
డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో శరవేగంగా అభివృద్ధి
ఆర్థిక వ్యవస్థ రూ.6 లక్షల కోట్లకు చేరింది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం
‘అడ్వాంటేజ్ అస్సాం 2.0’ సదస్సు ప్రారంభం
గౌహతి: ఈశాన్య ప్రాంతంలోని పవిత్ర భూమి అస్సాంలో నూతన శకం ఆరంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ అభివృద్ధి, సౌభాగ్యంలో ఈశాన్య భారతదేశం కీలక పాత్ర పోషించిందని ఉద్ఘాటించారు. ‘వికసిత్ భారత్’ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ లక్ష్య సాధనకు ఈశాన్య రాష్ట్రాలు పూర్తి శక్తిసామర్థ్యాలు ప్రదర్శించబోతున్నాయని పేర్కొన్నారు. అస్సాం రాజధాని గౌహతిలో మంగళవారం ‘అడ్వాంటేజ్ అస్సాం 2.0’ పేరిట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల సదస్సును మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రెండు రెట్లు వృద్ధిచెంది, రూ.6 లక్షల కోట్లకు చేరుకుందని హర్షం వ్యక్తంచేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ వేగం వల్ల వచ్చే ఫలితాలేమిటో ప్రత్యక్షంగా చూస్తు న్నామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటకీ ఇండియా ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు తీస్తోందని, ఆర్థిక నిపుణులు సైతం ఈ విషయాన్ని ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారని తెలి పారు. ఈ శతాబ్దంలో రాబోయే 25 ఏళ్ల ప్రగతి కోసం సుదీర్ఘ దార్శనికతతో పని చేస్తున్నామని చెప్పారు.
నైపుణ్యాలు, నవీన ఆవిష్కరణల్లో ముందంజలో ఉన్న మన యువతపై ప్రపంచ దేశాలు ఎనలేని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయని వెల్లడించారు. స్థానిక సప్లై చైన్లను బలోపేతం చేశామని, ప్రపంచ దేశాలతో స్వే చ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. తూర్పు ఆసియాతో మనకు బలమైన అనుసంధానం ఉందని, ఇండియా–మిడిల్ ఈ స్టు–యూరప్ ఎకనామిక్ కారిడార్‌తో నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.
సెమీకండక్టర్ల తయారీలో ముందంజ
సెమీకండక్లర్ల తయారీ రంగంలో మన దేశం ముందుకు దూసుకెళ్తుండడం శుభ పరిణామం అని ప్రధానమంత్రి తెలిపారు. సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ రంగంలో మరిన్ని ఆవిష్కరణల కోసం ఐఐటీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగం విలువ ఈ దశాబ్దం ఆఖరు నాటికి 500 బిలియన్ డాలర్లకు(రూ.43.59 లక్షల కోట్లు) చేరనుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి మరో 500 గిగావాట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 2030 నాటికి వార్షిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని 5 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు.
అన్ని రంగాల్లో సంస్కరణలు
ఆర్థిక వ్యవస్థకు ఉ్రత్పేరకంగా నిలిచేలా నేడు అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి చెప్పారు. సులభతర వాణిజ్యాన్ని(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మరింత ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టామని అన్నారు. పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణల సంస్కృతికి ఊతం ఇవ్వడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. స్టార్టప్‌లు, తయారీ రంగ పరిశ్రమలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం అద్భుతమైన విధానాలు ప్రవేశపెట్టామని తెలియజేశారు. సంస్థాగత సంస్కరణలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలన్నీ కలిసి మన దేశాభ్యుదయానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment