2024 సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడవ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. జరిగిన ఆరు దశల్లో నమోదైన అత్యల్ప ఓటింగ్ శాతం ఓటర్లలోని నిరుత్సాహాన్ని తెలియజేస్తోంది. ఎన్నికల సరళిని బట్టి బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యాలను మార్చుకోవడం కూడా మిశ్రమ సందేశాన్ని అందిస్తోంది. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ‘మోదీ హవా’ కనిపించింది. కానీ అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి దాన్ని ఉదాసీనత భర్తీ చేసింది. ‘ఈసారి 400 సీట్లు దాటుదాం’ అన్న నినాదం ఎత్తుకోవడంతో కూడా కాషాయపార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్లా ప్రతిపక్షాలను, ప్రధానంగా సమాజ్‌వాదీ పార్టీని అదుపులో ఉంచడంలో మాత్రం బీజేపీ విజయం సాధించింది.
చాలామంది రాజకీయ పండితులతోపాటు, మేము మాట్లాడిన అత్యధిక సాధారణ ఓటర్ల ప్రకారం... 2014, 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఏమంత ఉత్సాహంగా లేవు. బీజేపీ సంపూర్ణ ఆధిపత్యం, ఎటువంటి బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం దీనికి కారణాలు. బీజేపీ ప్రధాన మద్దతుదారుల్లో ఉన్న అసంతృప్తి కూడా ఎన్నికల ఉత్సాహాన్ని తగ్గించింది. ఎన్నికల సరళిని బట్టి బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యాలను మార్చుకోవడం కూడా మిశ్రమ సందేశాన్ని అందిస్తోంది.
ఎన్నికల తొలి దశల్లో ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టింది. అన్ని వైపులా పేలవమైన ప్రచారం, విజేత ముందుగానే తెలిసిపోవడం లాంటివి వీటికి కారణాలు. వీటన్నింటికీ మించి, ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికలలో మరో రెండు అంశాలు గమనించదగినవి: ఒకటి, బీజేపీ తన తిరుగులేని స్థితిని సాధించిన విధానం. దీనిని మనం గుజరాత్ నమూనా ఎన్నికల ఆధిపత్యం అని పిలవొచ్చు. రెండు, ‘శాంతి భద్రతల’ ప్రాముఖ్యత. అందువల్లే, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఎప్పటిలాగే, బీజేపీ ఎన్నికల ప్రచార ఒరవడిని జాగ్రత్తగా ప్లాన్ చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ స్పష్టంగా ఈ ప్రణాళికలో భాగమే. ఇది నిజంగానే ఉత్కంఠకు దారితీసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు నెలలు... బీజేపీ నాయకుడొకరు చెప్పినట్లుగా, ‘ఇది గర్భధారణకు సంబంధించిన చివరి త్రైమాసికం. బూత్ స్థాయి కార్యకర్తలను ప్రసవానికి సిద్ధం చేయడంలో ఇది చాలా కీలకం’. ఈ మూడు నెలల్లో స్పష్టంగా ‘మోదీ హవా’ కనిపించింది. కానీ ఉత్సాహం ఒక్కసారి శిఖర స్థాయికి వెళ్లాక, అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి దాన్ని ఉదాసీనత భర్తీ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా గణనీయంగా 40–50 శాతం వరకు కూడా ఉంది. అందుకే పశ్చిమ యూపీలోని కీలకమైన యుద్ధభూమిలో ఓటింగ్ మొదటి కొన్ని దశల్లో బీజేపీ కీలక కర్తవ్యం, దాని ప్రధాన ఓటు పునాదిని ఏకీకృతం చేయడంగానే ఉండింది. 2013 అల్లర్ల నుండి స్థానికంగా ఉన్న హిందూ, ముస్లిం తగాదాల కారణంగా ఇది బీజేపీకి సులభమైన పనిగా కనిపించింది. అలాగే ముఖ్యమంత్రి కూడా బలమైన సానుకూల అంశంగా కొనసాగుతున్నారు. జాతీయ సమస్యల విషయంలో మోదీ రికార్డుపై ఓటర్లు ఆధారపడుతున్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం శాంతిభద్రతల నిర్వహణ విషయంలో యోగీ అందించిన తోడ్పాటునే ఎక్కువ పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఓటర్ల ఉత్సాహం ఉధృతంగా ఉంది. అయినప్పటికీ స్పష్టమైన ప్రభంజనం మాత్రం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే అప్పటికి సిట్టింగ్ ఎంపీలపై ఆగ్రహం రూపంలో అనేక వ్యతిరేకతలు గూడుకట్టుకుని ఉన్నాయి. ద్రవ్యోల్బణం, సంచరించే పశువుల బెడద, తప్పుడు అభ్యర్థుల ఎంపిక కారణంగా బీజేపీ మీద విసుగు చెందిన అనేక మందిని మేము చూశాము. అయినప్పటికీ ఓటు విషయానికి వస్తే, ఎక్కువ మంది తాము బీజేపీకే ఓటు వేస్తామని అంగీకరించారు.
ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుందన్న ఊహాగానాలు ఎలా ఉన్నప్పటికీ, యూపీలో బీజేపీ గుజరాతీకరణకు ప్రయత్నిస్తోంది. అంటే కుల ఇంజినీరింగ్ ద్వారా తమ ఓటు పునాదిని నిర్మించడం, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయడం. బూత్, జిల్లా స్థాయుల్లో ఎంతోమంది విపక్ష నేతలు పార్టీలు మారి బీజేపీలో చేరారనేది ఆశ్చర్యం కలిగించే అంశం. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్లా ప్రతిపక్షాలను, ప్రధానంగా సమాజ్‌వాదీ పార్టీని తగ్గించడంలో బీజేపీ విజయం సాధించింది. ఇటావా, మైన్‌పురీ, కన్నౌజ్‌లలో తప్ప ఎక్కడా సమాజ్ వాదీ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నట్లు కనిపించదు. ఇది తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి నుండి కూడా స్పష్టమైన మార్పును సూచిస్తోంది.
గత కొన్ని నెలల్లో ఒక్క గోరఖ్‌పూర్ ప్రాంతంలోనే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 11,000 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారని ఒక హిందీ వార్తాపత్రిక పేర్కొంది. చెప్పాలంటే, రెండు నెలల్లో యూపీలోని 10 మంది బీఎస్పీ ఎంపీల్లో ఐదుగురు బీజేపీలో చేరారు. బీజేపీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను– టికెట్ రానివారు లేదా ఏ కారణం చేతనైనా ఆయా పార్టీలలో పక్కన పెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కుశీనగర్‌లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన ఎస్పీ మాజీ ఎమ్మెల్యే నాథుని ప్రసాద్ కుశ్వాహా ఇటీవలే బీజేపీలో చేరారు. అదేవిధంగా, 2019 గోరఖ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రోజునే బీజేపీలో చేరారు.
ఒక పార్టీగా, కొత్తగా ప్రతిపక్ష నాయకులను చేర్చుకోవడం, అదే సమయంలో సొంత కార్యకర్తలను సంతోషంగా ఉంచడం వంటి భారీ సవాళ్లను బీజేపీ ఎదుర్కొంటోంది. దీనివల్ల అనివార్యంగా బీజేపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. అలాంటి ఆగ్రహానికి గురైన ఒక కార్యకర్త ‘భారతదేశంలో కాంగ్రెస్‌ను లేకుండా చేసే ప్రయత్నంలో, బీజేపీయే కాంగ్రెస్ అవుతోంది’ అని వ్యాఖ్యానించారు.
బలహీనమైన ప్రారంభం ఉన్నప్పటికీ, ఈ సంస్థాగతమైన తికమక బీజేపీ కంటే సమాజ్ వాదీ పార్టీనే ఎక్కువగా దెబ్బతీస్తోంది. ఎస్పీ బలహీనతను పసిగట్టిన బీజేపీ, మధ్యప్రదేశ్‌కు చెందిన యాదవ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను వ్యూహాత్మకంగా రంగంలోకి దింపింది. ఎస్పీ, ఆర్జేడీల యాదవుల ఓట్లను లాక్కోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి యూపీ, బిహార్‌లలో మోహన్ యాదవ్ పోస్టర్ బాయ్‌గా మారారు.
యూపీలోని ప్రత్యర్థి పార్టీల ఓటర్లు, మద్దతుదారుల విషయానికి వస్తే, తమ అభ్యర్థుల గెలుపు సాధ్యం కాదని గ్రహించడంతో వారిలో ఉదాసీనత మొదలైంది. మేం సర్వే చేసిన ఒక వ్యక్తి ఇలా చెప్పారు: యోగీజీ వల్ల ముస్లింలు, యాదవుల పరిస్థితి 1990లలో బిహార్, యూపీల్లోని బ్రాహ్మణులు, క్షత్రియుల మాదిరిగా తయారైంది. బయటకు వెళ్లి ఓటు వేయడానికి వారికి ఎటువంటి ప్రేరేపకమూ లేదు.
ఎందుకంటే ఇది వారికి ఎటువంటి లాభమూ చేకూర్చదు. వాస్తవానికి యూపీలో బీజేపీని రెండు సవాళ్లు ఇబ్బంది పెడుతున్నాయి. మొదటిది, యూపీలో మొదటి రెండు దశల్లో ఓటింగ్ శాతం దాదాపు 5 శాతం తగ్గింది. డజను కంటే కొంచెం ఎక్కువ నియోజకవర్గాల్లో దాదాపు 8.9 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రతి బూత్‌లోని ఒక్కో ఓటునూ విలువైనదిగా భావించి పనిచేసే పార్టీకి ఇది ఆందోళనకరం. రెండవది, ‘అబ్ కీ బార్, 400 పార్’ (ఈసారి 400 సీట్లు దాటుదాం) అంటూ మోదీ ఇచ్చిన పిలుపునకు ఎదురుదెబ్బ తగిలింది.
పార్టీని కొంతైనా అది వెనక్కి నెట్టింది. రిజర్వేషన్లను తగ్గించడానికి లేదా పూర్తిగా తొలగించడానికే బీజేపీ ఇంత భారీ మెజారిటీని కోరుతోందనే అత్యంత తీవ్రమైన అభియోగాన్ని ఆ పార్టీ ఎదుర్కొంటోంది (ఈ ప్రచారం 2015 బిహార్ రాష్ట్ర ఎన్నికలలో వారికి వ్యతిరేకంగా అత్యంత ప్రభావం చూపింది). ఆ సంక్షోభ తీవ్రతను తగ్గించడానికి చాలాకాలంగా ఉన్న హిందూ–ముస్లిం రగడతో సహా అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలనూ బీజేపీ సమీకరించింది.
వ్యాసకర్తలు శశాంక్ చతుర్వేది ‘ నిర్మా విశ్వవిద్యాలయం, అహ్మదాబాద్; డేవిడ్ ఎన్ గెలినర్ ‘ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్; సంజయ్ కుమార్ పాండే ‘ జేఎన్‌యూ, ఢిల్లీ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment