నిమిషంలోనే ఫుల్ చార్జ్!
అల్యూమినియం రేకు కాదిది. మొబైల్ ఫోన్ బ్యాటరీ! ప్రపంచంలోనే తొలి అల్యూమినియం అయాన్ బ్యాటరీ అయిన ఇది జస్ట్.. అరవై సెకన్లలోనే రీచార్జ్ అయిపోతుంది! ధర కూడా చవకే. దీనిని వంచొచ్చు. మడత కూడా పెట్టుకోవచ్చు! మొబైల్‌ఫోన్లను చిటికెలో ఫుల్ చార్జ్ చేసే ఈ సరికొత్త బ్యాటరీని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు.
బ్యాటరీ పేలి గాయాలు కావడం, అరుదుగా ప్రాణాలు పోవడమూ మనం చూస్తున్నాం. కానీ ఈ బ్యాటరీతో ఆ ప్రమాదం కూడా లేదు. ఎందుకంటే ఇది కాలదు. మంటల్లో వేసినా పేలదు! ఇంతకుముందు అల్యూమినియం అయాన్ బ్యాటరీ తయారీ కోసం చాలా మంది ప్రయత్నించినా, క్యాథోడ్ ఎలక్ట్రోడ్ తయారీలో విఫలమయ్యారు. కానీ స్టాన్‌ఫోర్డ్ శాస్త్రవేత్తలు దీనికి ఆనోడ్‌గా అల్యూమినియంను, క్యాథోడ్‌గా గ్రాఫైట్‌ను, ఎలక్ట్రోలైట్‌గా అయానిక్ లిక్విడ్‌ను ఉపయోగించి విజయం సాధించారు.