అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈ స్థాయికొచ్చా: మోదీ
బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఎన్నికల ప్రచారం
పూర్ణియా/రాయ్‌గంజ్: అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి తాను ఎంతగానో రుణపడి ఉన్నానని ప్రధాని మోదీ అన్నారు. పేద కుటుంబంలో జన్మించిన తాను రాజ్యాంగం కల్పించిన అవకాశాల వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. మోదీ మరోసారి ప్రధాని అయితే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. మంగళవారం బిహార్, పశ్చిమ బెంగాల్‌ల్లోని పలు పట్టణాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాలుపంచుకున్నారు. అస్సాంలోని గువాహటిలో రోడ్‌లో పాల్గొన్నారు. రాజ్యాంగం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నవారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని, తాను ఆ వర్గాల నుంచి రావడమే అందుకు కారణమని పేర్కొన్నారు.
సీఏఏను అమలు చేసి తీరుతాం...
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు తాము భయపడడం లేదని, చట్టాన్ని అమలు చేసి తీరుతామని అన్నారు. సీఏఏను వ్యతిరేకించేవారంతా మోదీ పట్టుదల గురించి తెలుసుకోవాలని చెప్పారు. ప్రతిపక్షాలు ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా దేశంలోకి అక్రమ చొరబాట్లు చోటుచేసుకుంటున్నాయని, దీనివల్ల పేదలకు, దళితులకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని పెద్ద ఘనతగా మోదీ అభివర్ణించారు. రాజ్యాంగం అంటూ గగ్గోలు పెడుతున్నవారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే రాజ్యాంగాన్ని జమ్మూకశ్మీర్‌లో ఎందుకు అమలు చేయలేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment