమెరికా ఒక వైపు, మిగిలిన ఆరు దేశాలు మరోవైపు చీలిపోయినట్లు తెలుస్తోంది. వాణిజ్య సంబంధాల పునఃపరిశీలనకు సంబంధించి ఉమ్మడి ప్రకటన వెలువరించాలని ట్రంప్ చేసిన సూచనను మిగిలిన దేశాలు పట్టించుకోలేదని తెలిసింది. సుంకాల పెంపుతో ఇతర దేశాల్లో నెలకొన్న వ్యతిరేకతను ఉమ్మడి ప్రకటన లాంటివి దాచలేవని భావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫలితంగా కెనడాలోని క్యూబెక్‌లో జరిగిన రెండు రోజుల సదస్సు శనివారం ప్రతిష్టంభనతోనే ముగిసింది. విభేదాలు ప్రస్ఫుటం.. వాణిజ్య యుద్ధానికి దారితీసేలా ఉన్న పరిణామాల నడుమ..రష్యాను జీ–7 కూటమిలోకి తిరిగి చేర్చుకోవాలని ట్రంప్ చేసిన ప్రతిపాదన పుండు మీద కారం చల్లినట్లయింది. ఈ సూచనను ఐరోపాకు చెందిన కూటమి సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఆతిథ్య దేశం కెనడా ప్రధాని ట్రూడో నేతృత్వంలోని సభ్య దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని అక్రమమని పేర్కొన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ ఇమాన్యుయేల్ స్పందిస్తూ..చర్చలు నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా జరిగాయని అన్నారు. వాణిజ్యం క్లిష్ట వ్యవహారంగా మారిందని, అయినా అన్ని దేశాలు అభివృద్ధిచెందేందుకు మార్గాలున్నాయని తెలిపారు. భద్రతా కారణాలతో ఇతర దేశాల వస్తువులపై సుంకాలు పెంచామన్న ట్రంప్ వాదనను కెనడా తోసిపుచ్చింది. తమ ఎగుమతులతో అమెరికాకు ముప్పు ఉందని పేర్కొనడం సమర్థనీయం కాదని తిప్పికొట్టింది. వాణిజ్యం, పర్యావరణం, ఇరాన్ ఒప్పందం తదితరాలపై ట్రంప్ వైఖరిని తప్పుపట్టిన యూరోప్ దేశాలు..తామూ అమెరికాపై ప్రతిచర్యలకు దిగుతామని హెచ్చరించాయి. -
ట్రంప్ ‘సుంకం’ షాక్..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... మొత్తానికి అన్నంత పనీ చేశారు. అమెరికాలోని ఉద్యోగాలను, ఎకానమీని కాపాడే పేరిట వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచ దేశాలను నిత్యం టెన్షన్ పెడుతున్న ట్రంప్ తాజాగా ఉక్కు, అల్యూమినియంలపై దిగుమతి సుంకాలు విధించారు. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు శుక్రవారం ఆమోదముద్ర వేశారు. తద్వారా అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాల భయాలకు ఆజ్యం పోశారు. ట్రంప్ ప్రస్తుత నిర్ణయంతో... ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం మేర దిగుమతి సుంకాలు 15 రోజుల్లో అమల్లోకి వస్తాయి. అయితే, పొరుగుదేశాలైన మెక్సికో, కెనడాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. మిగతా దేశాలు కూడా మినహాయింపులు కావాలనుకుంటే అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధులతో (యూఎస్టీఆర్) చర్చల ద్వారా సాధించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో మిశ్రమ స్పందన వ్యక్తం కాగా.. కీలక వ్యాపార భాగస్వామ్య దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలు రెండూ.. దేశ భద్రతకు సైతం కీలకమైనవని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ఉక్కు ఉక్కే. దీనికి తిరుగులేదు. ఉక్కు లేకుంటే దేశం లేదు. అనేక సంవత్సరాలుగా మన పరిశ్రమలను మిగతా దేశాలు టార్గెట్ చేశాయి. నిజానికి దశాబ్దాలుగా పాటిస్తూ వస్తున్న అనుచిత విదేశీ వాణిజ్య విధానాల వల్ల మన ప్లాంట్లు మూతపడ్డాయి. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని వర్గాలు పూర్తిగా అణగారిపోయాయి. ఇకపై ఇలాంటివన్నీ ఆగిపోతాయి‘ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉక్కు, అల్యూమినియంపై సుంకాల విధించడం ద్వారా అమెరికా భద్రతను కూడా కాపాడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికాలో ఉక్కు, అల్యూమినియం రంగంలో పెరుగుతున్న సంక్షోభం గురించి వాణిజ్య శాఖ తొమ్మిది నెలలుగా అధ్యయనం చేసిన మీదట ఈ నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. అమెరికా ప్రయోజనాల కోసమే.. అమెరికా ఉద్యోగులు, కంపెనీల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికాలో తయారు చేసే ఉత్పత్తులపై పన్నులు ఉండవని.. ఒకవేళ ఇతర దేశాల కంపెనీలేవైనా ఆ ప్రయోజనాలు పొందదల్చుకుంటే, అమెరికాలోనే ప్లాంటు పెట్టి పొందవచ్చని తెలియజేశారు. ‘మన నౌకలు, మన విమానాలు.. మన యుద్ధ పరికరాలు మొదలైన వాటన్నింటినీ మన దేశంలో తయారైన ఉక్కు, అల్యూమినియంతోనే ఉత్పత్తి చేద్దాం. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్య పరిష్కారానికి ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుంటున్నాం‘ అని ట్రంప్ పేర్కొనారు. కాగా అమెరికాలోనే దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొని వర్గాలు అమెరికాకు ప్రయోజనకరమైన చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించగా... మరికొన్ని వర్గాలు ఈ నిర్ణయం దేశ ఎకానమీని దెబ్బతీస్తుందని, వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. భారత్ ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రతికూలం.. సుంకాల వల్ల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఇంజనీరింగ్ ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఈపీసీ) చైర్మన్ రవి సెహ్గల్ తెలిపారు. అమెరికా బాటలోనే చైనా, యూరప్ కూడా రక్షణాత్మక చర్యలకు దిగితే భారత ఎగుమతులు మరింతగా దెబ్బతింటాయన్నారు. అమెరికా దిగుమతి చేసుకునే మొత్తం ఉక్కులో భారత్ వాటా 1.28 శాతంగా, అల్యూమినియం దిగుమతుల్లో 1.12 శాతంగా ఉంది. చైనా, ఈయూ అభ్యంతరాలు.. దిగుమతి సుంకాల విధింపుపై చైనాతో పాటు యూరోపియన్ యూనియన్‌లోని అమెరికా వ్యాపార భాగస్వామ్య దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఇది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించాయి. సుంకాల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా పేర్కొనగా.. ఇరు దేశాల సంబంధాలపై ఇది పెను ప్రభావం చూపుతుందని జపాన్ వ్యాఖ్యానించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థలో (డబ్ల్యూటీవో) ఫిర్యాదు చేసే అవకాశం ఉందని దక్షిణ కొరియా వెల్లడించింది. మిగతా యూరోపియన్ యూనియన్ దేశాలతో కలిసి పరిణామాల ప్రభావాలపై చర్చించి, తగు నిర్ణయాలు తీసుకుంటామని ఫ్రాన్స్ పేర్కొంది. వాణిజ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు టారిఫ్‌లు విధించడమనేది సరైన పద్ధతి కాదని బ్రిటన్ అభిప్రాయపడింది. రక్షణాత్మక ధోరణులు, టారిఫ్‌లు పనిచేయవని పేర్కొంది. సుంకాల పెంపునకు ప్రతీకారంగా చర్యలు తీసుకునేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని, అయితే చర్చలకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తామని యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ జిర్కీ కెటైనెన్ తెలిపారు. అమెరికా నుంచి దిగుమతయ్యే ఏయే ఉత్పత్తులపై సుంకాలు విధించవచ్చన్న దానిపై బ్రసెల్స్ ఇప్పటికే ఒక జాబితా కూడా సిద్ధం చేసింది. భారత్‌కు హెచ్చరిక.. సుంకాల విధింపు విషయంలో పనిలో పనిగా చైనాతో పాటు భారత్‌కు కూడా హెచ్చరికల్లాంటివి చేశారు ట్రంప్. చైనా, భారత్ లాంటి దేశాలు విధించే సుంకాలకు, అమెరికా విధించే సుంకాలకూ వ్యత్యాసముంటే ఆ మేరకు మార్పులుంటాయన్నారు. ‘ఏదో ఒక దశలో ఈ తరహా విధానాన్ని కూడా తెస్తాం. ఉదాహరణకు మనమేమీ సుంకాలు విధించకుండానే.. చైనా 25 శాతమో.. భారత్ 75 శాతమో విధిస్తోందనుకుందాం. అలాంటప్పుడు మనమూ అదే స్థాయిలో సుంకాలు విధిస్తాం. వాళ్లు 50 శాతం వేస్తే.. మనమూ 50 శాతం విధిస్తాం‘ అని అధికారిక ప్రకటనలపై సంతకాలు చేయడానికి ముందు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా మోటార్ సైకిల్స్ ముఖ్యంగా – హార్లే డేవిడ్సన్ బైకుల మీద భారత్ విధిస్తున్న సుంకాలు చాలా భారీగా ఉంటున్నాయని ట్రంప్ కొద్ది రోజుల క్రితమే ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మార్చి 20న భారత్ నిర్వహించబోయే డబ్ల్యూటీవో సదస్సుకు అమెరికా ప్రతినిధి రాబర్ట్ లైథిజర్ రాకపోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. -
నాల్కో షేర్ల బై బ్యాక్‌కు డెరైక్టర్ల బోర్డు ఆమోదం
న్యూఢిల్లీ: అల్యూమినియం తయారు చేసే ప్రభుత్వ రంగ కంపెనీ నాల్కో షేర్ల బైబ్యాక్‌కు ఆ కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. 64.43 కోట్ల షేర్లకు (చెల్లించిన మూలధనంలో 25 శాతం వాటా) మించకుండా బై బ్యాక్ కోసం నాల్కో కంపెనీ రూ.2,835 కోట్లు వ్యయం చేయనుంది. ఒక్కో షేర్‌ను రూ.44కు కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. ఇక ఈబై బ్యాక్‌కు వాటాదారుల ఆమోదాన్ని ప్రత్యేక తీర్మానం ద్వారా పొందుతామని, దీనిని పోస్టల్ బ్యాలెట్ ద్వారా సమీకరిస్తామని వివరించింది. ఈ కంపెనీలో 80.93 శాతం వాటా ఉన్న ప్రభుత్వం గతంలో 25 శాతం వాటా విక్రయం ద్వారా రూ.3,250 కోట్లు సమీకరించాలని యోచించింది. బై బ్యాక్ ప్రకటన నేపథ్యంలో నాల్కో షేర్ స్వల్పంగా 1.65 శాతం లాభపడి రూ. 43 వద్ద ముగిసింది. -
నిమిషంలోనే ఫుల్ చార్జ్!
అల్యూమినియం రేకు కాదిది. మొబైల్ ఫోన్ బ్యాటరీ! ప్రపంచంలోనే తొలి అల్యూమినియం అయాన్ బ్యాటరీ అయిన ఇది జస్ట్.. అరవై సెకన్లలోనే రీచార్జ్ అయిపోతుంది! ధర కూడా చవకే. దీనిని వంచొచ్చు. మడత కూడా పెట్టుకోవచ్చు! మొబైల్ఫోన్లను చిటికెలో ఫుల్ చార్జ్ చేసే ఈ సరికొత్త బ్యాటరీని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. బ్యాటరీ పేలి గాయాలు కావడం, అరుదుగా ప్రాణాలు పోవడమూ మనం చూస్తున్నాం. కానీ ఈ బ్యాటరీతో ఆ ప్రమాదం కూడా లేదు. ఎందుకంటే ఇది కాలదు. మంటల్లో వేసినా పేలదు! ఇంతకుముందు అల్యూమినియం అయాన్ బ్యాటరీ తయారీ కోసం చాలా మంది ప్రయత్నించినా, క్యాథోడ్ ఎలక్ట్రోడ్ తయారీలో విఫలమయ్యారు. కానీ స్టాన్ఫోర్డ్ శాస్త్రవేత్తలు దీనికి ఆనోడ్‌గా అల్యూమినియంను, క్యాథోడ్‌గా గ్రాఫైట్‌ను, ఎలక్ట్రోలైట్‌గా అయానిక్ లిక్విడ్‌ను ఉపయోగించి విజయం సాధించారు. -
ఫెరారీ.. రేటు వింటే పరారీ..
ఇది 1965లో తయారైన ఫెరారీ 275 జీటీబీ/సీ మోడల్ కారు. దీనితో కలుపుకుంటే.. ప్రస్తుతం ఇలాంటివి మూడు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి తరం కార్లకు ఏమాత్రం తీసిపోని దీని లుక్ చూశారా.. తక్కువ బరువుండే అల్యూమినియంతో తయారుచేసిన ఈ కారు అత్యధిక వేగం గంటకు 273 కిలోమీటర్లు. వచ్చే నెల 15న అమెరికాలోని మాంటెరేలో దీన్ని వేలం వేయనున్నారు. కనీసం రూ.206 కోట్లు పలుకుతుందని అంచనా. తద్వారా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫెరారీగా రికార్డు సృష్టిస్తుందని చెబుతున్నారు. -
‘స్టోర్ రూం’లో ఏం జరిగింది
నిజామాబాద్ నాగారం : ట్రాన్స్‌కో జిల్లా స్టోర్‌లో లక్షల రూపాయల విలువ చేసే కాపర్, అల్యూమిని యం వైర్లు మాయమైన విషయమై విచారణ జరపడానికి వరంగల్ ఎస్ఈ కిషన్, అసిస్టెంట్ సెక్రటరీ మనోహర్‌స్వామి శుక్రవారం జిల్లాకు వచ్చారు. వారితోపాటు జి ల్లాకు చెందిన ట్రాన్స్‌కో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కిషన్ ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు స్టోర్ రూమ్‌లో విచారణ జరిపారు. శనివారం కూడా విచారణ కొనసాగనుంది. నెలలోగా నివేదిక.. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల సమయంలో కాలిపోయిన కాపర్, అల్యూమినియం వైర్లను కాంట్రాక్టర్ స్టోర్ రూంలో అందించి రశీదు పొందాలి. ఆ తర్వాతే మరమ్మతులకు సంబంధించిన బిల్లులు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తారు. అయితే కాంట్రాక్టర్ కాపర్, అల్యూమినియం అందించకున్నా.. అధికారులు వారితో కుమ్మక్కై రశీదులు ఇచ్చారు. సదరు కాంట్రాక్టర్ కాపర్, అల్యూమినియం వైర్లను అమ్ముకొని, అధికారులకు వాటా ఇచ్చేవారని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఈ విషయం బయటికిపొక్కడంతో అప్పటి ఎస్ఈ విషయాన్ని ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో విచారణ జరిపిన ట్రాన్స్‌కో అధికారులు నలుగురు ఏఈలు, ఏడీఈని సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు వరంగల్ ఎస్ఈ కిషన్ శుక్రవారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. స్టోర్ రూమ్‌లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ కేసుకు సంబంధించిన చార్జిషిట్‌లో కామారెడ్డి ఏడీ ఈ రఘుకుమార్, నిజామాబాద్ ప్రస్తుత స్టోర్ ఏడీఈ వెంకటరమణ, కరీంనగర్ ఏఈ శ్రీహరి, సస్సెండ్ అయిన స్టోర్ ఏఈ ప్రశాంత్‌రెడ్డిల పేర్లు ఉన్నాయన్నారు. వీరిని విడివిడిగా విచారిస్తున్నామన్నారు. విచారణను నెలలోగా పూర్తి చేసి నివేదికను సీఎండీ కార్తికేయ మిశ్రాకు అందిస్తామని తెలిపారు. -
శిక్ష పడేనా?
* ట్రాన్స్‌కో స్టోర్‌లో కాపర్,అల్యూమినియం మాయం * నేడు విచారణకు రానున్న ఎస్ఈ * గతంలోనే నలుగురు అధికారుల సస్పెన్షన్ * సిబ్బంది, అధికారులలో చర్చ నిజామాబాద్ నాగారం: ట్రాన్స్‌కో స్టోర్‌లో లక్షల రూపాయల విలువ చే సే కాపర్, అల్యూమినియం మాయమైంది. ఏడు నెల ల క్రితం ఒక ఏడీఈ, నలుగురు ఏఈలు సస్పెండ్ అ య్యారు. శుక్రవారం ఎస్ఈ విచారణకు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ కుంభకోణం ట్రాన్స్‌కో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షిస్తారా.. బయట పడేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలలోకి వెళితే, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులలో వెలువడిన కాపర్, అల్యూమినియంను అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టర్లు స్టోర్ రూమ్‌కు అప్పజెప్పి రసీదు తీసుకోవాలి. అప్పుడే మరమ్మతులకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తారు. అయితే కాంట్రాక్టర్లు కాపర్, అల్యూమినియంను స్టోర్‌రూమ్‌కు అందజేయకున్నప్పటికీ ముట్టజెప్పినట్లుగా రశీదు తీసుకున్నారు. కాంట్రాక్టర్లకు, అధికారుల మధ్య అవగాహన ప్రకారమే ఈ తతంగం చా లా రోజులుగా కొనసాగినట్లు తెలిసింది. కాపర్‌ను బయటే అమ్ముకుని డబ్బులను పంచుకునేవారు. ఈ క్రమంలో 2011-12లో నిజామాబాద్‌లోని స్టోర్ ఏఈగా పని చేస్తున్న శ్రీహరి బదిలీపై కరీంనగర్ జిల్లాకు వెళ్లారు. జిల్లాలోని నవీ పేట మండలం ఏఈగా పని చేస్తున్న ప్రశాంత్‌రెడ్డికి స్టోర్ ఏఈగా బదీలీ చేశారు. బాధ్యతలు తీసుకునే సమయంలో రికార్టులు అన్నీ సరి చూసుకుంటుండగా కాపర్, అల్యుమిని యం స్టాక్ తక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీంతో బాధ్యత లు తీసుకోవడానికి ప్రశాంత్‌రెడ్డి నిరాకరించారు. ఒప్పందం ప్రకారం విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం, కరీంనగర్ స్టోర్ ఏడీఈ ప్రకాశం, నిజామాబాద్ స్టోర్ ఏడీఈగా పనిచేస్తున్న రఘుకుమార్ రంగంలోకి దిగి, శ్రీహరి,ప్రశాంత్‌రెడ్డి మధ్య ఒప్పందం కుదిర్చారు. ఈ మేరకు శ్రీహరి రూ.10 లక్షలు ఇవ్వాలి. దీంతో పూర్తి బాధ్యత ప్రశాంత్‌రెడ్డి తీసుకుంటారు. ఒప్పందం ప్రకారం ముందుగా రూ.5 లక్షలు ప్రశాంత్ రెడ్డికి ముట్టాయి. ఇప్పటి వరకు కథ బాగానే నడిచింది. మిగతా రూ. 5 లక్షల చెల్లింపులో తీవ్ర జ్యాపం జరగడంతో ఇద్దరి మధ్య రగడ మొదలైంది. మళ్లీ కరీంనగర్ ఏడీఈ, నిజామాబాద్ స్టోర్ ఏడీఈ, ఏఈ శ్రీహరి, ఏఈ ప్రశాంత్‌రెడ్డి సమావేశ మయ్యారు. శ్రీహరి మరో రూ.2 లక్షలు ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ అకౌంట్లోకి పంపించారు. ఈలోగా ఇక్కడ స్టోర్ ఏడీఈగా పని చేస్తున్న రఘుకుమార్ కామారెడ్డికి బదీలీపై వెళ్లారు. దోమకొండలో పనిచేస్తున్న ఏడీఈ వెంకటరమణ స్టోర్ ఏడీఈగా బదీలీపై వచ్చారు. దీంతో కొత్తగా వచ్చిన ఏడీఈకి సదరు కాంట్రాక్టర్ తన అకౌంట్లోకి రూ. రెండు లక్షలు ఏవిధంగా వచ్చాయో చెప్పాడు. స్టోర్ ఏడీఈ బాధ్యతలు తీసుకున్నప్పుడు అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయని సంతకం పెట్టిన వెంకటరమణ, తనకు అందాల్సిన వాటా రాకపోవడంతో అప్పటి ఎస్ఈకి విషయాన్ని చేరవేశారు. అప్పటికే దీనిపై ‘సాక్షి’ లో వరుస కథనాలు రావడంతో ఎస్ఈ విషయాన్ని సీఏండీ దృషికి తీసుకెళ్లారు. వెంటనే నలుగురు ఏఈలు, ఏడీలు, అనంతరం స్టోర్ ఏఈ సస్పెండయ్యారు. విచారణను నిలిపేందుకు యత్నాలు ఇదే విషయంలో వెనువెంటనే విచారణ చేయిస్తే మరింత మంది అధికారులు, కాంట్రాక్టర్లు బయటకు వస్తారని తెలి సింది. దీంతో అక్రమాల్లో భాగస్వాములు ఉన్నవారు విచారణను నిలిపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇంత పెద్దమొత్తంలో కుంభకోణం జరగడం, ఇందులో కేవలం అధికారులను బలి చేయడం జరిగిపోయింది. కాంట్రాక్టర్లు తప్పు లు చేసినట్లు తెలిసినా అప్పటి ఎస్ఈ వారి పేర్లను బ్లాక్ లిస్టులో పెట్టలేదు. వారిని వెనకేసుకు వచ్చారు. దీంతో సద రు కాంట్రాక్టర్లు అందుకు కానుకగా ఒక ఏసీని, ఒక టీవీ, విలువైన పర్నిచర్‌ను కార్యాలయానికి అందజేశారని సమాచారం. దీంతో పెద్దసారు సంతృప్తి చెంది వారిని ఏమీ అనలేదు. ఎస్ఈ బదీలీ అయ్యేంత వరకు అక్కడే ఉన్న టీవీ, మ రికొన్ని వస్తువులు కొత్త ఎస్ఈ వచ్చేలోగా మాయం చేశారు. నేడు విచారణలో ఏం జరుగుతుందో.. వరంగల్ ఎన్పీడీసీఎల్ కార్యాలయం నుంచి ఎస్ఈ శుక్రవారం జిల్లాకు రానున్నారు. స్టోర్ ఏడీఈగా ఉన్న వెంకటరమణ, కామారెడ్డి ఎడీఈ రఘుకుమార్, కరీంనగర్ ఏఈ శ్రీ హరి, సస్పెండ్ అయిన ఏఈ ప్రశాంత్‌రెడ్డిపై విచారిస్తారు. అసలు ఏం జరిగింది. ఎంత మొత్తంలో అక్రమాలు జరి గాయి అన్ని విషయాలు తెలియాల్సి ఉంది. విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం లేకపోలేదు. -
గుర్రప చెరువులో మునిగి తండ్రీకొడుకుల మృతి
=బంతి కోసం నీటిలో దిగి కుమారుడు.. =కొడుకు ఆచూకీ కోసం చెరువులో దిగి తండ్రి కన్నుమూత =ఇద్దరి మృతదేహాలూ లభ్యం అవనిగడ్డ, న్యూస్‌లైన్ : చెరువులో కొడుకు గల్లంతవగా, గాలింపు కోసం చెరువులోకి దిగిన తండ్రి కూడా మృతిచెందిన విషాద ఘటన అవనిగడ్డలో ఆదివారం జరిగింది. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన బిట్ర శ్రీను (42) అల్యూమినియం పాత్రల వ్యాపారం చేసేందుకు మూడేళ్ల క్రితం అవనిగడ్డకు వచ్చాడు. చెరువు సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కొంతమంది పిల్లలతో కలిసి శ్రీను కుమారుడు వెంకటేష్ (6) బంతి ఆట ఆడుతుండగా అది చెరువులో పడింది. దానిని తీసుకువచ్చేందుకు కొంతమంది యత్నించగా, పెద్దలు వారించటంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. అరగంట తర్వాత వెంకటేష్ బంతి తీసేందుకు చెరువులోకి దిగాడు. ఎంతసేపటికీ ఒడ్డుకు రాకపోవడాన్ని గమనించిన కొందరు పిల్లలు కేకలు వేసి స్థానికులకు విషయం వివరించారు. స్థానికులు వచ్చి గాలించినా వెంకటేష్ ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చెరువు వద్దకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అప్పటికే చీకటి పడటంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. కుమారుడి ఆచూకీ కోసం... ‘మా కుమారుడిని ఎవరూ కాపాడటం లేదు, నేనే రక్షించుకుంటా’ అంటూ తండ్రి శ్రీను చెరువులోకి దూకాడు. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా ఇద్దరి ఆచూకీ లభించలేదు. పులిగడ్డ నుంచి గజ ఈతగాళ్లను తీసుకువచ్చి వెదికించడంతో తండ్రి శ్రీను మృతదేహం, ఆ తర్వాత రాత్రి సమయంలో వెంకటేష్ మృతదేహం లభ్యమయ్యాయి. మృతుడు శ్రీనుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తె యల్లమ్మ (11)కు గుండె సంబంధ వ్యాధి రావడంతో తల్లి వీరమ్మ వైద్య పరీక్షల కోసం ఐదు రోజుల కిందట విజయవాడ తీసుకువెళ్లింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించి వెంకటేష్‌ను గాలించి ఉంటే తన తమ్ముడు నీట మునిగేవాడు కాదని శ్రీను అక్క నాంచారమ్మ భోరున విలపిస్తూ చెప్పింది. అవనిగడ్డ సీఐ రమణమూర్తి, ఎస్సై శ్రీనివాస్, తహశీల్దార్ వెన్నెల శ్రీను ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.