మహారాష్ట్రలోని కడెగావ్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్
పుణేలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మా గ్యారంటీలు కచ్చితం.. మీలా విఫల హామీలు కాదు
కేంద్ర మంత్రి, అధికారి ఆధ్వర్యంలో కమిటీని పంపండి
మా హామీల అమలు వివరాలన్నీ అందజేస్తా..
ఏదైనా తప్పు ఉంటే క్షమాపణలు చెప్తా..
సాక్షి,ముంబై: పదకొండేళ్ల పాలన తర్వాత కూడా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక్క విజయగాథ లేదని సీఎం రేవంత్ విమర్శించారు. వారికి చెప్పుకోవడానికి ఏమీ లేకనే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన రేవంత్ సోమవారం పుణెలో మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రధాని అయ్యాక కార్పొరేట్ కంపెనీలకు రూ.16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారని.. అదే తాము రైతులకు రుణమాఫీ చేస్తే బీజేపీ నేతలు ప్రశ్నించడం ఏమిటని నిలదీశారు.
హామీలు అమలు చేశాం.. వచ్చి చూడండి
తెలంగాణలో కాంగ్రెస్ హామీల అమలు విషయంలో ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘‘ఇచ్చిన హామీలన్నింటిలో విఫలమైన ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలోని కాంగ్రెస్ ప్రభుత్వాల హామీలపై ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసింది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో నేను మోదీకి సవాల్ విసురుతున్నాను.
కేంద్ర మంత్రి లేదా కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి తెలంగాణకు పంపండి. మేం ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తున్న వివరాలన్నీ వారికి ఇస్తాం. అవసరమైతే వారు హైదరాబాద్‌కు వచ్చేందుకు విమాన ఖర్చులు కూడా మేమే భరిస్తాం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది.
మంగళవారం బీజేపీ నాయకులు హైదరాబాద్‌కు వస్తే సచివాలయంలో కూర్చోబెట్టి నేను చెప్పిన ప్రతి అంశంపై వివరాలు అందజేస్తా. అందులో ఏవైనా తప్పులు ఉంటే క్షమాపణలు చెబుతా..’’ అని చెప్పారు. తమ గ్యారంటీలన్ని ఖచ్చితమైనవని, మోదీలా విఫల హామీలు కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. భారతీయ జూటా (అబద్ధాల) పార్టీ అని అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment