మెర్కెల్ (జర్మనీ), ట్రూడ్ (కెనడా), మాక్రాన్ (ఫ్రాన్స్)లతో ట్రంప్
లామాల్బె(కెనడా): ఊహించినట్లుగానే జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు వాడివేడిగా జరిగింది. మిత్ర దేశాల అల్యూమినియం, ఇనుము, వాహనాల ఎగుమతులపై అమెరికా టారిఫ్‌లు పెంచిన అంశం చర్చలను కుదిపేసింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాకున్నా అమెరికా ఒక వైపు, మిగిలిన ఆరు దేశాలు మరోవైపు చీలిపోయినట్లు తెలుస్తోంది.
వాణిజ్య సంబంధాల పునఃపరిశీలనకు సంబంధించి ఉమ్మడి ప్రకటన వెలువరించాలని ట్రంప్ చేసిన సూచనను మిగిలిన దేశాలు పట్టించుకోలేదని తెలిసింది. సుంకాల పెంపుతో ఇతర దేశాల్లో నెలకొన్న వ్యతిరేకతను ఉమ్మడి ప్రకటన లాంటివి దాచలేవని భావించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫలితంగా కెనడాలోని క్యూబెక్‌లో జరిగిన రెండు రోజుల సదస్సు శనివారం ప్రతిష్టంభనతోనే ముగిసింది.
విభేదాలు ప్రస్ఫుటం..
వాణిజ్య యుద్ధానికి దారితీసేలా ఉన్న పరిణామాల నడుమ..రష్యాను జీ–7 కూటమిలోకి తిరిగి చేర్చుకోవాలని ట్రంప్ చేసిన ప్రతిపాదన పుండు మీద కారం చల్లినట్లయింది. ఈ సూచనను ఐరోపాకు చెందిన కూటమి సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఆతిథ్య దేశం కెనడా ప్రధాని ట్రూడో నేతృత్వంలోని సభ్య దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని అక్రమమని పేర్కొన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ ఇమాన్యుయేల్ స్పందిస్తూ..చర్చలు నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా జరిగాయని అన్నారు.
వాణిజ్యం క్లిష్ట వ్యవహారంగా మారిందని, అయినా అన్ని దేశాలు అభివృద్ధిచెందేందుకు మార్గాలున్నాయని తెలిపారు. భద్రతా కారణాలతో ఇతర దేశాల వస్తువులపై సుంకాలు పెంచామన్న ట్రంప్ వాదనను కెనడా తోసిపుచ్చింది. తమ ఎగుమతులతో అమెరికాకు ముప్పు ఉందని పేర్కొనడం సమర్థనీయం కాదని తిప్పికొట్టింది. వాణిజ్యం, పర్యావరణం, ఇరాన్ ఒప్పందం తదితరాలపై ట్రంప్ వైఖరిని తప్పుపట్టిన యూరోప్ దేశాలు..తామూ అమెరికాపై ప్రతిచర్యలకు దిగుతామని హెచ్చరించాయి.
Comments
Please login to add a commentAdd a comment