లోక్‌సభ ఎన్నికల వేళ అమల్లోకి తెచ్చిన మోదీ సర్కారు
పశ్చిమబెంగాల్లో బాగా కలిసొస్తుందని ఆశాభావం
కేరళ, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రభావం
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి
అడ్డుకుంటామంటున్న మమత, విజయన్
చిదంబరం వ్యాఖ్యలతో మళ్లీ దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కేరళ, అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఫలితాలను బాగా ప్రభావితం చేసేలా కని్పస్తోంది. ఈ చట్టానికి నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు ఆమోదం లభించినా దేశవ్యాప్త వ్యతిరేకత, ఆందోళనలు తదితరాల నేపథ్యంలో అమలు మాత్రం వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు సరిగ్గా ఎన్నికల ముందు దేశమంతటా సీఏఏను అమల్లోకి తెస్తూ మార్చి 11న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఎవరేమన్నా సీఏఏ అమలుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పాలక బీజేపీ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో సీఏఏ ప్రస్తావనే లేకపోవడంపై విపక్ష ఇండియా కూటమి పక్షాలతో పాటు కేరళ సీఎం విజయన్ విమర్శలు గుప్పించారు. దాంతో, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ వివాదాస్పద చట్టాన్ని పార్లమెంటు తొలి సమావేశాల్లోనే రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి.చిదంబరం ప్రకటించారు. దాంతో సీఏఏపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది.
బెంగాల్లో మథువా ఓట్లు బీజేపీకే
రాష్ట్రంలో 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీఏఏ హామీతోనే బీజేపీ బాగా బలపడింది. రాష్ట్రంలో అధిక సంఖ్యాకులైన నామశూద్ర (మథువా) సామాజికవర్గంలో బీజేపీకి ఆదరణ పెరిగింది. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ రికార్డు స్థాయిలో ఏకంగా 18 సీట్లు గెలిచింది. తాజాగా చట్టాన్ని అమల్లోకి తేవడం మరింతగా కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది.
దళితులైన మథువాలు దేశ విభజన సమయంలో, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సందర్భంగా అక్కడి నుంచి భారీగా బెంగాల్లోకి వలస వచ్చారు. ఉత్తర 24 పరగణాలు, నదియా, పూర్వ బర్ధమాన్, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్ జిల్లాల్లో నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులకు పౌరసత్వం లేదు. అందుకే సీఏఏ చట్టానికి అత్యధికంగా మద్దతిస్తున్నది వీరే. 2019 డిసెంబర్‌లో పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించినప్పటి నుంచీ దాని అమలు కోసం డిమాండ్ చేస్తున్నారు.
బెంగాల్లో మతువా ఓటర్లు దాదాపు 1.75 కోట్లు ఉన్నట్టు అంచనా! బొంగావ్, బసీర్హాట్, రాణాఘాట్, కృష్ణానగర్, కూచ్ బెహార్ తదితర లోక్‌సభ స్థానాల్లో వీరి ఓట్లు నిర్ణాయకం! వీటిలో ఎస్సీ రిజర్వుడు స్థానాలైన బొంగావ్, రాణాఘాట్, కూచ్ బెహార్ 2019 ఎన్నికల్లో బీజేపీ వశమయ్యాయి. బసీర్హాట్, కృష్ణానగర్ తృణమూల్ పరమయ్యాయి. బొంగావ్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి శంతను ఠాకూర్‌ది మథువా సామాజికవర్గమే. ఈసారి కూడా బీజేపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం జనాభా 30 శాతమని అంచనా.
అసోం: అసోం (14)తో కలిపి ఈశాన్య రాష్ట్రాల్లో 25 లోక్‌సభ స్థానాలున్నాయి. వాటిలోనూ సీఏఏ ప్రభావం బాగా ఉంటుందని అంచనా. బెంగాలీ మాట్లాడే శరణార్థులందరినీ ‘హిందూ–ముస్లింలు’గా, ‘చొరబాటుదారులు’గా స్థానికులు పరిగణిస్తారు. వారికి పౌరసత్వమిస్తే తమ గుర్తింపు, సంస్కృతి, సామాజిక సమీకరణాల వంటివన్నీ తలకిందులవుతాయని పలు ఈశాన్య రాష్ట్రాలు ఆందోళనగా ఉన్నాయి. ముఖ్యంగా అసోం రాజకీయాలు దశాబ్దాలుగా బెంగాలీ వ్యతిరేక భావజాలం చుట్టే కేంద్రీకృతమై ఉన్నాయి.
అసోంలో ముస్లింలు ఏకంగా 34 శాతం ఉన్నారు. అసోం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 25కు ముందు శరణార్థులుగా వచ్చిన వారిని ఎన్‌ఆర్‌సీలో చేర్చేందుకు వీలు కలి్పంచారు. అలా దరఖాస్తు చేసుకున్న 3.3 కోట్ల మందిలో 19 లక్షల మందిని తుది లెక్కింపులో అనర్హులుగా ప్రకటించారు. వారిలో అత్యధికులు హిందువులే. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది.
నిజమైన భారతీయులను పక్కన పెట్టారంటూ ఆందోళనకు దిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మరో 5 లక్షల పై చిలుకు బెంగాలీ హిందువులకూ తుది ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కలేదు. వారంతా ఇప్పుడు సీఏఏ నుంచి ప్రయోజనం పొందుతారు. అసోం అస్తిత్వ పరిరక్షణే ప్రధాన నినాదంగా 2016, 2021 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రెండుసార్లూ బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అసోంలో స్థిరపడిన మియా ముస్లింలపై స్థానికంగా ఉన్న ఆగ్రహం కారణంగా సీఏఏకు రాష్ట్రంలో బాగా మద్దతు కనిపిస్తోంది.
కేరళ: ఈ దక్షిణాది రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. హిందువులతో పాటు ఇక్కడ అధిక సంఖ్యాకులైన క్రైస్తవ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీకి సీఏఏ కొత్త ఆశాకిరణంగా కనిపిస్తోంది. సీఏఏ అమలు నేపథ్యంలో వారు తమకు మద్దతిస్తారని బీజేపీ భావిస్తోంది. తిరువనంతపురంలో క్రెస్తవుల ఓట్లు 14 శాతానికి పైగా ఉన్నాయి. పథనంతిట్ట త్రిసూర్ లోక్‌సభ స్థానాల పరిధిలోనూ హిందూ, ముస్లింల కంటే క్రైస్తవులే అధిక సంఖ్యాకులు. పలు స్థానిక క్రైస్తవ మిషనరీలు ఇప్పటికే సీఏఏకు మద్దతు పలికాయి.
ఇదీ విపక్షాల వాదన!
సీఏఏ ప్రకారం పౌరసత్వం పొందేందుకు అర్హుల జాబితాలో ముస్లింలను చేర్చకపోవడాన్ని విపక్షాలన్నీ తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పాక్, అఫ్తాన్, బంగ్లాల్లో ముస్లింలు మైనారిటీలు కారు గనకే చేర్చలేదన్న బీజేపీ వాదన సాకు మాత్రమేనని ఆక్షేపిస్తున్నాయి. పౌరసత్వం లేకుండా భారత్‌లో నివాసముంటున్న లక్షలాది మంది ముస్లింలను వెళ్లగొట్టడమే బీజేపీ లక్ష్యమని ఘాటుగా విమర్శిస్తున్నాయి. సీఏఏను నేషనల్ రిజిస్ట్రర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)తో అనుసంధానించడం వెనక ఉద్దేశం కూడా ఇదేనంటున్నాయి. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలంటూ కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం తదితర పారీ్టలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
ఏమిటీ సీఏఏ చట్టం...?
► విదేశాల్లో మతపరమైన వివక్ష బాధితులై ఊచకోతకు గురైన మైనారిటీలకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ–2019 చట్టం ఉద్దేశం.
► పాకిస్తాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో ఇలా మత హింస బాధితులై 2014 డిసెంబర్ 31, అంతకు ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు. ఈ జాబితాలో హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్శీ, క్రైస్తవ మైనారిటీలున్నారు.
► వారికి సీఏఏ చట్టం కింద ఫాస్ట్‌ట్రాక్ విధానంలో ఆరేళ్లలో భారత పౌరసత్వం కల్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment