మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పిలుపు
కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోందని మండిపాటు
ఆర్టికల్ 370ని మళ్లీ తెచ్చే శక్తి ఎవరికీ లేదని వెల్లడి
ధూలే/నాసిక్: మనమంతా ఒక్కటిగా కలిసికట్టుగా ఉంటేనే ఎప్పటికీ సురక్షితంగా ఉంటామని(ఏక్ హై తో సేఫ్ హై) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శుక్రవారం మహారాష్ట్రలోని ధూలే, నాసిక్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)పై విమర్శలు గుప్పించారు. చక్రాలు, బ్రేకులు లేని ఎంవీఏ వాహనంలో డ్రైవర్ సీటును ఆక్రమించుకోవడానికి కూటమి నేతలు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఆ కూటమికి ఒక దశ దిశ లేదన్నారు. అభివృద్ధి అజెండాతో ముందుకొచి్చన మహాయుతి కూటమిని మరోసారి గెలిపించాలని మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రచార సభల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ బంటేంగే తో కటేంగే(విడిపోతే నష్టపోతాం) అని నినదించగా, మోదీ బదులిస్తూ ‘ఏక్ హై తో సేఫ్ హై’ అని పిలుపునిచ్చారు. వినాయక్ దామోదర్ సావర్కర్, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే దేశానికి ఎన్నో సేవలు చేశారని ప్రధానమంత్రి కొనియాడారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీని మహారాష్ట్రకు రప్పించి, సావర్కార్, థాకరే గురించి 15 నిమిషాలు ప్రశంసిస్తూ మాట్లాడించగల సత్తా మీకుందా? అని ఎంవీఏ కూట మి నేతలకు సవాలు విసిరా రు. విభజన రాజకీయాలకు మారు పేరు కాంగ్రెస్ అని మండిపడ్డారు. స్వార్థం కోసం కులాల మ« ద్య చిచ్చు పెట్టడం ఆ పార్టీకి అలవాటేనని ధ్వజమెత్తారు. జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచి రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఇప్పుడు నాలుగో తరం యువరాజు(రాహుల్ గాం«దీ) కూడా కులాల పేరిట సమాజాన్ని విడదీస్తున్నారని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు.
ప్రజలు కలిసి ఉంటే కాంగ్రెస్ ఆటలు సాగవు
ఒక కులంపై మరో కులం పోరాడేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండా. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు అభివృద్ధి చెందడం, తగిన గుర్తింపు పొందడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. మనమంతా కలిసి ఉంటేనే భద్రంగా ఉంటామని అందరూ గుర్తుంచుకోవాలి. ఐక్యంగా ఉండాలి. కాంగ్రెస్ విసురుతున్న వలలో చిక్కుకోవద్దు. అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉంటే కాంగ్రెస్ ఆటలు సాగవు.
జమ్మూకశ్మీర్‌లో భారత రాజ్యాంగాన్ని వర్తింపజేయకుండా కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి కుట్ర పన్నుతోంది. అక్కడ అంబేడ్కర్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుంది. అందులో మరో మాటలేదు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాకిస్తాన్ అజెండాను ప్రోత్సహిస్తున్నాయి. విభజనవాదుల భాష మాట్లాడుతున్నాయి. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలంటూ జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు వెళ్లగొట్టారు. కాంగ్రెస్ కుతంత్రాలను దేశం అర్థం చేసుకుంటోంది’’ అని నరేంద్ర మోదీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment